East Godavari Police : ఇంటర్ నెట్ చూసి దొంగనోట్లు అచ్చేశాడు!
ABN , Publish Date - Feb 16 , 2025 | 04:00 AM
ఎస్పీ నరసింహ కిషోర్ శనివారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. పాత గుంటూరులోని బాలాజీనగర్‌కి చెందిన కర్రి మణికుమార్‌కి...

చీరల అద్దకంలో నష్టాలతో నకిలీ కరెన్సీ ముద్రణ
రూ.కోటి విలువైన నోట్లు స్వాధీనం
ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన ‘తూర్పు’ పోలీసులు
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): చేస్తున్న పనిలో నష్టాలు రావడంతో దొంగ నోట్ల తయారీ ప్రారంభించాడో వ్యక్తి. చిన్న ఫిర్యాదుతో కూపీ లాగిన తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ముఠా సభ్యులను, భారీగా దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ నరసింహ కిషోర్ శనివారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. పాత గుంటూరులోని బాలాజీనగర్‌కి చెందిన కర్రి మణికుమార్‌కి చీరలకు డిజైన్ల అద్దకంలో అనుభవం ఉంది. కరోనా అనంతరం ఈ రంగంలో నష్టాలు రావడంతో దొంగ కరెన్సీ నోట్ల తయారీ వైపు దృష్టి మళ్లడంతో ఇంటర్‌నెట్‌లోని వీడియోలు చూశాడు. అదే ప్రాంతంలోని దోనెపూడి మధుతో కలిసి ప్రింటరు, లామినేషన్ మిషన్ తదితర పరికరాలను కొనుగోలు చేసి నోట్లు ప్రింట్ చేయడం మొదలు పెట్టాడు. అనుమానం రాకుండా నోట్ల కట్టలకు చుట్టడానికి ఎస్‌బీఐ పేపర్ సీల్ టేపులనూ తయారు చేశాడు. నోట్లపై సెక్యూరిటీ థ్రెడ్ కోసం సిల్వర్ ఫాయిల్స్‌ని తమిళనాడులో కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో ఈ నెల ఒకటో తేదీన డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కె.గన్నవరం మండలం బాలాంతం గ్రామానికి చెందిన చిట్టూరి హరిబాబు తన వ్యాను పాడైందని మరమ్మతు చేయాలని తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన పల్లి రాంబాబు వద్దకు తీసుకెళ్లాడు. అడ్వాన్సుగా నాలుగు రూ.500 నోట్లు ఇచ్చాడు. 3న స్పేర్ పార్టుల కోసం వెళ్లిన రాంబాబు ఆ నోట్లు ఇవ్వగా అవి దొంగ నోట్లు అని తేలింది. దీంతో బిక్కవోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎస్పీ నరసింహ కిషోర్.. ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
దర్యాప్తులో కర్రి మణికుమార్, దోనెపూడి మధు ఓ కుటీర పరిశ్రమలా గుంటూరులో దొంగనోట్లు తయారు చేస్తున్నారని నిర్ధారించుకున్నారు. చిట్టూరి హరిబాబుతో పాటు కాకినాడ జిల్లా కాజులూరుకు చెందిన శీలం కేదారేశ్వర పరిపూర్ణ శ్రీనివాస్, అదే గ్రామానికి చెందిన చీకట్ల ఏడుకొండలు ఆ దొంగ నోట్లను చలామణీ చేస్తున్నారని తేలింది. రూ.లక్ష నగదుకు మూడు లక్షల దొంగనోట్లు ఇస్తారని.. ప్లాట్‌ఫాంపై చిరు వ్యాపారులు, రద్దీగా ఉండే వ్యాపార దుకాణాలు, సంతలు వంటి చోట్ల వీరు ఈ నోట్లు మార్పిడి చేసారు. ఐదుగురు నిందితులనూ అరెస్టు చేసి రూ.1.6 కోట్ల విలువైన దొంగ నోట్లను, రూ.9,680 నగదు, కారు, 5 సెల్‌ఫోన్లు, తయారీకి ఉపయోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు.