గృహ లబ్ధిదారులకు త్వరితగతిన బిల్లుల చెల్లింపు
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:49 AM
పక్కా గృహాల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు వారం రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.నాయక్ బాబు తెలిపారు. గురువారం మండలంలోని కుడుముసారి పంచాయతీ కేంద్రంలో ఆయన పర్యటించారు. నిర్మాణంలో ఉన్న పక్కా గృహాలను ఆయన పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు.

- నిర్మాణాలు పూర్తయిన ఇళ్లకు వారం రోజుల్లో నగదు జమ
- జిల్లాలో 38,385 పీఎం జన్‌మన్ పక్కా గృహాలు మంజూరు
- పీఎంఏవై గ్రామీణ 2.0 సర్వే గడువు నెలాఖరు వరకు పెంపు
- హౌసింగ్ పీడీ బి.నాయక్ బాబు
చింతపల్లి, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): పక్కా గృహాల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు వారం రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.నాయక్ బాబు తెలిపారు. గురువారం మండలంలోని కుడుముసారి పంచాయతీ కేంద్రంలో ఆయన పర్యటించారు. నిర్మాణంలో ఉన్న పక్కా గృహాలను ఆయన పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. పక్కా గృహాల నిర్మాణాల లబ్ధిదారులు సకాలంలో పూర్తి చేసుకోవాలన్నారు. పనులు ప్రారంభించకుండా బిల్లులు చెల్లించడం జరగదని, నిర్మాణాల ఆధారంగా బిల్లులు వివిధ స్థాయిలో చెల్లిస్తామన్నారు. పునాదులు పూర్తి చేసుకుంటే రూ.70 వేలు, రూఫ్ స్థాయికి రూ.90 వేలు, శ్లాబ్ నిర్మించుకుంటే రూ.40 వేలుతో పాటు జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి రూ.27 వేలు, మరుగుదొడ్డికి రూ.12 వేలు అందజేస్తామన్నారు. పీఎం గ్రామీణ పథకం(పీఎంఏవై) పక్కా గృహాలకు రూ.1.80 లక్షల నిధులతో పాటు అదనంగా రూ.75 వేలు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల గృహాలను హౌసింగ్ ఇంజనీర్, వర్కు ఇన్‌స్పెక్టర్లు పరిశీలించి జియోట్యాగింగ్ చేస్తేనే బిల్లులు వస్తాయన్నారు. ఆర్థిక సంవత్సరం ఆఖరు కావడంతో బిల్లులు చెల్లింపులో కొంత జాప్యం జరిగిందన్నారు. ఈ నెల రెండో వారం నుంచి లబ్ధిదారులందరికీ బిల్లులు చెల్లిస్తామన్నారు. జిల్లాలో పీఎం జన్‌మన్ పథకంలో 38,385 పక్కా గృహాలు మంజూరయ్యాయన్నారు. గిరిజన ప్రాంతంలో అర్హులందరికీ పక్కా గృహాలు మంజూరు చేసేందుకు పీఎంఏవై గ్రామీణ 2.0 సర్వే గడువు ఈ నెలాఖరు వరకు పెంచినట్టు చెప్పారు. ఆయన వెంట ఏఈ కె.రమణబాబు, వర్కు ఇన్‌స్పెక్టర్ రాజారావు ఉన్నారు.