ఈనిక దశలో..నీటికి కటకట!
ABN , Publish Date - Mar 23 , 2025 | 01:45 AM
రబీ సేద్యం చివరి దశకు చేరుకున్న తరుణంలో సాగునీటి సమస్య ఉత్పన్నమవుతుండడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
రబీ సేద్యం చివరి దశకు చేరుకున్న తరుణంలో సాగునీటి సమస్య ఉత్పన్నమవుతుండడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రబీ పంట ఈనిక దశలో ఉన్న సమయంలో కాల్వ శివారు భూములకు సాగునీటిఎద్దడి ఉత్పన్నం కావడం వల్ల దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందనేది వారి ఆవేదన. జలవనరుల శాఖ అధికారులు వంతులవారీ విధానాన్ని మధ్యమధ్యలో ఇంజన్ల ద్వారా సాగునీటిని కొబ్బరితోటలు, చెరువులకు మళ్లించడం వల్ల కాల్వ శివారు భూములకు సాగునీరు అందడం లేదనేది రైతుల ప్రధాన ఆరోపణ. ఇప్పటికే క్రాస్ బండ్‌లు నిర్మించి నీటిని నిల్వ చేసుకుంటే ఏప్రిల్ నెల వరకు కొంతమేర రైతులకు మేలు జరిగేదని పేర్కొంటున్నారు. కోనసీమ జిల్లా పరిధి లో కొన్ని ప్రాంతాల్లో కాల్వ శివారు భూములకు ఇటీవల నీటి ఎద్దడి ఉత్పన్నమైంది. దీనిపై ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు అసెంబ్లీలో లేవనెత్తి పరిష్కారంపై అధికారులు దృష్టి సారించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. అయితే వంతులవారీ విధానాన్ని అమలుచేయడంలో అధికారులు పాటిస్తున్న కొన్ని నిబంధనలు రైతులకు ఇబ్బందికరంగా మారాయి. లాకుల వద్ద నీటిని తగ్గించేసి వంతులవారీ విధానం అమలులోకి వచ్చినప్పుడు నీటిని విడుదల చేయడం వల్ల ఈ నీరు ప్రస్తుతం ఎండలకు కాల్వల్లో ఇంకిపోయి పూర్తి స్థాయిలో శివారు భూములకు అందడం లేదు. ఉదాహరణకు కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం మండలంలో అయినాపురం, సూరాయిచెరువు, ముమ్మిడివరం, కాల్వ శివారు ప్రాంతాల్లో మెరక పొలాలకు నీటిఎద్దడి ఉంది. అదేవిధంగా పి.గన్నవరం మండలం ముంగండ శివారు ఇటుకల మెరక, కొంపటిపొర్ర, రాజులపాలెం ప్రాంతాల్లో నీటిఎద్దడి ఉన్నప్పటికీ రైతులు సొంత ఖర్చుల తో ఆయిల్ ఇంజన్ల సాయంతో నీటిని తోడుకుంటున్నారు. అదేవిధంగా ఐ.పోలవరం మండలంలో జి.వేమవరం, జి.మూలపొలం, గుత్తెనదీవి, ఎర్రగరువు, టి.కొత్తపల్లి, తిల్లకుప్ప గ్రామాల శివారు భూములకు నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఇటీవల కె.గంగవరం మండలం పేకేరు, పామర్రులలో నీటి ఎద్దడి ఉత్పన్నమైనప్పటికీ ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో కొంతమేర సమస్యను పరిష్కరించారు. కాగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సాగునీటి ఎద్దడి ఉత్పన్నమైన ప్రాంతాలపై ఇరిగేషన్, డ్రైన్స్‌శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్‌కు నివేదిక అందజేశారు. రాజోలు మండలంలో సుమారు 70 ఎకరాలు, అమలాపురం మండలంలో 96 ఎకరాలు, ఉప్పలగుప్తం మండలంలో వంద ఎకరాలు, అల్లవరంలో 80 ఎకరాలు, మామిడికుదురులో 100 ఎకరాల్లో నీటిఎద్దడి ఉన్నట్టు అధికారులు నివేదిక ఇచ్చారు. ఇక్కడ సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. శివారు భూములకు నీరందించే సమయంలో మధ్యలో సాగునీటి చౌర్యం లేకుండా చర్యలు తీసుకుని పంటలను రక్షించాలని అన్నదాతలు కోరుతున్నారు.