Crop Coverage: రబీ సాగు 85 శాతం
ABN , Publish Date - Mar 02 , 2025 | 04:54 AM
53.80 లక్షల ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణంలో 45.67 లక్షల ఎకరాల్లోనే పైర్లు పడ్డాయి. నవంబరు నుంచి రబీ సీజన్ ప్రారంభమైనా ఇప్పటికీ 8లక్షల ఎకరాలు ఇంకా సాగులోకి రాలేదు

8 లక్షల ఎకరాల్లో తగ్గిన పంటలు
తుఫాన్లు, ఖరీఫ్ కోతల ఆలస్యమే కారణం
అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రబీ సీజన్ దాదాపు ముగిసింది. అయితే ఈ ఏడాది రబీ సాగు 85శాతమే నమోదైంది. 53.80 లక్షల ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణంలో 45.67 లక్షల ఎకరాల్లోనే పైర్లు పడ్డాయి. నవంబరు నుంచి రబీ సీజన్ ప్రారంభమైనా ఇప్పటికీ 8లక్షల ఎకరాలు ఇంకా సాగులోకి రాలేదు. ఈ సీజన్‌లో 20లక్షల ఎకరాల్లో దాళ్వా వరి సాగవ్వాల్సి ఉండగా, 16.27లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. గత నవంబరు, డిసెంబరులో వాయుగుండాలు, తుఫాన్ల కారణంగా ఖరీఫ్ వరి కోతలు ఆలస్యం కావడంతో ఇంకా రబీ వరి సాగు ఆలస్యమైంది. ఈ కారణంగా వరి సాగు 4లక్షల ఎకరాల్లో తగ్గింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో 7.75లక్షల ఎకరాల్లో జరగాల్సిన చిరుధాన్యాల సాగు లక్ష ఎకరాలపైగా తగ్గింది. ఈ సీజన్‌లో 21.30లక్షల ఎకరాల్లో పప్పు ధాన్యాలు సాగవ్వాల్సి ఉండగా, 18.27లక్షల ఎకరాల్లోనే విత్తనం పడింది. శనగ(బెంగాలీ గ్రామ్) 10లక్షల ఎకరాలకు బదులు 7.50లక్షల ఎకరాల్లోనే సాగైంది. వేరుశనగ, ఇతర నూనె గింజల పంటలు 3.45 లక్షల ఎకరాల్లో వేయాల్సి ఉండగా, కేవలం 1.65ఎకరాల్లో సాగైంది. సాగైన మేరకు అన్ని పంటలకూ అనువైన వాతావరణం ఉండటంతో దిగుబడులు సాధారణం కంటే బాగానే ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.