కబాబ్ కా బాప్
ABN , Publish Date - Dec 15 , 2024 | 10:27 AM
అన్నిటికన్నా కొత్తగా, విభిన్నంగా ఉంటేనే ఎవరైనా గుర్తిస్తారు. ఆస్ర్టేలియాలోని కేంప్‌బెల్ పట్టణంలోని ‘కింగ్ కబాబ్ హౌస్’ కూడా అదే చేసింది. సాధారణ కబాబ్‌లు ఎక్కడైనా దొరుకుతాయి.
అన్నిటికన్నా కొత్తగా, విభిన్నంగా ఉంటేనే ఎవరైనా గుర్తిస్తారు. ఆస్ర్టేలియాలోని కేంప్‌బెల్ పట్టణంలోని ‘కింగ్ కబాబ్ హౌస్’ కూడా అదే చేసింది. సాధారణ కబాబ్‌లు ఎక్కడైనా దొరుకుతాయి. అందుకే ఇటీవలే ప్రపంచంలోనే అతి పెద్ద కబాబ్‌ను తయారు చేసింది. ఈ కబాబ్ ఏకంగా గిన్నిస్ రికార్డ్ అందుకుంది. ఈ భారీ కబాబ్ కథా కమామీషు ఏమిటంటే...
ఎవరికైనా నోరూరించే కబాబ్ అంటే మిడిల్ ఈస్ట్ దేశాలైన ఇరాన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఒమన్ వంటివి గుర్తొస్తాయి. అయితే ఆస్ర్టేలియాలోని కేంప్‌బెల్ టౌన్‌లోని క్వీన్ స్ర్టీట్‌లో ఉండే ‘కింగ్ కబాబ్ హౌస్’ ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఇటీవలే సదరు రెస్టారెంట్ ఏకంగా కబాబ్ మేకింగ్‌లో గిన్నిస్ రికార్డ్ సాధించింది. ఒకేచోట మూడు వందల మీటర్ల పొడవున్న టేబుల్స్‌ను అమర్చి, వాటిమీద రికార్డు కబాబ్ డిష్‌ను సర్వ్ చేశారు. వేలాదిమంది కబాబ్ ప్రియులు టేబుళ్లకు రెండు వైపులా నిలబడి కబాబ్‌ను ఆస్వాదించారు.
ఇదీ నేపథ్యం...
ఇరవై ఏళ్ల క్రితం ఆస్ర్టేలియాలోని చెఫ్ మౌలానా సిఫి తన ప్రత్యేకతను చాటాలనుకున్నాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టర్కీష్ క్యుజిన్ వంటకాలను తయారు చేయాలనే ఉద్దేశంతో ‘కింగ్ కబాబ్ హౌస్’ హోటల్ పెట్టాడు. ఇందులో నోరూరించే కబాబ్ ప్రత్యేక ఆకర్షణ. ఆయన కబాబ్ తిన్న ఆస్ర్టేలియన్లు, ఇతర దేశాలవాళ్లు భలే బాగుందని అన్నారు. స్థానికులు తమ ఇంటికి వచ్చిన అతిథులను లేదా ఆ ప్రాంతానికి వచ్చిన విదేశీయులను టూర్ ఆపరేటర్లు ఇక్కడకు తీసుకొచ్చి కబాబ్ రుచి చూపించేవాళ్లు. 2015లో మక్కా వెళ్లే వారికోసం ‘హలాల్ స్నాక్ ప్యాక్’ తయారు చేశారు వీళ్లు. బెస్ట్ ఫుడ్ అవార్డు కూడా గెలుచుకున్నారు. ఇంతగా ప్రాచుర్యం పొందిన ‘కింగ్ కబాబ్ హౌస్’ పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోవటానికి అతి పెద్ద కబాబ్‌ను తయారు చేయాలనుకున్నారు. అందులో భాగంగా ‘వరల్డ్ రికార్డు’ కబాబ్‌కు శ్రీకారం చుట్టారు.
వాట్ ఈజ్ కుకింగ్?
కేవలం రికార్డు కోసమే కాకుండా.... ‘కింగ్ కబాబ్ హౌస్’ యజమాని, చెఫ్ మౌలానా సిఫి ఓ సదుద్దేశంతో ఈ కబాబ్‌ను తయారు చేశారు. కబాబ్ తయారీ కోసం మౌలానా ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో ఆయన టీమ్ సభ్యులు పని చేశారు. ‘చికెన్, మాంసంతో పాటు చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉపయోగించాం. రికార్డు కబాబ్ కావడంతో మా టీమ్ కో ఆర్డినేషన్‌లో కాస్త టెన్షన్ పడ్డాను. అయినా కాన్ఫిడెంట్‌గా తయారు చేశాం. గొప్పగా నిలవాలనే ఆలోచన ఉంది కాబట్టే అందరం ఏకాగ్రతగా పని చేశాం. ఇది వరల్డ్ రికార్డ్ అని అందరూ ప్రశంసించారు. అయితే మాతో కలిసి వారి అనుభూతిని పంచుకోవటానికే ఇలాంటి వేదికను ఏర్పాటు చేశాం’ అంటున్నారు మౌలానా. ‘కేవలం బిజినెస్ మోడల్ అయితే కుదరదు. ప్రతి ఒక్కరూ కమిట్‌మెంట్‌తో పని చేయాలి.
ఇదో ప్యాషన్. ఓ పండగలా చేసుకున్నాం’ అన్నాడు ఈ వేడుకలో పాల్గొన్న స్థానికుడు. ‘ఇక్కడికి వచ్చిన వందలాది మంది జనాలు ఫుడ్‌ను ఆస్వాదిస్తూ తిన్నారు. ప్రేమతో చేస్తే రుచి దానంతట అదే వస్తుందంటాన్నేను. ఎవరేమిటనే విషయాలు మర్చిపోయి ఆనందంగా ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఇలా సమాజానికి కొంచెం తిరిగి ఇవ్వటంలో ఉండే ఆనందమే వేరు’ అంటున్నారు కింగ్ హౌస్ యజమాని. రికార్డు పూర్తయిన తర్వాత కబాబ్‌ను ఉచితంగా అందరికి పంచారు. అన్నట్లు ఈవెంట్‌లో పాల్గొన్నవాళ్లు క్యాన్సర్ నిర్మూలన కోసం తమ వంతు సాయంగా 11వేల ఆస్ర్టేలియన్ డాలర్లు ఇచ్చారు. ఆ విధంగా రికార్డుతో పాటు సామాజిక బాధ్యతను కూడా నిర్వహించిన మౌలానా అభినందనీయుడు.