Share News

Bail Petition: బెయిల్‌కు వంశీ అనర్హుడు

ABN , Publish Date - Mar 21 , 2025 | 05:29 AM

సాక్షులనూ ప్రభావితం చేస్తారని, ఆధారాలను తారుమారు చేస్తారని చెప్పారు. విజయవాడ జిల్లా జైలులో ఉన్న వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై స్థానిక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానంలో గురువారం వాదనలు జరిగాయి.

Bail Petition:  బెయిల్‌కు వంశీ అనర్హుడు

బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు

విజయవాడ కోర్టులో సీనియర్‌ న్యాయవాది పోసాని వాదనలు

విజయవాడ, మార్చి 20(ఆంధ్రజ్యోతి): గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్‌ పొందే అర్హత లేదని, ఒక నేరం నుంచి బయట పడడానికి మరో నేరం చేశారని సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోర్టుకు తెలిపారు. ఆయన బయటకు వస్తే బాధితుడు ముదునూరి సత్యవర్ధన్‌కు ప్రాణహాని ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సాక్షులనూ ప్రభావితం చేస్తారని, ఆధారాలను తారుమారు చేస్తారని చెప్పారు. విజయవాడ జిల్లా జైలులో ఉన్న వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై స్థానిక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానంలో గురువారం వాదనలు జరిగాయి. ప్రాసిక్యూషన్‌ తరఫున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నిందితుడని, ఇదే కేసులో మరో నిందితుడికి హైకోర్టు ముందస్తు బెయిల్‌ తిరస్కరించిందని, వంశీ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఇటీవల తోసిపుచ్చిందని చెప్పారు. ఫిర్యాదుదారు సత్యవర్ధన్‌ను వంశీ బెదిరించారని, ఒక కేసు నుంచి బయటపడడం కోసం మరో నేరం చేశారని తెలిపారు. అట్రాసిటీ కేసుల్లో బెయిల్‌ కోసం స్థానిక కోర్టులను ఆశ్రయించిన తర్వాత హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, దీనికి విరుద్ధంగా వంశీ ముందుగా హైకోర్టుకు వెళ్లిన తర్వాత ఈ కోర్టుకు వచ్చారని వివరించారు. వాదనల అనంతరం విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు న్యాయాధికారి హిమబిందు తెలిపారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సీఐడీ కోర్టు ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయాధికారి తిరుమలరావు ఆదేశాలు ఇచ్చారు.

మూడు రోజులు పోలీసు కస్టడీకి వంశీ

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని మరోసారి మూడు రోజుల పోలీసు కస్టడీకి ఇస్తూ విజయవాడ సీఐడీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే మూడు రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించారు.


ఇవి కూడా చదవండి..

Shocking Video: నాదే తప్పు అయితే.. ఇక్కడి నుంచి వెళ్లిపోతా.. బస్సు డ్రైవర్ ఏం చేశాడో చూస్తే నివ్వెరపోవడం ఖాయం..

Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..

Updated Date - Mar 21 , 2025 | 05:29 AM