Share News

CM Chandrababu: కలెక్టర్ల సదస్సులో ‘మార్పు’

ABN , Publish Date - Mar 20 , 2025 | 03:45 AM

జిల్లా కలెక్టర్ల సదస్సును రెండు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించింది. ఈనెల 25, 26 తేదీల్లో సచివాలయం వేదికగా సదస్సు జరగనుంది. గతంలో జరిగిన రెండు సదస్సులు ఊహించని రీతిలో సుదీర్ఘంగా సాగాయి.

CM Chandrababu: కలెక్టర్ల సదస్సులో ‘మార్పు’

  • ఈనెల 25, 26 తేదీల్లో నిర్వహణ

  • కొత్త ఫార్మాట్‌ రూపొందించిన సీఎంవో

  • కార్యదర్శుల ప్రజెంటేషన్లకు స్వస్తి

  • కలెక్టర్లే 30 శాఖలపై నివేదిక ఇవ్వాలి

  • ఎంత సమయం పడుతుందో, ఏమో!

  • మరింత సంక్లిష్టం చేశారనే అభిప్రాయం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జిల్లా కలెక్టర్ల సదస్సును రెండు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించింది. ఈనెల 25, 26 తేదీల్లో సచివాలయం వేదికగా సదస్సు జరగనుంది. గతంలో జరిగిన రెండు సదస్సులు ఊహించని రీతిలో సుదీర్ఘంగా సాగాయి. దీంతో ఈసారి కొత్త ఫార్మాట్‌లో సమావేశాలు జరిగేలా ముఖ్యమంత్రి కార్యాలయం అజెండాను తయారుచేసినట్లు తెలిసింది. ఈసారి నిర్దేశిత సమయంలోనే సమావేశాలు సాగుతాయని, కాలయాపన, వృధాకు అవకాశం ఉండదని సీఎంవో వర్గాలు చెబుతున్నట్లు తెలిసింది. అయితే సీఎంవో రూపొందించిన ఫార్మాట్‌ ప్రకారం నాలుగు రోజులైనా అజెండా పూర్తికాదని సీనియర్‌ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.


గతంలో ఇలా..

ఇప్పుడున్న ఫార్మాట్‌ ప్రకారం ప్రభుత్వంలోని కీలకమైన 30 శాఖలు తమ కార్యకలాపాలు, లక్ష్యాలు, సాధించిన ఫలితాలపై జిల్లాలవారీగా ప్రజంటేషన్‌ ఇస్తాయి. కలెక్టర్లు తమ శాఖ పరిధిలో కొత్తగా ఏం చేయాలి...ఎలాంటి టార్గెట్‌లు సాధించాలో ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు ప్రజంటేషన్‌ల ద్వారా కోరతారు. ఆ తర్వాత ఆయా అంశాలపై కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకుంటారు. చివరిగా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటారు. ఇందులోనే చాలా ఎక్కువ సమయం పోతోంది. ముఖ్యమంత్రి వద్ద మంచిమార్కులు సాధించాలన్న తపనతో కొందరు కార్యదర్శులు....కలెక్టర్లతో తక్షణం చర్చించాల్సిన అవసరం లేని అంశాలు, రోజువారీ శాఖ కార్యకలాపాలు, ఇతర అంశాలను ప్రజంటేషన్లలో చేర్చి గంటల కొద్దీ సమయం తీసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎ్‌సలు వారించినా కొందరు కార్యదర్శులు గంటలకొద్దీ ప్రజంటేషన్‌లు ఇచ్చి విలువైన సమాయాన్ని తీసుకున్నారు. దీనివల్ల సమావేశాలు అర్ధరాత్రిదాకా సాగాయి.


కొత్త ఫార్మాట్‌ ప్రకారం..

గతంలో జరిగిన కలెక్టర్‌ సదస్సుల తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో సీఎం స్పందించారు. ఈ సారి సమయం ఎక్కువ తీసుకోకుండా ప్లాన్‌చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. దీంతో సీఎంవో కొత్త ఫార్మాట్‌ రూపొందించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఇప్పుడు ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతుల ప్రజంటేషన్లు ఉండవు. జిల్లా కలెక్టర్‌లే 30 శాఖలకు సంబంధించి తమ జిల్లాల్లో గత మూడు నెలల కాలంలో జరిగిన అభివృద్ధి, లక్ష్యసాధనపై ప్రజంటేషన్‌లు ఇవ్వాలి. ఈ లెక్కన, 26 జిల్లాల కలెక్టర్లు ప్రజంటేషన్లు ఇవ్వాలి. దీని వల్ల సగటున ఒక రోజుకు ఐదు జిల్లాల ప్రజంటేషన్‌లే ఇవ్వగలరని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. ఒక్కో కలెక్టర్‌ ఒక్కో శాఖపై ఇచ్చే నివేదికలకు కనీసం 10 నిమిషాల సమయం తీసుకుంటే 30 శాఖలకు కలిపి ఎంత లేదన్నా ఐదు గంటల సమయం పడుతుంది. ఇలా ఒక రోజు చర్చకు 12 గంటల సమయం కేటాయిస్తే, మహా అయితే ముగ్గురికి మించి నివేదించలేరని ఓ సీనియర్‌ అధికారి చెప్పారు. 26 జిల్లాల ప్రజంటేషన్‌లకు ఎన్ని రోజులు పడుతుందో అని మరో సీనియర్‌ అధికారి విస్మయం వ్యక్తం చేశారు. ఒక్కో శాఖ వచ్చే మూడు నెలలకు కలిపి ఏఏ అంశాల్లో కొత్త లక్ష్యాలు సాధించాలనుకుంటుందో నిర్దిష్టంగా, సూటిగా, సుత్తిలేకుండా స్పష్టమైన టార్గెట్‌లను కలెక్టర్లకు ఇచ్చి వారితో మాట్లాడిస్తే సరిపోతుందని సీనియర్‌ అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - Mar 20 , 2025 | 03:45 AM

News Hub