Gold Rate: నిజంగా పండగలాంటి వార్తే.. రూ.55 వేలకు దిగిరానున్న బంగారం ధర
ABN , Publish Date - Mar 30 , 2025 | 06:11 PM
పండుగ పూట.. పసిడి ప్రియులకు అసలైన పండగలాంటి వార్త చెప్పారు. రానున్న కాలంలో బంగారం ధర భారీగా దిగి రానుందని.. పది గ్రాముల పసిడి రేటు ఏకంగా 55 వేల రూపాయలకు దిగి రానుందని సమాచారం.

బంగారాన్ని అమితంగా ఇష్టపడేది ఎవరంటే.. భారతీయులు అనే సమాధానం వినిపిస్తుంది. మన దేశంలో ఆభరణం, అక్కరకు ఆదుకునే నేస్తం, పెట్టుబడి ఇలా ఏదైనా సరే.. అది పుత్తడే అవుతుంది. అయితే గత కొన్నాళ్లుగా బంగారం ధరలు రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతూ.. చుక్కలను తాకుతున్నాయి. ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్టాల వద్ద అమ్ముడవుతున్నాయి. చాలా మంది నిపుణులు భవష్యత్తులో పసిడి రేటు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పది గ్రాముల గోల్డ్ ధర లక్ష రూపాయలు దాటిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే వార్తలు.. పసిడి ప్రియుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అలా భయపడుతున్న వారందరికి ఓ శుభవార్త.. భవిష్యత్తులో బంగారం ధర భారీగా దిగి రానుందట. 10 గ్రాముల రేటు ఏకంగా 55 వేల రూపాయలకు పడిపోయే అవకాశం ఉందంటున్నారు. ఆ వివరాలు..
బంగారం రేటు అంతర్జాతీయ పరిస్థితులు.. ముఖ్యంగా అమెరికా డాలర్ విలువ, ఫెడరల్ బ్యాంకు నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. దీనిలో భాగంగానే ట్రంప్ పాలన ప్రారంభమైన తర్వాత విధాన పరమైన అయోమయంలో ఉన్న పెట్టుబడిదారులు.. సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. దాంతో పసిడి రేటు భారీగా పెరుగుతూ వచ్చింది. అయితే దీర్ఘకాలికంగా చూస్తే మాత్రం బంగారం ధరలను దిగి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. బంగారం ధరలను తగ్గించే కొన్ని కీలక అంశాల గురించి వారు వివరిస్తున్నారు.
మార్నింగ్‌స్టార్ నిపుణుడు జాన్ మిల్స్ అనే వ్యక్తి బంగారం ధరలపై ఆశావహంగా లేని అంచనాలను వెల్లడించాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే.. భవిష్యత్తులో గోల్డ్ రేటు భారీగా దిగి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే వాల్ స్ట్రీట్‌లో మాత్రం చాలా మంది పుత్తడి ధర మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. కానీ మిల్స్ మాత్రం దీనికి భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వారం బంగారం అత్యధిక ధరను చేరుకున్నప్పటికీ.. రానున్న ఐదేళ్లలో అది 1,820 డాలర్లకు పడిపోవచ్చని మిల్స్ అంచనా వేశాడు.
55 వేలకు దిగి రానున్న ధర..
మిల్స్ అంచనా ప్రకారం.. రానున్న రోజుల్లో బంగారం ధర రూ.55 వేలకు పడిపోవచ్చు. ప్రస్తుతం బంగారం ధర అత్యధికంగా 3,000 డాలర్ల వద్ద ఉంది. అంటే ఈ రేటుతో పోలిస్తే వచ్చే ఐదేళ్లలో పసిడి రేటు 38 శాతం మేర తగ్గొచ్చు అని మిల్స్ అంచనా వేస్తున్నాడు. గత 12 నెలల్లో వచ్చిన లాభాలు కూడా హరించుకుపోతాయి అంటున్నాడు. ఇక శుక్రవారం నాడు గోల్డ్ ఔన్సు ధర 3,080 డాలర్ల వద్ద ట్రేడయింది. ఇది ఇప్పటి వరకు అల్ టైమ్ గరిష్ట ధర.
మిల్స్ ప్రకారం రానున్న రోజుల్లో బంగారం ధరను తగ్గించే అంశాలు ప్రధానంగా రెండు ఉన్నాయి. అవి
1.మార్కెట్లో సరఫరా పెరగడం..
ప్రస్తుత బంగారం ధరలు ఎక్కువగా ఉండటంతో, గోల్డ్ తవ్వకాలు అధికమయ్యాయి. రానున్న రోజుల్లో ఈ అధిక సరఫరా పసిడి రేటుపై ఒత్తిడిని కలిగించవచ్చు అని చెప్పుకొస్తున్నాడు. ముఖ్యంగా బంగారం ఉత్పత్తిలో ముందున్న ఆస్ట్రేలియా వంటి దేశాల్లో గోల్డ్ మైనింగ్ ఎక్కువయ్యే అవకాశముంది. అలానే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం 2024 రెండో త్రైమాసికంలో బంగారం మైనింగ్ అత్యధిక లాభదాయకమైన రంగంగా మారిందని వెల్లడించింది.
2.ఇక రెండో అంశానికి వస్తే.. పాత బంగారం ఎక్కువగా రీసైకిల్ అవ్వడంతో సరఫరా మరింత పెరిగే అవకాశం ఉందని మిల్స్ అంచనా వేస్తున్నాడు.
మిల్స్ ప్రకారం.. బంగారం ధరలు సాధారణంగా తాత్కాలిక ఆర్థిక సంక్షోభాల ప్రభావంతో మార్పులకు గురవుతుంటాయి. అయితే దీర్ఘకాలికంగా చూసినప్పుడు ఈ ప్రభావం తగ్గిపోతుందని మిల్స్ చెప్పుకొచ్చాడు. ఉదాహరణకు, 2020లో కరోనా మహమ్మారి కారణంగా బంగారం ధరలు తాత్కాలికంగా పెరిగినా, ఆ తర్వాత దిగి వచ్చాయి. 2023 చివరిలో తిరిగి మళ్లీ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. రానున్న ఐదేళ్లలో బంగారం ధరలు గతంలో మాదిరే దిగి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక మిల్స్ చెప్పినట్లు రానున్న ఐదేళ్లలో బంగారం ధరలు దిగి వస్తే.. పేద, మధ్య తరగతి వారు పసిడి కొనే ధైర్యం చేస్తారు అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు.
ఇవి కూడా చదవండి:
ప్రభుత్వ స్కీంలో కోటి రూపాయలు సంపాదించడం ఎలా..నెలకు ఎంత సేవ్ చేయాలి..
గోల్డ్‌కు గట్టి పోటీ ఇస్తున్న వెండి..ఏడాదిలో ఎంత పెరిగిందో తెలుసా..