అవినీతిలో ‘సహకారం’
ABN , Publish Date - Apr 03 , 2025 | 01:18 AM
జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పాలన గాడితప్పింది. రైతు రుణాలను సెక్రటరీలు, సిబ్బంది, పర్సన్ ఇన్‌చార్జిలు దారి మళ్లించారు. లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఈ విషయాలన్నీ పీఏసీఎస్‌ల్లో ఇటీవల చేపట్టిన కంప్యూటరీకరణతో వెలుగుచూస్తున్నాయి. వీటిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు ఇస్తున్నా.. విచారణ మాత్రం నత్తనడకనే సాగుతోందని రైతుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలువురు సెక్రటరీలు తమ పలుకుబడిని ఉపయోగించి విచారణ జరగకుండా తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకొంతమంది పెద్దలు కేడీసీసీబీ, సహకారశాఖ అధికారులతో మంతనాలు జరిపి విచారణను అడ్డుకుంటున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో త్రీమెన్ కమిటీల నేతృత్వంలో నడిచిన పీఏసీఎస్‌ల్లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి.

-పీఏసీఎస్‌ల్లో భారీగా నగదు గోల్‌మాల్!
- రైతులు చెల్లించిన రుణాలు పక్కదారి
- తాజాగా గోకవరం పీఏసీఎస్‌పై విచారణకు ఆదేశం
- తరకటూరు, ముచ్చర్ల, ముక్కొల్లులోనూ ఇదే పరిస్థితి
- నాగాయలంక పీఏసీఎస్‌లో ఎరువులు మాయం
- ఏళ్ల తరబడి సాగుతున్న విచారణలు
- నిందితులపై చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు
- గత వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి..
జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పాలన గాడితప్పింది. రైతు రుణాలను సెక్రటరీలు, సిబ్బంది, పర్సన్ ఇన్‌చార్జిలు దారి మళ్లించారు. లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఈ విషయాలన్నీ పీఏసీఎస్‌ల్లో ఇటీవల చేపట్టిన కంప్యూటరీకరణతో వెలుగుచూస్తున్నాయి. వీటిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు ఇస్తున్నా.. విచారణ మాత్రం నత్తనడకనే సాగుతోందని రైతుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలువురు సెక్రటరీలు తమ పలుకుబడిని ఉపయోగించి విచారణ జరగకుండా తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకొంతమంది పెద్దలు కేడీసీసీబీ, సహకారశాఖ అధికారులతో మంతనాలు జరిపి విచారణను అడ్డుకుంటున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో త్రీమెన్ కమిటీల నేతృత్వంలో నడిచిన పీఏసీఎస్‌ల్లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి.
ఆంద్రజ్యోతి-మచిలీపట్నం :
మచిలీపట్నం మండలం గోకవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో రైతులు తీసుకున్న రుణాలు చెల్లించారు. రైతులు రుణాలు చెల్లించినట్లు పీఏసీఎస్ రికార్డుల్లో చూపారు. కానీ కేడీసీసీ బ్రాంచ్‌లో రుణాలు ఇంకా చెల్లించనట్లుగా చూపుతోంది. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ పీఏసీఎస్‌లో జరిగిన అక్రమాలపై సహకారశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. అధికారుల రఽపాథమిక విచారణలో రూ.55 లక్షల వరకు నగదు పక్కదారి పట్టినట్ల్లు తెలిసింది. ఇంతా జరిగినా ఈ పీఏసీఎస్‌పై 51 విచారణకు ఆదేశించలేదు. అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు బయటకు వస్తాయనే కారణంతో కొందరు పెద్దలు ఈ అంశంలో జోక్యం చేసుకుని తెరవెనుక కథ నడుపుతున్నట్లు సమాచారం. రూ.55 లక్షలు చెల్లిస్తారని, ఈ పీఏసీఎస్‌పై విచారణను నిలిపివేయాలని తెరవెనుక కొందరు మంతనాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో విచారణ చేస్తే పీఏసీఎస్ మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందనే కారణం చూపి రైతులు ఫిర్యాదులు చేయకుండా అడ్డుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పీఏసీఎస్‌లో పెద్ద మొత్తంలోనే అవినీతి జరిగినా, విచారణను ముందుకు సాగనీయకుండా కొన్ని అదృశ్య శక్తులు అడ్డుకుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత పది సంవత్సరాలుగా గోకవరం పీఏసీఎస్ అధ్యక్షుడిగా, పర్సన్ ఇన్‌చార్జిగా మాజీ మంత్రి పేర్ని నాని అనుచరుడు కొనసాగడం గమనార్హం.
ముక్కొల్లు పీఏసీఎస్ సెక్రటరీపై నేటికీ చర్యల్లేవు
గూడూరు మండలం ముక్కొల్లు పీఏసీఎస్‌లో పంట రుణాలు తీసుకున్న 25 మందికి పైగా రైతుల నుంచి సంబంధిత పీఏసీఎస్ సెక్రటరీ రుణాలకు సంబంధించిన నగదును వసూలు చేశారు. పీఏసీఎస్‌లో రుణాలు కట్టించుకోకుండా తన ఫోన్‌పే నంబరుకు నగదును సెక్రటరీ జమ చేయించుకున్నారు. సదరు సెక్రటరీపై ఉన్న నమ్మకంతో రైతులు నగదును ఫోన్‌పే రూపంలో చెల్లించారు. కానీ ఈ నగదును రైతుల ఖాతాల్లో రుణాలు చెల్లించినట్లుగా చూపలేదు. రైతులు మళ్లీ రుణం కోసం పీఏసీఎస్‌కు వెళితే రుణాలు చెల్లించనట్లుగా రికార్డులు చూపాయి. దీంతో రైతులు పీఏసీఎస్ సెక్రటరీకి తాము చెల్లించిన నగదు మొత్తాలకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు, ఆధారాలతో ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అధికారులు రూ.45 లక్షల వరకు నగదు పక్కదారి పట్టినట్లుగా నిర్థారించారు. అధికారుల విచారణలో నిజాలు నిగ్గుదేలడంతో అక్రమాలకు పాల్పడిన పీఏసీఎస్ సెక్రటరీ తప్పించుకుతిరుగుతున్నాడు. నగదును రికవరీ చేయకుండా, సంబంధిత సెక్రటరీపై శాఖాపరమైన చర్యలు తీసుకోకుండా అధికారులు నేటికీ మీనమేషాలు లెక్కించడానికి గల కారణాలపై అనేక అనుమానాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు.
నాగాయలంక పీఏసీఎస్‌లో ఎరువులు మాయం
జిల్లాలోని అన్ని పీఏసీఎస్‌లతో పాటే నాగాయలంక పీఏసీఎస్‌ను ఇటీవల కంప్యూటరీకరణ చేశారు. ఈ సమయంలో ఈ పీఏసీఎస్‌కు వచ్చిన ఎరువులు పక్కదారి పట్టిన అంశం, ఎరువుల స్టాకులో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. టి-కొత్తపాలేనికి చెందిన ఇద్దరు రైతులకు రుణాలు ఇచ్చినా రికార్డులు సక్రమంగా లేవని గుర్తించారు. క్యాష్‌బుక్‌లో దిద్దుబాట్లు కూడా ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారంపై పలు ఫిర్యాదులు అందాయి. సహకారశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. ఎప్పటిలోగా ఈ విచారణను పూర్తి చేస్తారో తెలియనిస్థితి నెలకొంది.
ప్రారంభమేకాని విచారణ
గూడూరు మండలం తరకటూరు పీఏసీఎస్‌లో జరిగిన అక్రమాలపై రైతుల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో జిల్లా సహకారశాఖ అధికారులు విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా అధికారులు ఈ పీఏసీఎస్‌లో ఇంకా విచారణను ప్రారంభించలేదు. ఒకటీ రెండు రోజుల్లో విచార ణ చేస్తామని చెప్పడం గమనార్హం. పెడన మండలం ముచ్చర్ల పీఏసీఎస్‌లోనూ నగదు పక్కదారి పట్టిందనే అంశంపై ఫిర్యాదులు అందడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. అక్రమాలపై పూర్తిస్థాయిలో, పారదర్శకంగా విచారణ చేస్తారా లేక మమ అనిపిస్తారా అనేది వేచి చూడాలి. ఈ పీఏసీఎస్‌లో జరిగిన అక్రమాలపై ప్రాథమిక విచారణ జరుగుతోందని, తదుపరి చర్యలు తీసుకుంటామని జిల్లా సహకారశాఖ అధికారి చంద్రశేఖరరెడ్డి తెలిపారు.