Road Accident: ఒడిశాలో రోడ్డు ప్రమాదం..హైదరాబాద్‌కు చెందిన ముగ్గురి మృతి
ABN , Publish Date - Jul 14 , 2024 | 04:55 AM
ఒడిశాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ముగ్గురు చనిపోయారు. రాష్ట్రానికే చెందిన మరో 15మందికి గాయాలయ్యాయి.
15 మందికి పైగా గాయాలు
ఈ నెల 8న నగరం నుంచి బస్సులో తీర్థయాత్రలకు వెళ్లిన 25 మంది
శనివారం తెల్లవారుజామున ప్రమాదం
చార్మినార్/హయత్‌నగర్/చంద్రాయాణగుట్ట, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఒడిశాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ముగ్గురు చనిపోయారు. రాష్ట్రానికే చెందిన మరో 15మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని ఉప్పుగూడకు చెందిన ఉదయ్ సింగ్ ఠాకూర్(52) వృత్తిరీత్యా డ్రైవర్. ప్రజలను తీర్థయాత్రలకు కూడా తీసుకువెళ్తుంటాడు. ఈ నేపథ్యంలోనే దానయ్యనగర్, కందికల్ గేట్, నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన 25 మందితో కలసి ఈశాన్య భారతంలోని దేవాలయాల సందర్శనకు టూర్ ప్లాన్‌ను సిద్ధం చేశాడు 12-15 రోజుల పాటు జరిగే ఈ యాత్ర కోసం శివాజీనగర్‌కు చెందిన నిత్యశ్రీ ట్రావెల్స్ నుంచి 22 సీటర్ల బస్సును(ఏపీ29 వీ 9277) మాట్లాడాడు.
బస్సును నడపడానికి మల్లేశ్ అనే మరో డ్రైవర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నెల 8వ తేదీన ఉప్పుగూడ నుంచి ఉదయ్‌సింగ్ కుటుంబసభ్యులతో పాటు మరో 19మంది ఈశాన్య భారత పర్యటనకు వెళ్లారు. 12న ఒడిశాలోని పూరీ జగన్నాథ దేవాలయంలో దర్శనం తర్వాత బాలాపూర్ మీదుగా బిహార్‌కు వెళ్తున్న క్రమంలో మయూర్‌భంజ్ జిల్లా బెత్తోనటి పోలీస్ స్టేషన్ వీరి బస్సును రాంగ్‌రూట్‌లో వచ్చిన ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉదయ్‌సింగ్, అతని సోదరుడు ఉప్పలయ్య(70), చెల్లెలు క్రాంతిబాయి(62) చనిపోయారు. డ్రైవర్ మల్లేశ్‌తో పాటు బస్సులో ఉన్న పలువురికి గాయాలయ్యాయి.
గాయపడిన వారిని బెత్తోనటి మెడికల్ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఒడిశాలో బస్సు ప్రమాదంపై కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాణికుల ఆరోగ్య పరిస్థితిపై స్థానిక జిల్లా అధికారులతో ఆయన మాట్లాడినట్లు తెలిసింది. కాగా, ప్రమాదంలో చనిపోయినవారి మృతదేహాలను వెంటనే వారి స్వస్థలాలకు పంపించాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని హోంమంత్రిత్వ శాఖ కార్యాలయం ఒడిశా అధికారులను కోరింది.