BC Reservations: జంతర్‌మంతర్‌లో బీసీల హోరు
ABN , Publish Date - Apr 03 , 2025 | 04:26 AM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంటులో ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ బీసీ సంఘాలు చేపట్టిన ‘బీసీల పోరుగర్జన, మహాధర్నా’తో ఢిల్లీలోని జంతర్‌మంతర్ దద్దరిల్లింది.

బీసీల పోరుగర్జనకు 16 పార్టీల మద్దతు
వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీల హాజరు
వందలాది కులసంఘాల నేతల రాక
బీసీ బిల్లులను ఆమోదించకపోతే
వచ్చే ఎన్నికలే బీజేపీకి చివరివి: జాజుల
హాజరుకాని బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంటులో ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ బీసీ సంఘాలు చేపట్టిన ‘బీసీల పోరుగర్జన, మహాధర్నా’తో ఢిల్లీలోని జంతర్‌మంతర్ దద్దరిల్లింది. బుధవారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మహాధర్నాకు మద్దతు తెలిపేందుకు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల నుంచి నేతలు తరలివచ్చారు. 16 రాజకీయ పార్టీల నేతలు కూడా ధర్నాకు హాజరై సంఘీభావం తెలిపి.. బీసీ రిజర్వేషన్ల బిల్లులకు తమ పార్టీల తరఫున మద్దతు ఉంటుందని ప్రకటించారు. ధర్నాను విజయవంతం చేసేందుకు వందలాదిగా బీసీ సంఘాల నేతలు, వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చారు. ధర్నా ప్రారంభం అయిన ఉదయం 10 గంటల నుంచి ధర్నా ముగిసే వరకు నేతలు, కార్యకర్తలు ఉత్సాహంతో సభ ప్రాంగణంలోనే ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో భారీ ఎత్తున బీసీ బిల్లులకు మద్దతుగా చేసిన నినాదాలతో జంతర్‌మంతర్ మార్మోగిపోయింది. ధర్నాకు హాజరైన తమిళనాడు ఎంపీ విష్ణుప్రసాద్, కర్ణాటక ఎంపీలు జి.కుమార్ నాయక్, ప్రభామల్లికార్జున్ తమ మాతృభాషలో మాట్లాడి బీసీ రిజర్వేషన్ల పోరాటానికి మద్దతు ప్రకటించారు.
తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు రేణుకాచౌదరి, అనిల్‌కుమార్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌తో పాటు.. వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్‌సీపీ(శరద్‌పవార్) ఎంపీ సుప్రియా సూలే, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులు ధర్నాకు హాజరయ్యారు. ధర్నాకు భారీ ఎత్తున జాతీయ నేతలు తరలిరావడంతో వేదికపై సీట్లు దొరకడం కష్టమైపోయింది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ధర్నా వేదికకు ఒక మూలన దాదాపు 40 నిమిషాల పాటు కింద కూర్చొని మిగతా నేతల ప్రసంగాలను ఆసక్తితో విన్నారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వేదిక దిగి తెలుగు జర్నలిస్టుల వద్దకు చేరి, వారితో కలిసి నేతల ప్రసంగాలను విన్నారు. మహాధర్నాకు బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు ఎవరూ హాజరుకాలేదు. ఈ కార్యక్రమంలో జాజుల శ్రీనివా్‌సగౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల బిల్లులను యథావిధిగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేకపోతే తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే బీజేపీకి చివరివని అన్నారు. దేశవ్యాప్తంగా కులగణనను కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో 70 కోట్ల జనాభా ఉన్న బీసీల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శాఖను కూడా కేటాయించలేదని విమర్శించారు. ప్రధాని మోదీ పేరుకే బీసీ అయిన ఆచరణలో మాత్రం ఆయన బీసీ కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ బీసీల భవిష్యత్తు కోసం సీఎం రేవంత్ రెడ్డి పోరాడుతున్నారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలను ధర్నాకు ఆహ్వానించినా రాలేదని విమర్శించారు. సీఎంగా కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్న ఏనాడూ బీసీల లెక్కలు తేల్చేందుకు ఆయనకు మనసు ఒప్పలేదని విమర్శించారు.
నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు 42% : చిరంజీవులు
70 ఏళ్లకు పైగా ఉన్న కులగణన డిమాండ్‌ను సుసాధ్యం చేసిన ప్రజానాయకుడు సీఎం రేవంత్‌రెడ్డి అని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ టి.చిరంజీవులు అన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుల సాధన అనేక పోరాటాలతో ముడిపడి ఉందని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రభుత్వ నామినేటెడ్ పదవులలోనూ బీసీలకు 42ు వాటా కేటాయించాలని ఆయన కోరారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశిని శంకర్‌రావు మాట్లాడుతూ.. చట్టసభలలో బీసీలకు 33ు రిజర్వేషన్ కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం రూపొందించిన బిల్లును కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎస్ఆర్‌హెచ్ వివాదంపై స్పందించిన హెచ్‌సీఏ
నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు
For More AP News and Telugu News