Share News

TS News: ధరణి బూచితో భూమి స్వాహా.. రూ.500 కోట్ల భూమి బోయినపల్లి వినోద్‌ సోదరుడికి రిజిస్ట్రేషన్‌

ABN , Publish Date - Mar 02 , 2024 | 03:47 AM

ధరణి దారుణాలకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు బలయ్యారు. 2002లో కొన్న భూముల ధరలు..

TS News: ధరణి బూచితో భూమి స్వాహా.. రూ.500 కోట్ల భూమి బోయినపల్లి వినోద్‌ సోదరుడికి రిజిస్ట్రేషన్‌

రూ.500 కోట్ల భూమి.. బోయినపల్లి వినోద్‌ సోదరుడికి రిజిస్ట్రేషన్‌

వట్టినాగులపల్లిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల కొనుక్కున్న

భూముల్ని కారుచౌకగా కొట్టేసిన వైనం

ధరణిలో భూదాన్‌ భూమిగా చూపి తక్కువ రేటుకు కొనుగోలు

2002లో 8 ఎకరాల భూమి కొన్న 63 మంది విప్రో ఉద్యోగులు

వారు పెట్టుకున్న సొసైటీ పేరిట 2009లో ఆ భూముల రిజిస్ట్రేషన్‌

111 జీవో ఎత్తివేతతో వాటి ధర పెరగడంతో బోయినపల్లి కన్ను!

సొసైటీ అధ్యక్షుడితో పాటు దాసోహం అన్న రెవెన్యూ అధికార్లు

అప్పటిదాకా నిషేధిత జాబితాలో ఉన్న భూమికి పాస్‌బుక్‌ జారీ

భూమిని రిజిస్ట్రేషన్‌ చేయొద్దన్న డీసీవో ఆదేశాలూ బేఖాతర్‌

ధరణి దారుణాలకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు బలయ్యారు. 2002లో కొన్న భూముల ధరలు.. 111 జీవో ఎత్తివేతతో భారీగా పెరగడంతో వారు ఆనందించారు. కానీ.. ఖరీదైన ఆ భూములపై గత ప్రభుత్వ పెద్దలకు బాగా దగ్గరైన ఓ బడాబాబు సోదరుడి కన్ను పడింది! అంతే.. 2009లోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల పేరిట రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తయిన ఆ భూములు ధరణిలో భూదాన్‌ భూములుగా నమోదయ్యాయి. దాన్ని చూపి ‘మీ భూములు మీకు రావు’ అని వారిని భయపెట్టి, ఆందోళనకు గురి చేసి.. సొసైటీ అధ్యక్షుడితో పాటు మరికొందర్ని తమ వైపు తిప్పుకొని ఆ భూమిని కొను గోలు చేయడానికి రంగం సిద్ధం చేశాడు. అంతే.. రికార్డులు తారుమారైపోయాయి. ధరణిలో అవి పట్టా భూములుగా మారిపోయాయి. ఆగమేఘాలపై రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. ‘ధరణి’ అనే భూతాన్ని తెరపైకి తెచ్చి నగరం నడిబొడ్డున రూ.500 కోట్ల భూమిని చౌకగా కొట్టేసిన దందా ఇది!!

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): సొంతింటి కలతో దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఓ సొసైటీగా ఏర్పడి ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కొందరు దారుణంగా మోసపోయారు. సొసైటీ అధ్యక్షుడు, మరికొందరు ముఖ్యుల చేతిలోనే నమ్మకద్రోహానికి గురై లబోదిబోమంటున్నారు. దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సంస్థ విప్రోలో పనిచేస్తున్న ఉద్యోగులు 63 మంది కలిసి 2002లో ‘సాఫ్ట్‌వేర్‌ అసోసియేట్స్‌ మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. అందరూ కలిసి వట్టినాగులపల్లిలో 8.07 ఎకరాల భూమి కొనుగోలు

చేశారు. సర్వే నంబర్‌ ‘181/అ’లోని 2.12 ఎకరాలతో పాటు 189/ఆ, 189/ఉ, 189/ఊ, 189/రు, 189/ఈ2 లోని 5.35 ఎకరాల భూమిని జీపీఏ ద్వారా సర్వోత్తమరెడ్డి, నీలారెడ్డి, మురళీకృష్ణ, నిత్యానంద అనే వ్యక్తుల నుంచి కొనుగోలు చేశారు. వీరంతా కలిసి ఈ లేఅవుట్‌ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా అది 111జీవో పరిధిలోకి వస్తుందని.. అనుమతి ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పారు. తర్వాత కొన్నాళ్లకు.. రియల్‌ ఎస్టేట్‌ ధరలు పెరగడంతో భూమిని సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు వెళ్తే.. అందులో కొంతభాగం భూదాన్‌భూమిగా రికార్డుల్లో ఉన్నందున రిజిస్ట్రేషన్‌ కుదరదని చెప్పారు. దీంతో వారు.. 25-11-2006న ఓ తహసీల్దార్‌ ఆ భూమితో పాటు పక్కన ఉన్న మరికొన్ని భూములకు ఇచ్చిన పట్టా క్లియరెన్స్‌ ఉత్తర్వులను రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులకు చూపించారు. 2009లో సొసైటీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. భూమి చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సర్వే నంబర్లలోని భూములను 111జీవో పరిధి నుంచి మినహాయించాలంటూ కొందరు కోర్టుకెళ్లారు. అందులో తీర్పు అనుకూలంగా వస్తే తమకు కూడా ఉపశమనం కలుగుతుందని సొసైటీ సభ్యులు భావించారు. వారు అనుకున్నట్లే ఆ భూమి 111 జీవో పరిధిలోకి రాదని 2022 ఏప్రిల్‌లో హైకోర్టు ప్రకటించింది. అదే సమయంలో... అసలు 111జీవోనే రద్దుచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. న్యాయస్థానం తీర్పు.. 111జీవో రద్దు నేపథ్యంలో ఆ భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఖాళీగా ఉన్న ఆ ఖరీదైన భూమిపై.. ఓ బడా వ్యక్తి కన్నుపడింది. వ్యవస్థలు తోడయ్యాయి. ధరణి భూతం తెరపైకి వచ్చింది. ఆ భూమిలో అధిక భాగం భూదాన భూమిగా ధరణిలో కనిపించింది. తమ కలలు నెరవేరుతున్నాయని సంబరపడ్డ సొసైటీ సభ్యులంతా.. ఈ పరిణామంతో అవాక్కయ్యారు. సొసైటీ అధ్యక్షుడు వేములపాటి ఉదయభాస్కర్‌, ఉపాధ్యక్షుడు బాల సుబ్రమణ్యంతో పాటు మేనేజింగ్‌ కమిటీ మెంబర్‌ కాటూరి వెంకట్‌.. దీనిపై ఆరా తీస్తామని సభ్యులకు చెప్పారు. కొన్నాళ్ల తర్వాత.. ఆ భూమి భూదాన్‌ భూమిగా రికార్డుల్లో ఉందని, దాన్ని మార్చడం కుదరదు కాబట్టి వచ్చిన రేటుకు తెగనమ్ముకుందామని అన్నారు.

అందుకు కొందరు అంగీకరించలేదు. ‘‘దీనిపై కొట్లాడదాం’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ సొసైటీ అఽధ్యక్షుడు.. ‘‘ఇప్పుడేమీ చేయలేం. ఎంతో కొంతకు తెగనమ్ముకోకపోతే మొత్తానికే నష్టపోతాం’’ అని వారికి నచ్చజెప్పారు. భూమిని కొనే పార్టీని కూడా తానే చూస్తానని.. అందరం కలిసి నిర్ణయం తీసుకుంటే వెంటనే డబ్బొచ్చే ఏర్పాటు కూడా చేస్తానని అన్నారు. ఇందుకు మెజారిటీ సభ్యులు అంగీకారం తెలిపి ఒక తీర్మానం కూడా చేశారు. అయితే.. నాలుగువారాల్లోగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావాలని, లేకుంటే తీర్మానం చెల్లదని కూడా అందులో రాసుకున్నారు. భూమి కొనేవారి వివరాలను సభ్యులకు కూడా తెలియజేయాలని.. వారితో బేరం కుదుర్చుకునే సమయంలో అందరినీ తీసుకెళ్లాలని కోరారు. కానీ, సొసైటీ అధ్యక్షుడు.. భూమి కొనేవారికి, సొసైటీ సభ్యులకు మధ్య ఎలాంటి సమావేశం నిర్వహించలేదు. ధర విషయం కూడా చర్చించలేదు. కొందరు సభ్యులకు అనుమానం వచ్చి నిలదీయడంతో.. గజానికి రూ.30 వేలు చొప్పున ఇప్పిస్తామని, అందులో గజానికి 25 వేల చొప్పున నగదు రూపంలో, మిగతా సొమ్మును చెక్‌ రూపంలో ఇస్తారని చెప్పుకొచ్చారు. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పక్క స్థలాలు గజం రూ.లక్ష నుంచి లక్షన్నర దాకా అమ్ముడవుతుండగా.. తమ భూమికి ఇంత తక్కువ ధర ఏమిటని ప్రశ్నించారు.

దీనికి అధ్యక్షుడు.. ‘‘కొద్ది రోజులు ఆగితే ఈ ధర కూడా రాదు. మొత్తం భూమీ ప్రభుత్వం చేతుల్లోకి వెళుతుంది’’ అని భయపెట్టారు. దీన్ని కొందరు సభ్యులు నమ్మారు. కానీ కొందరు సభ్యులకు అధ్యక్షుడిపై అనుమానం వచ్చి.. తమ భూమికి సంబంధించి క్రయవిక్రయాలు జరగకుండా చూడాలని రాష్ట్ర సహకార శాఖ ముఖ్యకార్యదర్శి రఘనందన్‌రావును కలిసి వినతి పత్రం ఇచ్చారు. తాము గతంలో భూమి అమ్మకం కోసం అధ్యక్షుడికి అధికారం ఇస్తూ ఇచ్చిన తీర్మానం గడువు ముగిసిందని.. అయినా కూడా ఆ పత్రాలతో సొసైటీ అధ్యక్షుడు, మరికొందరు కలిసి సొసైటీ భూమిని విక్రయిస్తున్నారని అందులో పేర్కొన్నారు. దీనిపై రఘనందన్‌రావు స్పందించి జిల్లా సహకార అధికారి (డీసీఓ) ధాత్రి దేవికి లేఖ రాశారు. ఆమె సొసైటీ సభ్యులందరినీ వేర్వేరుగా పిలిచి విచారించారు. ఈ భూముల విషయంలో ఏదో మతలబు జరుగుతోందని భావించి.. సొసైటీ భూమిని సభ్యులకు తప్ప బయట వ్యక్తులకు రిజిస్ట్రేషన్‌ చేయరాదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ కాపీలను స్థానిక తహసీల్దార్‌తో పాటు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖకు పంపారు. తరువాత దీనిపై పూర్తిస్థాయి నివేదిక కూడా ఉన్నతాధికారులకు పంపారు.

డీసీవో ఆదేశాలు పక్కనపెట్టి..

సొసైటీ సభ్యులకు కాకుండా మూడో వ్యక్తికి ఈ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయరాదని డీసీవో ఉత్తర్వులు జారీచేసిన కొన్ని గంటలకే ఈ భూమిని వేరేవారికి అమ్మడానికి రంగం సిద్ధమైంది. 2023 జనవరి 18న డీసీవో ఈ ఉత్తర్వులు స్థానిక తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌తో పాటు సొసైటీ సభ్యులకు పంపగా.. మర్నాడు ఉదయం పదిన్నర గంటలకు సొసైటీ సభ్యులు ఆ ఉత్తర్వులతో గండిపేట తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ వారికి.. సొసైటీ అధ్యక్షుడు వీవీఎస్‌ ఉదయ భాస్కర్‌తో పాటు భూమి కొనుగోలు చేస్తున్న ప్రతిమ కన్‌స్ట్రక్షన్‌ అధినేత బోయినపల్లి శ్రీనివాసరావు (బోయినపల్లి వినోద్‌ సోదరుడు) కనిపించడంతో కంగుతిన్నారు. రిజిస్ట్రేషన్‌ను ఆపాలంటూ డీసీవో ఉత్తర్వులు చూపించారు. కానీ.. ఆ ఉత్తర్వులను డిప్యూటీ తహసీల్దార్‌ పట్టించుకోలేదు. స్లాట్‌ బుక్‌ అయినందను రిజిస్ట్రేషన్‌ ఆపలేనని చెప్పారు. ఫలితంగా సొసైటీకి చెందిన 8.07 ఏకరాల భూమి రిజిస్ట్రేషన్‌ చకచకా జరిగిపోయింది. అదేరోజు మ్యుటేషన్‌.. 20వ తేదీన నాలా కన్వర్షన్‌ కూడా జరిగిపోయింది. డీసీవో నుంచి వ్యతిరేక ఉత్తర్వులు వస్తున్నాయని ముందుగానే తెలుసుకున్న సొసైటీ అధ్యక్షుడు, శ్రీనివాసరావు.. 2023 జనవరి 18న సాయంత్రం 6:21 నిమిషాలకు రిజిస్ట్రేషన్‌ నిమిత్తం ధరణిలో స్లాట్‌ బుక్‌ చేయడం గమనార్హం. అంతేకాదు.. 2023 జనవరి 14వ తేదీన సైతం నిషేధిత జాబితాలో ఉన్న ఆ భూముల విక్రయానికి అనుకూలంగా 17వ తేదీన పాస్‌బుక్‌ విడుదలైంది. ఆ పాస్‌బుక్‌ సాయంతోనే 19వ తేదీన రిజిస్ట్రేషన్‌ జరిగిపోయింది. రిజిస్ట్రేషన్‌ పూర్తి కాగానే.. బోయినపల్లి శ్రీనివాసరావు.. సొసైటీ సభ్యులందరి అకౌంట్లలోకీ గజానికి రూ.5,500 చొప్పున డబ్బు జమచేశారు. తనకు సహకరించిన వారికి మాత్రం మిగిలింది నగదుగా ఇచ్చి మిగతా వారికి మొండిచెయ్యి చూపారు. రిజిస్ట్రేషన్‌ అయ్యాక సొసైటీ చైర్మన్‌ ఉదయ భాస్కర్‌ కనిపించట్లేదని సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నట్లు సమాచారం.

భూదాన భూమి రికార్డుల్లో ఎలా మారింది?

భూమి సొసైటీ సభ్యుల చేతిలో ఉన్న సమయంలో ఽఅందులోని 189/ఆ, 189/ఉ, 189/ఊ, 189/రు, 189/ఈ2లలో గల 5.35 ఎకరాల భూమి భూదాన భూమిగా కనిపించింది. బోయినపల్లి శ్రీనివాసరావు ఈ భూమి వ్యవహారంలో దిగగానే.. భూదానభూమి కాస్తా ప్రైవేటుభూమిగా మారింది. రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ బుక్‌ చేయడానికి కొద్ది రోజుల ముందే ఈ రికార్డు మారడం గమనార్హం. ఈ వ్యవహారంలో శ్రీనివాసరావు.. సొసైటీ సభ్యులను అడ్డుపెట్టుకుని చక్రం తిప్పారు. ఫలితంగా.. అభ్యంతరాలున్నా రిజిస్ట్రేషన్‌ చకచకా జరిగింది. మరో విచిత్రమేమిటంటే ఇందులోని 5.35 ఎకరాల భూమిని నిషేదిత జాబితాలో గతంలోనే పెట్టారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌శాఖ వెబ్‌సైట్‌లో కూడా ఇప్పటికీ ఈ భూమి 22ఏలో ఉండడం గమనార్హం. అవి నిజంగా భూదాన్‌ భూములే అయ్యుంటే.. పాస్‌బుక్‌ ఎలా వస్తుంది? శ్రీనివాసరావుకు మాత్రం రిజిస్ట్రేషన్‌ ఎలా చేస్తారు? అని సొసైటీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.

కేసు పెట్టినా కొనసాగని విచారణ

తమకు జరిగిన అన్యాయంపై సొసైటీ సభ్యులు గచ్చిబౌలి పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే కనీసం తీసుకునేందుకు కూడా అప్పటి పోలీసులు సహకరించలేదు. దీంతో సభ్యులు అప్పటి సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్రను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో.. కేసు నమోదు చేయాలంటూ ఆయన గచ్చిబౌలి పోలీసులను చేయాలని ఆదేశించారు. దీంతో 2023 జూలై 7న పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ శ్రీనివాసరావు అధికార పార్టీకి దగ్గర వ్యక్తి కావడంతో కేసు విచారణకు పోలీసులు సాహసించలేదు. అలాగే.. తమకు జరిగిన అన్యాయంపై కొందరు సభ్యులు ఏప్రిల్‌ 2023లో హైకోర్టును ఆశ్రయించగా.. తీర్పు వచ్చే వరకూ అక్కడ ఎలాంటి నిర్మాణాలూ చేపట్టరాదని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ వాటిని బేఖాతరు చేస్తూ నిర్మాణాలు చేపట్టారు.

అక్కడే హెలీప్యాడ్‌ నిర్మాణం కూడా!

ఈ భూములను చట్ట విరుద్ధంగా కొనుగోలు చేసిన బోయినపల్లి శ్రీనివాసరావు.. వాటి చుట్టూ పకడ్భందిగా నిర్మాణాలు చేపట్టారు. చుట్టూ ఉన్న ప్రహరీగోడ మీద ముళ్ల కంచె వేసి.. లోపలికి ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాదు అందులో హెలీప్యాడ్‌ నిర్మాణం చేపట్టారు. పక్కనే చిన్న భవనాన్ని నిర్మించడం కూడా మొదలు పెట్టారు. ఈ విషయాన్ని సొసైటీ సభ్యులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లడంతో దాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా.. అక్కడ హెలీప్యాడ్‌ను తాను ప్రైవేటు సంస్థకు లీజుకు ఇచ్చానని శ్రీనివాసరావు కోర్టుకు తెలిపారు. కానీ ఆ సంస్థకు కూడా శ్రీనివా్‌సరావే యజమాని కావడం గమనార్హం. అసలక్కడి నుంచి కమర్షియల్‌ సర్వీసులకు అనుమతి ఉందా? లేదా? తెలుసుకునేందుకు సొసైటీ సభ్యులు డీజీసీఏను ఆర్టీవో ద్వారా సమాచారం కోరగా.. తాము ఆ ప్రాంతం నుంచి ఎలాంటి సర్వీసులకూ అనుమతి ఇవ్వలేదని డీజీసీఏ సమాధానం ఇవ్వడం గమనార్హం.

Updated Date - Mar 02 , 2024 | 06:23 AM