తలకాయ కూర ఇలా చేసి చూడండి.. ఇకమీరు లొట్టలేసుకుని..
ABN , Publish Date - Jan 26 , 2025 | 11:59 AM
తలకాయ కూరను ఇష్టపడని మాంసం ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. మసాలా దట్టించిన తలకూరను లొట్టలేసుకుని మరీ తింటుంటారు. మసలా దినుసులను సమపాళ్లలో వేసి తలకాయ కూర చేస్తే రుచి అమోఘంగా ఉంటుంది. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు: (మేకపోతు) తలకాయ మాంసం- అర కిలో, ఉల్లిపాయ తరుగు - అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్ స్పూను, కొత్తి మీర-ఒక కట్ట, మిరియాల పొడి-అర స్పూను, గరంమసాలా - ఒక టీస్పూను, ధనియాల పొడి - ఒక టీస్పూను, కారం, ఉప్పు - రుచికి సరిపడా, పసుపు - పావు స్పూను, జీలకర్ర - పావు స్పూను, కొబ్బరి తురుము - ఒక స్పూను.
తయారుచేసే విధానం: మాంసాన్ని శుభ్రం చేసి పక్కనుంచాలి. కుక్కర్‌లో నూనె వేసి ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు కలిపి అన్నీ వేగాక మాంసం ముక్కలు వేయాలి. కూర అడుగంటుతుండగా రెండు కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేక దించాలి. ప్రెజర్ పోయాక కూరను మరో కడాయిలోకి మార్చుకుని మళ్లీ చిన్న మంటపై ఉడికించాలి. ఇప్పుడు మిరియాల పొడి, గరం మసాలా, కొబ్బరి తురుము, ధనియాల, జీర పొడులు వేసి కలిపి కూర చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ కూర అన్నం, రాగి సంగటితో చాలా రుచిగా ఉంటుంది.