క్రాస్ బండ్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టండి
ABN , Publish Date - Mar 23 , 2025 | 01:48 AM
ప్రస్తుత రబీ సీజన్‌లో కాల్వ శివారు భూములకు సాగునీటి ఎద్దడి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఇరిగేషన్, డ్రైనేజీశాఖ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశించారు.

అమలాపురం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత రబీ సీజన్‌లో కాల్వ శివారు భూములకు సాగునీటి ఎద్దడి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఇరిగేషన్, డ్రైనేజీశాఖ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశించారు. ప్రస్తుత రబీ సీజన్‌లో వివిధ ప్రాంతాల్లో క్రాస్ బండ్‌లు ఏర్పాటుచేసి రైతులకు సాగునీటి సరఫరా చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్, డ్రైన్స్, వ్యవసాయశాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. సాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ, వ్యవసాయశాఖ, జలవనరులశాఖ అధికారులు కీలక పాత్ర పోషించాలని, క్షేత్రస్థాయిలో ఏఈలు, ఏవోలు సమన్వయంతో సమస్యను పరిష్కరించాలని సూచించారు. క్రాస్ బండ్‌లు వేసి ఆయిల్ ఇంజన్లతో సాగునీటి సరఫరా చేస్తూ సాగునీటి ఎద్దడి నివారణకు కృషిచేయాలన్నారు. ఏప్రిల్ 15వరకు సాగునీటి సరఫరా పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చివరి ఎకరం వరకు సంపూర్ణంగా సాగునీరు అందించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, ఆర్డీవోలు దేవరకొండ అఖిల, కె.మాధవి, పి.శ్రీకర్, ఇరిగేషన్, డ్రైనేజీ శాఖల అధికారులు పాల్గొన్నారు.