Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌లో మార్పులు
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:41 AM
దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో తెనాలి, పేరేచర్ల గ్రామాల వద్ద నాలుగు ప్రాంతాల్లో మార్పులు చేయాలని జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్)కు కేంద్ర ఉపరితల రవాణా శాఖ నిర్దేశించింది.

తెనాలి, పేరేచర్ల దగ్గర నాలుగుచోట్ల సూచించిన కేంద్రం
వచ్చే మార్చి నాటికి పనులకు శ్రీకారం చుట్టే యోచన
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు(ఓఆర్‌ఆర్): అలైన్‌మెంట్‌ను మార్చాలని కేంద్రం సూచించింది. ఇటీవల నిర్వహించిన డ్రోన్ సర్వేలో ప్రస్తుత అలైన్‌మెంట్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని గుర్తించారు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో తెనాలి, పేరేచర్ల గ్రామాల వద్ద నాలుగు ప్రాంతాల్లో మార్పులు చేయాలని జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్)కు కేంద్ర ఉపరితల రవాణా శాఖ నిర్దేశించింది. ఈ మేరకు ఎన్‌హెచ్ అమరావతి డివిజన్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. గత నాలుగేళ్లలో ఆయా ప్రాంతాల్లో చెరువులతో పాటు శ్మశానాలు, ఇతర నీటి వనరులు అభివృద్ధి చెందినట్టు గుర్తించారు. ఈ నాలుగు చోట్ల 43 కి.మీ. మేర అమరావతి ఓఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు 150 మీ. వెడల్పున అనుమతి ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే బెంగళూరు ఓఆర్‌ఆర్‌కు గరిష్ఠంగా 70 మీ. మేర అనుమతి ఇచ్చామని అమరావతికి కూడా అంతవరకే ఇవ్వగలమని చెబుతున్నట్టు తెలుస్తోంది.
దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం చంద్రబాబు రాసిన లేఖలో 150మీటర్లకు అనుమతి ఇవ్వాలని ప్రత్యేకంగా కోరారు. ఈ విషయంలో కేంద్రం అంతిమ నిర్ణయం తీసుకునే వరకు అలైన్‌మెంట్ ఖరారయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. 70మీ. వెడల్పు రహదారికి 8 వరసలకు అనుగుణంగా భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. అదే 100, 150 మీటర్లకు పెరిగితే 14, 18 వరసలకు తగినట్లుగా భూసేకరణకు అలైన్‌మెంట్‌ను నిర్ధారించాల్సి ఉంటుంది. ఓఆర్‌ఆర్ వెడల్పు పెరిగే కొద్దీ భూసేకరణ కూడా పెరిగే అవకాశం ఉండటంతో ఎన్‌హెచ్ అమరావతి అధికారులు ప్రస్తుతానికి ఈ విషయంలో వేచి చూస్తున్నారు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పల్నాడు, గుంటూరు జిల్లాల పరిధిలో భూ సేకరణ కోసం ఇప్పటికే జేసీలను నియమించారు. రహదారి వెడల్పు ఎన్ని మీటర్లో తేలినవెంటనే భూసేకరణప్రక్రియను ప్రారంభిస్తారు.
పర్యావరణ అనుమతులకు దరఖాస్తు
ఓఆర్‌ఆర్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు కాబట్టి పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో అలైన్‌మెంట్ నిర్ధారించిన తర్వాత ఐదు జిల్లాల పరిధిలో అనుమతుల కోసం ఎన్‌హెచ్ అధికారులు దరఖాస్తు చేయనున్నారు. ఓఆర్‌ఆర్ కారణంగా పర్యావరణానికి ఏమైనా విఘాతం కలుగుతుందేమో తెలుసుకోవటానికి గాలి, నీరు, ధ్వని కాలుష్యాలకు సంబంధించి సర్వే నిర్వహిస్తారు. అంతిమంగా ప్రజల అభ్యంతరాల స్వీకరణకూడా పూర్తయ్యాక కేంద్ర పర్యావరణ శాఖనుంచి అనుమతులువస్తాయి. అలాగే ఓఆర్‌ఆర్ పరిధిలో అటవీ భూములు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో గుర్రాజుపాలెం, పేత్రంపాడు- గంగినేనిపాలెం, కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ (తిమ్మాపురం) ఉన్నందున వీటికి సంబంధించి అటవీ భూముల డీనోటిఫై కోసం కేంద్ర అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే