బలభద్రపురంలో కేన్సర్ కేసులకు జల్లెడ
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:29 AM
బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి అంకాలజిస్టు సూచనల మేరకు ప్రత్యేక వైద్యం అందిస్తామని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఇటీవల అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో బలభద్రపురం గ్రామంలో వందలాది మంది క్యాన్సర్ భారిన పడి చనిపోతున్నారని ప్రస్తావించారు.

మూడు రోజుల పాటు ఇంటింటా సర్వే
క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి
అనపర్తి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి) : బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి అంకాలజిస్టు సూచనల మేరకు ప్రత్యేక వైద్యం అందిస్తామని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఇటీవల అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో బలభద్రపురం గ్రామంలో వందలాది మంది క్యాన్సర్ భారిన పడి చనిపోతున్నారని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం అత్యవసరంగా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా శనివారం ఏడుగురు స్పెషలిస్టులు, 8 మంది వైద్యులు, 98 మంది వైద్య సిబ్బందితో శనివారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రజారోగ్యంపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఇంటింటా సర్వే చేశారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ బలభద్రపురం చేరుకుని క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ఇంటింటా సర్వేను పరిశీలించారు. 15మంది వైద్యులు, 98 మంది సిబ్బందితో 31 బృందాలుగా ఏర్పాటు చేసి ఇం టింటా సర్వే చేస్తున్నామన్నారు. మూడు రోజుల పాటు ఈ సర్వే జరుగుతుందన్నారు. గ్రామంలో 2492 గృహాలు ఉన్నాయని 10 వేల జనాభా నివసిస్తున్నారని అన్నారు.ఇప్పటి వరకు సేకరించిన డేటా ఆధారంగా 23 మందికి వివిధ రకాల కేన్సర్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. వీరికి తదుపరి వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. క్యాన్సర్ ప్రభావం ఉండడానికి గల కారణాలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల నుంచి జీజీహెచ్ ఆసుపత్రి నుంచి స్ఫెషలిస్టులను రప్పించామని తెలిపారు. క్యాన్సర్‌తో చికిత్స పొందుతున్న వారి వివరాలను సేకరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, కాకినాడ జీజీహెచ్ ఎస్పిఎమ్ హెచ్‌వోడీ డాక్టర్ పి సుజాత పాల్గొన్నారు.
కేన్సర్, కిడ్నీ బాధితులు పెరిగారు : నల్లమిల్లి
బలభద్రపురం గ్రామంలో కేన్సర్ బాధితులే కాకుండా కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. చిన్నారులకు కాలేయ సంబందిత వ్యాదులు సోక డం మరింత ఆందోళన కలిగిస్తుందన్నారు. గత రెండు రోజుల్లో నలుగురు చిన్నారులు వ్యాధి భారిన పడ్డారన్నారు. ఒక బాలుడికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా జరిగిందని.. తల్లిదండ్రులు సుమారు రూ.75 లక్షలు ఖర్చు చేశారన్నారు. ఒక్క గ్రామంలోనే ఇన్ని రకాల వ్యాధులు ఎందుకు ప్రబలుతున్నాయో అర్థం కావడం లేదన్నారు. కేన్సర్ స్ర్కీనింగ్ టెస్టుల కోసం మరో నోడల్ టీమ్‌ను గ్రామానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారన్నారు. ప్రజలు నామోషీ పడకుండా వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.