Share News

వైసీపీ పాలనలో ప్రభుత్వాసుపత్రి సర్వనాశనం

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:30 AM

వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడి ప్రజాప్రతినిధులు రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రిని సర్వనాశనం చేశారని, రోగుల ఇబ్బందులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక ప్రభుత్వ బోధనాసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ చేసిన తప్పులను, అవినీతి వ్యవహారాలను సరిచేసి పాలన గాడిలో పెట్టడానికి దాదాపు 8నెలల సమయం పట్టిందన్నారు.

వైసీపీ పాలనలో ప్రభుత్వాసుపత్రి సర్వనాశనం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు

  • గాడిలో పెట్టేందుకు ఎనిమిది నెలల సమయం పట్టింది

  • మీడియాతో ఎమ్మెల్యే వాసు

రాజమహేంద్రవరం అర్బన్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడి ప్రజాప్రతినిధులు రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రిని సర్వనాశనం చేశారని, రోగుల ఇబ్బందులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక ప్రభుత్వ బోధనాసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ చేసిన తప్పులను, అవినీతి వ్యవహారాలను సరిచేసి పాలన గాడిలో పెట్టడానికి దాదాపు 8నెలల సమయం పట్టిందన్నారు. రాబోయే రోజుల్లో ఆసుపత్రిని పూర్తి ప్రక్షాళన చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తామని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది కొరతను అధిగమించేందుకు, సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలను రోగులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా ఐఎంఏ సహకారం తీసుకుంటున్నామన్నారు. మార్చురీలో శవాలపైనా డబ్బులు గుంజుతున్న వారందరినీ ఏరిపారేస్తున్నామని, ఎవరైనా అవినీతికి పాల్పడితే ఇలాంటి చర్యలే ఉంటాయన్నారు. మార్చురీకి అందజేసిన ఫ్రీజర్లను రోటరీక్లబ్‌ నిర్వహిస్తోందని, ఆర్‌వో ప్లాంటు ఏర్పాటు చేశామని, పేపర్‌మిల్లు ద్వారా మరో రూ.50 లక్షలు మంజూరు చేయించామని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే వాసు ఎంసీహెచ్‌ బ్లాకులో ఫైబ్రో లివర్‌ స్కానింగ్‌ శిబిరాన్ని ప్రారంభించారు. సమావేశంలో టీడీపీ నాయకులు కాశి నవీన్‌కుమార్‌, రెడ్డి మణేశ్వరరావు, కడలి రామకృష్ణ, రవియాదవ్‌, రాచపల్లి ప్రసాద్‌, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

  • డ్రైనేజీ సమస్యకు పరిష్కారం

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 24( ఆంధ్రజ్యోతి): స్థానిక 2వ డివిజన్‌లో రామాలయం వద్ద డ్రైనేజీలో పేరుకుపోతున్న చెత్తచెదారం వల్ల ఇబ్బందులు ఎదురౌతున్నాయని, మురుగునీరు ఒక్కోసారి రోడ్డుపైకి వస్తుందని స్థానికులు ఎమ్మెల్యే వాసు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించి సోమవారం డివిజన్‌లో పర్యటించారు. ఈ డ్రైనేజీ వద్ద ఒక గ్రిల్‌ ఏర్పాటు చేసి అక్కడ అడ్డుపడిన చెత్తను ఎప్పటికప్పుడు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే అక్కడికి వచ్చిన కొంతమంది మహిళలు అర్హులైన తమకు ప్రభుత్వ ఇళ్లను కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌ కుమార్‌, సలాది ఆనంద్‌, దొంగ నాగమణి, ఆడారి లక్ష్మినారాయణ పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 12:30 AM