Share News

Cybercrime: వృద్ధాప్యంలో భరించలేని వేధింపులు

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:47 AM

కర్ణాటకలో ఓ వృద్ధ దంపతులు సైబర్‌ నేరగాళ్ల వేధింపులకు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. నకిలీ అధికారులుగా మాట్లాడి వారిని రూ.50 లక్షలకు పైగా మోసం చేశారని సూసైడ్‌ నోట్‌లో వెల్లడించారు.

Cybercrime: వృద్ధాప్యంలో భరించలేని వేధింపులు

‘సైబర్‌’ ఉచ్చులో పడి 50 లక్షలు ముట్టచెప్పాం

బంగారం లోన్‌పై పెట్టాం.. అప్పులు చేశాం

ఈ వయస్సులో ఎవరి దయతోనో బతకాలనుకోలేదు

వృద్ధ దంపతుల ఆత్మహత్య వెనుక కదిలించే అంశాలు

సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్న నిందితులపై కేసు నమోదు

బెంగళూరు, మార్చి 29(ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్ల వేధింపులు, బెదిరింపుల కారణంగా కర్ణాటకలో ఆత్మహత్య చేసుకున్న వృద్ధ దంపతులు.. తీవ్ర మానసిక హింసను అనుభవించినట్లు సూసైడ్‌ నోట్‌ ఆధారంగా తెలుస్తోంది. వృద్ధాప్యంలో భరించలేని వేధింపులకు గురయ్యామని, మరొకరి దయతో జీవించకూడదనే ప్రాణాలు తీసుకుంటున్నామని మాజీ ప్రభుత్వ ఉద్యోగి నజరత్‌ (82) వారి సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. బెళగావి పోలీసులు తెలిపిన వివరాల మేరకు, నజరత్‌ గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 79 ఏళ్ల ఆయన భార్య నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వృద్ధ దంపతులకు పిల్లలు లేరు. నజరత్‌ రాసుకున్న రెండుపేజీల సూసైడ్‌ నోట్‌లో సైబర్‌ నేరగాళ్లుగా సుమిత్‌ బిర్రా, అనిల్‌ యాదవ్‌ అనే ఇద్దరి పేర్లను ప్రస్తావించారు. ఢిల్లీ టెలికాం శాఖ అధికారిగా సుమిత్‌ పరిచయం చేసుకున్నాడని, తమ పేరుపై మోసపూరితంగా ఒక సిమ్‌ కార్డు కొన్నారని, దాన్ని వేధింపులకు, చట్టవిరుద్ధమైన ప్రకటనలకు వినియోగిస్తున్నట్లు చెప్పారని తెలిపారు. ఆ తర్వాత ఫోన్‌ కాల్‌ను అనిల్‌ యాదవ్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశాడని, అతను క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారినని చెప్పాడని ఆ నోట్‌లో వివరించారు. అప్పుడు అనిల్‌.. తమ ఆస్తులు, ఆర్థిక వివరాల గురించి అడిగాడని, చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించాడని పేర్కొన్నారు.


దీంతో భయపడి రూ.50 లక్షలకు పైగా డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేశామని తెలిపారు. బంగారం తాకట్టు పెట్టి రూ.7.15 లక్షల రుణం కూడా తీసుకున్నామని, కొందరి వద్ద అప్పులు చేశామని పేర్కొన్నారు. అప్పులు తీర్చేందుకు తన భార్య బంగారం అమ్మాలని నజరత్‌ సూసైడ్‌ నోట్‌లో రాశాడని పోలీసులు తెలిపారు. ఈ వృద్ధ వయస్సులో తమకు అండగా నిలిచే వారు ఎవరూ లేరని, ఎవరి దయతోనే జీవించాలని అనుకోవడం లేదని భావించి.. ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నామని నజరత్‌ అందులో పేర్కొన్నారు. ఈ కేసును పోలీసులు సీరియ్‌సగా తీసుకున్నారు. సూసైడ్‌ నోట్‌, ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఇద్దరు నిందితులపై ఆత్మహత్యకు ప్రేరేపించడం, సైబర్‌ మోసం కేసులు నమోదు చేశామని, సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని బెళగావి ఎస్పీ భీమశంకర్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..

Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం

For More AP News and Telugu News

Updated Date - Mar 30 , 2025 | 04:47 AM