Government Hospitals: మళ్లీ ఆ కంపెనీలే..!
ABN , Publish Date - Mar 22 , 2025 | 05:58 AM
ప్రస్తుతం సేవలు అందిస్తున్న కంపెనీలే మళ్లీ అర్హత సాధించేలా ఇష్టారాజ్యంగా నిబంధనలు పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ పరిధిలో ఉన్న ఆస్పత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ నిర్వహణకు మొత్తం 18 ప్యాకేజీలకు టెండర్లు ఆహ్వానించారు.

ఆరోగ్య శాఖ శానిటేషన్, సెక్యూరిటీ టెండర్లలో ఇష్టారాజ్యం
పాత కంపెనీలపై తీవ్ర ఆరోపణలు.. కోర్టు కేసులు
అయినా మరోసారి టెండర్ల ప్రక్రియలో అర్హత
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వాసుపత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ టెండర్ల ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం సేవలు అందిస్తున్న కంపెనీలే మళ్లీ అర్హత సాధించేలా ఇష్టారాజ్యంగా నిబంధనలు పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ పరిధిలో ఉన్న ఆస్పత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ నిర్వహణకు మొత్తం 18 ప్యాకేజీలకు టెండర్లు ఆహ్వానించారు. నాలుగైదు నెలలుగా ఈ ప్రక్రియ నడుస్తోంది. ఏపీఎంఎ్‌సఐడీసీ ద్వారా జరుగుతున్న టెండర్ల ప్రక్రియలో అనేక గందరగోళాలు, కోర్టు కేసులు, ఫిర్యాదుల మధ్య అధికారులు దాదాపు 14 కంపెనీలకు సంబంధించిన ఫైనాన్సియల్ బిడ్ ఓపెన్ చేశారు. వచ్చే వారం ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు నేతృత్వంలో బిడ్ ఫైనలైజ్ కమిటీ ప్యాకేజీల వారీగా నిర్వహణ సంస్థలను ఎంపిక చేయనుంది. వివిధ స్థాయిల నుంచి ఒత్తిళ్లతో కొన్ని కంపెనీలకు, అధికారులకు నచ్చిన మరికొన్ని కంపెనీలకు అర్హత కలిగేలా టెండర్ల నిబంధనలు ఖరారు చేసుకున్నారు. ప్రస్తుతం డీఎంఈ పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో సేవలు అందిస్తున్న మూడు కంపెనీలు టెండర్లలో అర్హత సాధించాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జోన్లలో సేవలు అందిస్తున్న వీటిపై అనేక ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయి. ఈ కంపెనీలు టెండర్లలో పాల్గొనేందుకు అర్హత లేదని కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ఆరోగ్య శాఖను కోర్టు ఆదేశించింది.
ఇదీ కంపెనీల బాగోతం...
ఉత్తరాంధ్ర కంపెనీ గతంలో టెండర్లలో పాల్గొనే సమయంలో బోగస్ సర్టిఫికెట్లు పొందుపరిచినట్టు ఆరోపణలున్నాయి. ఓ ప్రముఖ మెడికల్ కాలేజీలో శానిటేషన్ సేవలందించినట్లు చూపించి టెండర్ దక్కించుకుంది. ఆ కంపెనీ తమ కాలేజీలో శానిటేషన్ పనులు నిర్వహించలేదని యాజమాన్యం సృష్టం చేసింది. సదరు కంపెనీ నాలుగేళ్ల పాటు కోట్ల రూపాయలు బిల్లుల రూపంలో తీసుకుంది. అలాగే కోస్తాంధ్రకు చెందిన కంపెనీది మరో తీరు. టెండర్ నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపల్స్‌తో అగ్రిమెంట్లు చేసుకుంది. నిబంధనల ప్రకారం ప్రతి బోధనాసుపత్రిలో 294 మంది శానిటేషన్ వర్కర్లను నియమించుకోవాలి. కానీ 240 మందిని నియమించుకుంటే సరిపోతుందన్నట్టుగా అగ్రిమెంట్ చేసుకుంది. ఉద్యోగులను తగ్గించేసి పనులు చేయకుండా రూ.కోట్లు లాగేసింది. ఈ కంపెనీకి ఏపీఎంఎ్‌సఐడీసీలో టెండర్ ప్రక్రియ పర్యవేక్షించే అధికారి అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ కంపెనీపై కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఇక రాయలసీమలో శానిటేషన్ పనులు చేస్తున్న కంపెనీ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా, పీఎఫ్, ఈఎ్‌సఐలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేసింది. కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని తిరుపతి కలెక్టర్... ఎస్పీకి లేఖ రాశారు. అయినా ఆ కంపెనీ నుంచి స్పందన లేదు. దీంతో డీఎంఈ అధికారులు దాన్ని బ్లాక్‌లిస్ట్ చేశారు. దీనిపై సదరు కంపెనీ కోర్టులో స్టే తెచ్చుకుంది. 2016-19 మధ్యలో కూడా ఈ కంపెనీ వన్ సర్వీసెస్ పేరుతో శానిటేషన్ సేవలు అందించింది. అప్పుడు కూడా బ్లాక్‌లిస్ట్‌కు గురైంది. ఆ తర్వాత కంపెనీ పేరు మార్చుకుని మళ్లీ రాయలసీమ ప్రాంతం టెండర్లు దక్కించుకుంది.
పట్టించుకోని అధికారులు
అధికారులు బ్లాక్‌లిస్ట్ చేయడం వరకే తమ బాధ్యత, ఆ తర్వాత సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బ్లాక్‌లి్‌స్టపై స్టే తెచ్చుకున్నప్పుడు స్టే వెకేట్ చేయించి, టెండర్లలో అర్హత లేకుండా చేయాలి. కానీ ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం తమకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఆరోగ్య శాఖ నుంచి కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఇప్పుడే టెండర్లు ఓపెన్ చేయవద్దని కోర్టు సృష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం ఫైనాన్సియల్ బిడ్ ఓపెన్ చేసేసి బీఎ్‌ఫసీలో పెట్టేందుకు సిద్ధమయ్యారు. అధికారుల నిర్ణయంపై మళ్లీ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే