కొడుకు మరణంతో తల్లడిల్లిన కన్న పేగు
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:46 AM
అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన చిన్న కొడుకు గుండెపోటుతో మృతిచెందడాన్ని మాతృ హృదయం తట్టుకోలేక పోయింది. కుమారుడు మరణాన్ని పదేపదే తలుచుకొని బెంగ పెట్టుకుంది. చివరకు వరహా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణ పోలీసులు, మృతిరాలి పెద్దకుమారుడు దుర్గారావు అందించిన వివరాలిలా ఉన్నాయి.

వరహా నదిలో దూకి మహిళ ఆత్మహత్య
నర్సీపట్నం, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన చిన్న కొడుకు గుండెపోటుతో మృతిచెందడాన్ని మాతృ హృదయం తట్టుకోలేక పోయింది. కుమారుడు మరణాన్ని పదేపదే తలుచుకొని బెంగ పెట్టుకుంది. చివరకు వరహా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణ పోలీసులు, మృతిరాలి పెద్దకుమారుడు దుర్గారావు అందించిన వివరాలిలా ఉన్నాయి.
నర్సీపట్నానికి చెందిన కోన గౌరి(50)కి దుర్గారావు, రాము సంతానం. పిల్లల చిన్నతనంలోనే భర్త సత్తిబాబు చనిపోయాడు. అయినప్పటికీ మనోధైర్యంతో పిల్లలిద్దరిని కష్టపడి పెంచి పెద్ద చేసింది. చిన్న కుమారుడు రాము అంటే గౌరికి అమితమైన ప్రేమ. కుమారులిద్దరూ అబీద్ సెంటర్‌లో పూల వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 14వ తేదీన రాము(24) గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో గౌరి కన్నీరుమున్నీరు అయ్యింది. అప్పటి నుంచి రామును పదేపదే తలుచుకుంటూ కుమిలి పోతున్నది. కాగా గౌరి బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో కుమారుడు దుర్గారావు.. బంధువులకు ఫోన్ చేసి వాకబు చేశాడు. నర్సీపట్నం, చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికాడు. గురువారం ఉదయం బలిఘట్టం ఉత్తరవాహిని (వరహా నది) వద్ద గాలిస్తుండగా సమీపంలో మహిళ మృతదేహం ఉందని స్థానికులు చెప్పారు. దీంతో అక్కడకు వెళ్లి చూడగా తల్లి విగతజీవిగా కనిపించింది. తన తమ్ముడు రాము మృతిని తట్టులేక తన తల్లి ఆత్మహత్య చేసుకున్నట్టు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 20 రోజుల వ్యవధిలో తమ్ముడు, తల్లిని కోల్పోయానని దుర్గారావు ఆవేదన చెందాడు.