Share News

ఇక మాటలు కాదు.. చేతలే!

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:26 AM

ఒకప్పుడు అధికారులు కంటే ముఖ్యమంత్రి చంద్రబాబు భిన్నంగా పనిచేసేవారు. ప్రతీ విషయంలోను తనకంటూ ఒక మార్క్‌ ఉండేలా జాగ్రత్తపడ్డారు. కలెక్టర్‌, ఎస్పీ దగ్గర నుంచి జిల్లా స్థాయి అధికారులంతా ఎలా నడవాలో దిశా నిర్దేశం చేసేవారు. ఇటీవల జరిగిన సమా వేశంలో జిల్లా అధికారులు పక్కాగా తమ కంటూ ఒక పనిని నిర్ణయించుకుని ప్రజలు మెచ్చేలా పాలన చేసి తీరాల్సిందేనన్న సరికొత్త ఫోకస్‌ ఇచ్చారు.

ఇక మాటలు కాదు.. చేతలే!

జిల్లాల్లో మార్పు కోరుకుంటున్న ప్రభుత్వం

ప్రతి విషయంలోను చొరవ చూపాల్సిందేనంటూ ఆదేశాలు

ఇకముందు క్లిష్ట సమస్యలకు జిల్లా స్థాయిలోనే పరిష్కారం

యంత్రాంగం తీరుపైనే ఇక ఫోకస్‌

‘ప్రజలకు కావాల్సిన పనులు చేసి చూపించాలి. ప్రతి విషయంలోను మీకంటూ ఒక చొరవ ఉండాలి. ప్రజలతో మమేకమవ్వాలి. సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు ఉండాలి. తగినట్టుగానే లక్ష్యాలు అందుకోవాలి. ప్రజల్లో నమ్మకం పెంచాలి. స్వచ్ఛాంధ్ర ప్రదేశ్‌ దగ్గర నుంచి అన్ని విషయాల్లో మీ పాత్ర ఏ రకంగా ఉంటుందో గమనిస్తాం..’ ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్య మంత్రి చంద్ర బాబు కలెక్టర్ల పాత్రపై తేల్చేశారు. పంటల దగ్గర నుంచి పాడి వరకు ఎక్కడెక్కడ వెనుకబడి ఉన్నా మో చెప్పి ఒక నిర్దేశం చేశారు. దీంతో ఇక కలెక్టర్‌ పనితీరు, జిల్లాల్లో జరుగుతున్న పాలనా వ్యవహారాలపై పూర్తిగా అటెన్షన్‌ వచ్చింది.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

ఒకప్పుడు అధికారులు కంటే ముఖ్యమంత్రి చంద్రబాబు భిన్నంగా పనిచేసేవారు. ప్రతీ విషయంలోను తనకంటూ ఒక మార్క్‌ ఉండేలా జాగ్రత్తపడ్డారు. కలెక్టర్‌, ఎస్పీ దగ్గర నుంచి జిల్లా స్థాయి అధికారులంతా ఎలా నడవాలో దిశా నిర్దేశం చేసేవారు. ఇటీవల జరిగిన సమా వేశంలో జిల్లా అధికారులు పక్కాగా తమ కంటూ ఒక పనిని నిర్ణయించుకుని ప్రజలు మెచ్చేలా పాలన చేసి తీరాల్సిందేనన్న సరికొత్త ఫోకస్‌ ఇచ్చారు. ప్రతీ అంశాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించడం, పని ప్రాతిపదికనే రిమార్కులు ఉండడంతో ఇక పాలనా యం త్రాంగంలో చొరవ కనబడుతుందని భావి స్తున్నారు. వాస్తవానికి జిల్లా స్థాయిలో అధి కారులతో సమీక్షలు జరుగుతున్న ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. కలెక్టరేట్‌ కేంద్రంగా వివిధ విభాగాధిపతులు తమ శాఖ ల్లో లక్ష్యాల సాధనకు అనుకూలంగా వ్యవ హరించలేకపోతున్నారు. ప్రత్యేకించి వ్యవ సాయం, విద్య, వైద్యంతోపాటు మునిసిపల్‌, రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్‌ వంటి కీలక శాఖలు అనుకున్నది అనుకున్నట్టుగా ముందుకు సాగ లేకపోతున్నాయి. గత ఐదేళ్ల కాలంలో ఏదైతే వైఫల్యం జరిగిందో వాటిని సరిదిద్దడంలో ఇంకా వెనుకంజే. కొంతమంది అధికారులు కేవలం పాత వాసనతోనే వ్యవహరిస్తున్నారన్న అప వాదు లేకపోలేదు. సాధారణంగా ఒక కార్య క్రమానికి ప్రభుత్వం భారీ ఎత్తున ప్రాచుర్యం చేయాలని సంకల్పించినా ఉన్నత స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు కనీసం పట్టించుకున్న పాపానలేదు. ఉదాహరణకు పౌర సరఫరాల విభాగంలో ప్రతీ కార్డుదారుడు ఈకేవైసీ చేయిం చుకోవాలని, అదికూడా మార్చి నెలాఖరులోపే తుది గడువుగా ముందస్తు ప్రకటన చేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్షా 65 వేల కార్డు దారులు ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని ఓ అంచ నా. అయితే మండల స్థాయిలో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించాల్సింది పోయి అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. పేదలకు రుణాలు ఇచ్చే ప్రక్రియలోను ఇదే తరహా వైఫల్యాలు కనిపిస్తున్నాయి. ఈక్రమంలోనే సీఎం చంద్రబాబు ఈ మధ్యన కలెక్టర్లకు ఇచ్చిన మార్గనిర్దేశం ఆషామాషీగా లేదు. ఇక ప్రతీనెలా జాబ్‌మేళా నిర్వహించడం, ఉద్యోగ అవకాశాలు పెంచడం వంటి చర్యలు తీసుకోవాలి. అంటే దీనికి తగ్గట్టుగానే యువతను అప్రమత్తం చేయాలి. తగినట్టుగా సమా చారాన్ని చేరేలా చేయాల్సి ఉంది. వచ్చే నెల రెండో వారంలోపే జిల్లా స్థాయిలో జాబ్‌మేళా నిర్వ హించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇక్కడ వదిలేసి.. ఎటువైపో చూసి !

జిల్లా రైతులకు పామాయిల్‌ పంట ధర విషయంలో గత పదేళ్లుగా సమస్య వెంటాడుతూనే ఉంది. పామాయిల్‌ పంట నిర్దేశించిన కేంద్రానికి చేర్చడంలో అనేక ఒడిదుడుకులు ఎదురవు తున్నాయి. ధర విషయంలో సరిహద్దున ఉన్న తెలంగాణ ప్రాంతంలోని అశ్వారావుపేటలో ఒక తీరు, పెదవేగిలో ఇంకో తీరును రైతులు ఎదుర్కొంటూ అవస్థలు పడుతూ వచ్చారు. జిల్లా స్థాయిలో చొరవ తీసుకుని సమస్యను రూపు మాపాల్సి ఉన్నా అలా చేయలేకపోయారు. సాక్షాత్తు ముఖ్య మంత్రి జోక్యం చేసుకుని రైతు సమస్యలను సంబంధిత కంపెనీలతో మాట్లాడి సరిదిద్దాల్సిం దిగా ఆదేశించాల్సి వచ్చింది. అలాగే టూరిజంకు సంబంధించి గత ఐదేళ్లల్లో సర్వనాశనం కాగా, కొల్లేరు ప్రాంతంలో గుడివాకలంక సమీపాన ఉన్న చిన్నపాటి రిసార్టులు నాశనమయ్యాయి. కొంత చొరవ తీసుకుని ఈ తొమ్మిది నెలల పాలనలో ఆ తరహా రిసార్టులకు మోక్షం ఇచ్చి ఉంటే ఆదాయ మార్గాలకు దారి ఇచ్చినట్టయ్యేది. కాని.. ఈ తరహా చిన్న పనులను కూడా జిల్లా యంత్రాంగం పట్టించుకోలేదు. కొరుటూరు వద్ద గతంలో కట్టిన పర్యాటక భవనాలదీ ఇదే తీరు.

ఈసారి మార్చాల్సిందే ..

గత తొమ్మిది నెలల్లో అను భవాల దృష్ట్యా ఈసారి వేసవిలోనే యంత్రాంగంలో మార్పు వచ్చిందా, లేదా అనేది తేలిపోనుంది. ఇప్పటికే అక్కడక్కడ తాగునీటి సమస్య, ఇంకొన్ని చోట్ల విద్యుత్‌ కోతలు అనివార్యంగా మారాయి. ఇంతకు ముందే సమీక్షించినట్టుగా యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేస్తారా, లేదా చేతెల్తేస్తారా.. అనేది తేలనుంది. ఎందుకంటే కాల్వలను కట్టేసే ముందే చెరువులకు తాగునీరు చేరాలి. ఇప్పటివరకు అలాంటి పరిస్థితులేవీ లేవు. మెట్ట ప్రాంతాల్లో ఈ తరహా సంకేతాలు ఇప్పటికే స్పష్టంగా ఉన్నాయి. పశుగ్రాసం కొరత పొంచి ఉంది. కొంతలో కొంత ఆర్‌అండ్‌బీ శాఖ తమకు ఇచ్చిన లక్ష్యాల మేరకు రోడ్ల మరమ్మతులు కొంత పూర్తి చేయగలిగారు. రాబోయే రెండు నెలల వ్యవధిలోనే మిగతా రోడ్ల పనులు, వంతెనల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోకపోతే ఏటా మాదిరిగానే ఈ ఏడాది ప్రజలకు అవస్థలు తప్పవు.

జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలను అవగాహన చేసుకోవడం, ఎమ్మెల్యేలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా పరిషత్‌, డీసీసీబీ, డీసీఎంఎస్‌ వంటివన్నీ ఇంకా ఉమ్మడి జిల్లా పరిధిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటి పాత్ర కూడా అత్యంత కీలకం. రాబోయే సీజన్‌లో రైతులకు కావాల్సిన అవసరాలు ఏమిటి, మారుమూల గ్రామాల్లో గతేడాది అనుభవాలు తిరిగి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలేమిటనేది సమీక్షించుకోవాలే తప్ప తూతూ మంత్రంగా సమావేశాలు పెట్టి చేతులు దులుపుకుంటే అన్నీ అష్టకష్టాలే. ప్రభుత్వం నిర్దేశించినట్టుగా శాఖల వారీగా పుంజుకోకపోతే మరిన్ని కష్టాలు తప్పవు. సాధ్యమైనంత మేర ఈ తరహా పరిస్థితిని అధిగమించే దిశగా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. తగిన కార్యాచరణను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

Updated Date - Apr 01 , 2025 | 12:26 AM