Share News

CM Chandrababu Naidu: భూ సమస్యలపై యాక్షన్‌ ప్లాన్‌

ABN , Publish Date - Mar 26 , 2025 | 03:37 AM

రాష్ట్రంలో భూ సమస్యలు తీవ్రమవుతున్నాయని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. భూ వివాదాల పరిష్కారానికి నెలరోజుల్లో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని రెవెన్యూశాఖను ఆదేశించారు. ప్రతి గ్రామంలో భూమి రికార్డుల పునఃపరిశీలన చేసి భూ సమస్యలను నివారించాలని నిర్ణయం తీసుకున్నారు.

CM Chandrababu Naidu: భూ సమస్యలపై యాక్షన్‌ ప్లాన్‌

ఏప్రిల్‌ నెలాఖరులోగా సిద్ధం చేయండి

ఏడాదిలోగా అన్నిటికీ పరిష్కారమే లక్ష్యం

ప్రభుత్వ జాబితాలో ప్రైవేటు భూములు..

వైసీపీ పాలనలో అరాచకానికిది పరాకాష్ఠ

రీ సర్వే చేస్తామని అక్రమాలు చేశారు

ఎన్నడూ లేనన్ని భూ సమస్యలు తెచ్చారు

పరిష్కార మార్గాలపై నెలలో తేల్చేద్దాం

ప్రతి ఊరిలో రికార్డుల పునఃపరిశీలన: సీఎం

రెవెన్యూశాఖ నివేదికపై అసంతృప్తి, ఆగ్రహం

రెవెన్యూ ఇంకా కంట్రోల్‌లోకి రాలేదని వ్యాఖ్య

అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా భూమి సమస్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ వివాదాల పరిష్కారానికి గత కొన్ని నెలలుగా అనేక ప్రయత్నాలు చేస్తున్నా అవి కొలిక్కిరావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రెవె న్యూ వ్యవస్థ ఇప్పటికీ కంట్రోల్‌లోకి రాలేదన్నారు. ప్రజలెదుర్కొంటున్న అన్నిరకాల భూ సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపాలో నెలరోజుల్లోగా అధ్యయనం చేసి యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని రె వెన్యూశాఖను ఆదేశించారు. ఈ కార్యాచరణ ప్రణాళిక తయారీలో కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, సీనియర్‌ ఐఏఎ్‌సలు, ప్రత్యేకించి రెవెన్యూ నిపుణులను భాగస్వాములను చేయాలన్నారు. భూ సమస్యలపై భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) జయలక్ష్మి ప్రజంటేషన్‌ ఇవ్వగా మధ్యలోనే సీఎం జోక్యం చేసుకొని రెవెన్యూ ఇంకా కంట్రోల్‌లోకి రాలేదని తీవ్రంగా స్పందించారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కారం నిజంగానే కృషి చేస్తున్నారా? వాస్తవాలనే ప్రజంట్‌ చేస్తున్నారా? కలెక్టర్లు ఏం చేశారో మీరు స్పష్టంగా అడగండి. వారు జిల్లా స్థాయిలో ఏం చేశారో అడగండి. మీరేదో చెప్పి, వారేదో వివరించి రొటీన్‌గా మాట్లాడుకుంటే ఇలాంటి సమావేశాలకు అర్థమే లేదు. భూ సమస్యలపై ఏం చేస్తే బాగుంటుందో కలెక్టర్లు మాట్లాడండి’ అన్నారు.


అవన్నీ సమస్యలు.. పరిష్కారాలేమిటి?

చిత్తూరు, కడప సహా పలు జిల్లాల కలెక్టర్లు తమ జిల్లాల పరిధిలో ఉన్న సమస్యలను ప్రస్తావించగా, అవన్నీ సమస్యలని, పరిష్కారాలు ఏమిటని సీఎం ప్రశ్నించారు. ‘ఇక్కడున్న మంత్రులకే కాదు, చాలా మంది అధికారులకు భూ వివాదాలపై సరైన అవగాహన లేదు. తెలంగాణలో నిజాం పాలకుల వల్ల భూ సమస్యలు చాలా ఎక్కువ. ఒకే భూమిని అనేక మందికి ధారాదత్తం చేయడం వల్ల అక్కడ అనేక భూ వివాదాలున్నాయి. దీంతో భన్వర్‌లాల్‌ అనే ఐఏఎస్‌ అధికారిని కలెక్టర్‌గా నియమించి భూమి రికార్డులను ప్రక్షాళన చేయించా. ఆంధ్రా ప్రాంతం స్వాతంత్య్రం రాకముందు బ్రిటి్‌షపాలనలో ఉండటంతో రికార్డులను సరిగ్గానే నిర్వహించారు. కానీ, ఇటీవలి కాలంలో రికార్డులను తారుమారు చేశారు. రీ సర్వేలో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. ప్రైవేటు భూములను కూడా నిషేధ జాబితా 22(ఏ)లో చేర్చారు. ప్రైవేటు భూములను ప్రభుత్వ జాబితాగా చూపించి రికార్డులు మార్చారు. ఇది అరాచకానికి పరాకాష్ఠ. ఎక్కడికి వెళ్లినా వందలు, వేల మంది నా వద్దకు వచ్చి నా భూమి రికార్డుల్లో నుంచి తీసేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలకు అంతం లేదా? అడ్డుకట్టవేయలేమా? పరిష్కారం చూపలేమా? ఒక్కో జిల్లాలో ఒక్కో విధమైన సమస్యలున్నాయు. వీటిని ఎలా పరిష్కరించాలో కలెక్టర్లు సూచనలు, సలహాలు ఇవ్వండి. గతంలో చేసిన సర్వే రైతుల వద్ద ఉన్న రికార్డులతో సింక్‌ కావడం(సరిపోలడం) లేదు. కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో కలెక్టర్లు అసలైన నిజాలను చెప్పండి. రోగం ఏమిటో తెలిస్తేనే మందు ఇవ్వగలరు. కాబట్టి సమస్యలు ఏమిటో స్పష్టంగా చెప్పి వాటికి పరిష్కారాలు కూడా సూచించండి’ అన్నారు.


ప్రతి గ్రామంలో భూరికార్డుల పునఃపరిశీలన

ప్రతి గ్రామంలో భూమి రికార్డులను పునఃపరిశీలన చేయాలని సీఎం సూచించారు. ఇంతలో మంత్రి లోకేశ్‌ జోక్యం చేసుకొని భూమి వివాదాల పరిష్కారానికి సీనియర్‌ కలెక్టర్లతో టీమ్‌ను ఏర్పాటు చేసి అధ్యయనం చేయించాలని కోరారు. భూ వివాదాల వల్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన, ఆవేదన నెలకొందన్నారు. కాగా, గత ప్రభుత్వం వల్ల ప్రజల్లో తీవ్ర భయం వచ్చేసిందని సీఎం అన్నారు. ‘రీ సర్వే చేస్తామని అక్రమాలు చేశారు. ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారు. రికార్డులను తారుమారు చేశారు. కాబట్టి గ్రామం వారీగా రికార్డుల భౌతిక పరిశీలన చేయాలి. వెబ్‌ల్యాండ్‌కు, రికార్డులకు చాలా తేడా ఉంది. ఈ విషయాలపై రెవెన్యూ ప్రమోటీ అధికారులకు బాగా పరిజ్ఞానం ఉంటుంది. వారితో మాట్లాడండి. అసలు రాష్ట్రంలో వివాదంలో ఉన్న భూములు ఎన్ని? వివాదంలో లేని భూములు ఎన్ని? సరిగ్గా అంచనా వేయండి. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి డేటా తీసుకోండి. లింకు డాక్యుమెంట్స్‌ లేని భూములు ఎన్ని? వాటి రికార్డుల పరిస్థితి ఏమిటో అధ్యయనం చేయండి’ అని నిర్దేశించారు. ఈ విషయాలపై రాష్ట్రం, జిల్లా స్థాయిల్లో వర్క్‌షా్‌పలు నిర్వహించి ఏప్రిల్‌ నెలాఖరు నాటికి యాక్షన్‌ప్లాన్‌ రెడీ చేయాలని రెవెన్యూశాఖను సీఎం ఆదేశించారు. ఆర్‌ఓఆర్‌ కేసులతోపాటు ఇతర కీలకమైన అంశాల్లో ఆర్‌డీవోలు, సబ్‌కలెక్టర్లకున్న అధికారాలను తొలగించి అన్నీ కలెక్టర్‌కే అప్పగించారని, దీని వల్ల కలెక్టర్ల వద్ద పరిష్కరించాల్సిన ఫైళ్లు పెండింగ్‌లో ఉంటున్నాయన్నారు. దీని వల్ల భూ సమస్యల పరిష్కారం మరింత జాప్యమవుతోందని చెప్పారు. దీంతో రెవెన్యూ ప్రజంటేషన్‌పై చర్చ ఆగిపోయింది. యాక్షన్‌ప్లాన్‌పై స్పష్టత వచ్చాకే అన్నీ మాట్లాడదామన్నారు. రెవెన్యూ మొండి సమస్యలకు ఏడాదిలోగా పరిష్కారం చూపాలన్నదే తన సంకల్పమని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే

Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Updated Date - Mar 26 , 2025 | 03:37 AM