MLC by-election: పట్టభద్రుల ప్రాధాన్యం ఎవరికో!
ABN , Publish Date - May 26 , 2024 | 05:28 AM
మూడు ఉమ్మడి జిల్లాలు.. ఐదు లోక్‌సభ నియోజకవర్గాలు.. 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న శాసనమండలి స్థానం. 4,63,839 మంది పట్టభద్రులైన ఓటర్లకు 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నియోజకవర్గం.
ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్/నల్లగొండ, మే 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మూడు ఉమ్మడి జిల్లాలు.. ఐదు లోక్‌సభ నియోజకవర్గాలు.. 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న శాసనమండలి స్థానం. 4,63,839 మంది పట్టభద్రులైన ఓటర్లకు 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నియోజకవర్గం. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా మారిన ఉప ఎన్నిక. దీంతో సోమవారం పోలింగ్ జరగనున్న వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ తరఫున ఏనుగుల రాకే్‌షరెడ్డి బరిలోకి దిగారు. 2007 నుంచి నాలుగు పర్యాయాలు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఏకపక్షంగా గెలవగా, ఐదోసారి కూడా మళ్లీ పాగా వేయాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే గులాబీ కోటకు ఎలాగైనా చెక్ పెట్టి తమ జెండా ఎగురవేయాలని కాంగ్రెస్, బీజేపీ వ్యూహ, ప్రతివ్యూహాలతో హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. పట్టభద్రులను ఆకట్టుకునేందుకు అత్మీయ సమ్మేళనాలు, ఫోన్‌కాల్ పలకరింపులు, వాకర్స్‌తో మాటామంతీ లాంటి కార్యక్రమాలతో ప్రచారాన్ని హోరెత్తించారు. కాగా, శనివారం సాయంత్రం 4గంటలకు ప్రచారం ముగిసింది. దీంతో అభ్యర్థులు, కీలక నేతలు పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టారు. ఇక పోలింగ్‌లో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరికి ఏ ప్రాధాన్య ఓటు వేస్తోరోనన్నది ఉత్కంఠగా మారింది.
ఉప ఎన్నికకు ఏర్పాట్లు
బ్యాలెట్ పద్ధతిన జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. 605 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి, 807 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద ఐదుగురు పోలీసు సిబ్బంది చొప్పున మొత్తం 3,025మందితో భద్రత ఏర్పాటు చేశారు. అన్ని జిల్లా కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రిని పోలింగ్ స్టేషన్లకు తరలించేందకు ఏర్పాట్లు పూర్తిచేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ హరిచందన తెలిపారు.
కాంగ్రె్‌సకు సవాల్‌గా ఎమ్మెల్సీ ఎన్నిక..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. శాసనమండలిలో మెజారిటీ లేకపోవడంతో ప్రతి ఎమ్మెల్సీ ఎన్నిక ఆ పార్టీకి సవాల్‌గా మారింది. దీంతో నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కచ్చితంగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. గత ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాములునాయక్ నామమాత్రపు పోటీయే ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన తీన్మార్ మల్లన్న ద్వితీయ స్థానంలో నిలవడంతో ఈసారి కాంగ్రెస్ తన అభ్యర్థిగా మల్లన్ననే బరిలోకి దించింది. గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలోని టీజేఎ్‌సతో పాటు సీపీఐ, సీపీఎం కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఉభయ కమ్యూనిస్టులకు ఉన్న ఓటుబ్యాంకు తమకు కలిసి వస్తుందనే అంచనాలో కాంగ్రెస్ ఉంది. వీటికితోడు నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సకు చెందినవారే ఎక్కువ మంది ఉండటంతో ఆ పార్టీ నేతలు గెలుపు ధీమాలో ఉన్నారు. మూడు ఉమ్మడి జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. మరోవైపు మల్లన్న సొంతంగా టీమ్‌ను ఏర్పాటు చేసుకుని గత కొంతకాలంగా మూడు ఉమ్మడి జిల్లాల్లో తన సొంత ఓటుబ్యాంకును పెంచుకుంటూ వస్తున్నారు.
గత ఎన్నికలో ఇలా..
2021లో జరిగిన ఎన్నికలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి (బీఆర్‌ఎస్), తీన్మార్ మల్లన్న (స్వతంత్ర), ప్రొఫెసర్ కోదండరామ్ (టీజేఎస్) నడుమ హోరాహోరీ పోరు జరిగింది. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ కోటా ఓటు రాకపోవడంతో ద్వితీయ, తృతీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు కూడా కొనసాగి.. చివరకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. ఆయనకు పోటీగా తీన్మార్ మల్లన్న నిలిచారు.
మరో అవకాశం కోసం బీఆర్‌ఎస్ ఎత్తులు..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బీఆర్‌ఎ్‌సకూ సవాల్‌గా మారింది. వరుసగా నాలుగు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీయే విజయం సాధించింది. 2021లో గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనందున ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోవడంతోపాటు కీలక నేతలు పార్టీని వీడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారింది. బీజేపీ నుంచి బీఆర్‌ఎ్‌సలో చేరిన ఏనుగుల రాకేశ్‌రెడ్డిని తమ అభ్యర్థిగా నిలిపింది. బీఆర్‌ఎస్ ఓటుబ్యాంకుతో పాటు రాకేశ్‌రెడ్డికి ఉన్న పూర్వ పరిచయాలతో బీజేపీ ఓటు కూడా తమ వైపు మొగ్గు చూపుతుందనే అంచనాలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు ఆశించిన స్థాయిలో సీట్లు రావనే ప్రచారం ఉండటంతో ఎమ్మెల్సీ సీటునైనా కాపాడుకోవాలనే లక్ష్యంతో ఆ పార్టీ ఉంది. దీంతో ఆ పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. అభ్యర్థి రాకే్‌షరెడ్డి గెలుపు కోసం తీవ్రంగా ప్రచారం చేశారు.
గెలుపుపై బీజేపీ ఆశలు..
తెలంగాణలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీ అధిష్ఠానం.. ప్రతి ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విజయం కోసం పని చేయాలని ఆదేశించింది. కమలనాథులు అగ్రనేతలను ప్రచారంలోకి దింపుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాయల శంకర్, ఎంపీలు బండి సంజయ్, కె.లక్ష్మణ్‌తోపాటు ఈటల రాజేందర్, డీకే అరుణ తదితర నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 13.9 శాతం ఓట్లను పొందిన బీజేపీ.. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 35శాతం ఓట్లతోపాటు డబుల్ డిజిట్ స్థానాలను గెలుస్తామనే ధీమాతో ఉంది. ముఖ్యంగా యువత తమకు మద్దతుగా నిలిచిందన్న అంచనాలో ఉంది. ఈ అంశం గ్రాడ్యుయేట్ల ఎన్నికలోనూ తమకు కలిసి వస్తుందని భావిస్తోంది. కాగా, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న నల్లగొండకు చెందిన పాలకూరి అశోక్‌కుమార్ సైతం ప్రధాన పార్టీల అభ్యర్థులకు దీటుగా ప్రచారం సాగించడంతో బలమైన పోటీ దారుగా నిలిచారు.