పనులెట్టావున్నా.. బిల్లులు చేసేస్తాం!
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:37 AM
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన జగనన్న కాలనీల్లో మెరక పనుల బిల్లులను తాజాగా చెల్లించేందుకు అధికారులు సిద్ధమవ్వడం పలు విమర్శలకు దారితీస్తోంది. గిలకలదిండి, బందరుకోట, ఉల్లింగిపాలెంలోని జగనన్న కాలనీల్లో నాడు ఇష్టారాజ్యంగా వైసీపీ నేతలు కాంట్రాక్టర్ల అవతారమెత్తి పనులు చేశారు. మెరక పనులు సరిగా లేకపోవడంతో ఆయా కాలనీల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ముందుకురాలేదు. వర్షం వస్తే మెరక చేసిన స్థలాల్లో భారీగా నీరు చేరడం నాటి నాసిరకం పనులకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో నాటి పనుల బిల్లులు సుమారు రూ.2 కోట్లు చెల్లించేందుకు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపడంపై కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాటి పనులపై విజిలెన్స్ విచారణ జరపాలని, ఆ తర్వాతే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు

- జగనన్న కాలనీల్లో మెరక పనుల బిల్లులు రెడీ!
- రూ. 2 కోట్ల వరకు చెల్లించేందుకు అధికారుల చర్యలు
- వైసీపీ నేతల నేతృత్వంలోనే నాడు ఇష్టారాజ్యంగా పనులు
- పనులు సక్రమంగా చేయకుండా బిల్లులు ఎలా చెల్లిస్తారని కూటమి నాయకుల ఆగ్రహం
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన జగనన్న కాలనీల్లో మెరక పనుల బిల్లులను తాజాగా చెల్లించేందుకు అధికారులు సిద్ధమవ్వడం పలు విమర్శలకు దారితీస్తోంది. గిలకలదిండి, బందరుకోట, ఉల్లింగిపాలెంలోని జగనన్న కాలనీల్లో నాడు ఇష్టారాజ్యంగా వైసీపీ నేతలు కాంట్రాక్టర్ల అవతారమెత్తి పనులు చేశారు. మెరక పనులు సరిగా లేకపోవడంతో ఆయా కాలనీల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ముందుకురాలేదు. వర్షం వస్తే మెరక చేసిన స్థలాల్లో భారీగా నీరు చేరడం నాటి నాసిరకం పనులకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో నాటి పనుల బిల్లులు సుమారు రూ.2 కోట్లు చెల్లించేందుకు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపడంపై కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాటి పనులపై విజిలెన్స్ విచారణ జరపాలని, ఆ తర్వాతే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల్లో మెరక పనుల పేరుతో వైసీపీ నాయకులు కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఇష్టారాజ్యంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారు. ఆ పనులకు కూటమి ప్రభుత్వంలో బిల్లులు చెల్లించేందుకు అధికారులు చర్యలు తీసుకోవడంపై కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... గిలకలదిండిలో 18 ఎకరాల్లో జగనన్న కాలనీని ఏర్పాటు చేశారు. 994 మంది లబ్ధిదారులకు 2023లో ఇళ్లస్థలాలు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఎన్నికల ముందు లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. జిల్లా గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఈ లేఅవుట్‌ను మెరక చేసే బాఽధ్యతను పంచాయతీరాజ్ విభాగానికి అప్పగించారు. నాబార్డు నిధులు రూ.5కోట్లతో ఈ లేఅవుట్‌లో మెరక పనులను చేసేందుకు అనుమతులు ఇచ్చారు. వైసీపీ నాయకుల నేతృత్వంలో తూతూమంత్రంగా మెరక పనులు చేశారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. గిలకలదిండిలోని సర్వే నంబర్ 677లోని 30 ఎకరాల ప్రభుత్వ భూముల నుంచి బుసకను తరలించి మెరక పనులు చేయడం గమనార్హం. అప్పట్లో ఇళ్లస్థలాల మెరక పేరు చెప్పి బయటి ప్రాంతాలకు బసుకను విక్రయించడంతో గిలకలదిండి వాసులు బుసక అక్రమ రవాణాను అడ్డుకున్నారు. అప్పటి అధికార పార్టీ వారే రెండు వర్గాలుగా విడిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసేవరకు వ్యవహారం నడిచింది. 994 ప్లాట్లలో ఇప్పటి వరకు ఒక్క గృహం కూడా నిర్మాణం చేయలేదు. గతంలో రొయ్యల చెరువులుగా ఉన్న భూముల్లో మెరక పనులు పూర్తిస్థాయిలో చేయకపోవడంతో అక్కడ ఇళ్ల నిర్మాణం చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే కారణంగా లబ్ధిదారులు ముందుకులేదు. ఈ లేఅవుట్‌లో విద్యుత స్తంభాలను మాత్రం ఏర్పాటు చేశారు.
మూడు బ్లాక్‌లుగా విడగొట్టి మరీ..
గిలకలదిండి లేఅవుట్‌లో మెరక పనులను మూడు బ్లాక్‌లుగా విడగొట్టి చేశారు. 1వ నంబరు బ్లాక్‌లో రూ.1.50 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించి, పూర్తిస్థాయిలో చేయకుండానే పనులు జరిగినట్టుగా చూపి రూ.1.09కోట్లకు బిల్లులు చే శారు. రెండో బ్లాక్‌లో రూ.1.90 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించి... రూ.1.64కోట్ల విలువైన పనులు జరిగినట్టుగా ఎంబుక్‌లో రికార్డు చేశారు. మూడో బ్లాక్‌లో రూ.1.28 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించి రూ.1.13 కోట్ల మేర పనులు జరిగినట్టుగా చూపారు. ఇంతమేర పనులు జరిగినట్టుగా చూపినా గత వర్షాకాలంలో కొద్దిపాటి వర్షానికే ఈ లేఅవుట్‌లో నీరు నిలబడింది.
ఉల్లింగిపాలెం, బందరుకోట లేఅవుట్లలో..
మచిలీపట్నం నగరంలోని ఉల్లింగిపాలెంలో ఒకటో నంబరు బ్లాక్‌లో రూ.1.30 కోట్ల అంచనాలతో జగనన్న లేవుట్ మెరక పనులను ప్రారంభించారు. ఇక్కడ రూ.20 లక్షల మేర మాత్రమే పనులు జరిగినట్టుగా ఎంబుక్‌లో రికార్డు చేశారు. రెండో నంబరు బ్లాక్‌లో రూ.1.51 కోట్ల అంచనాలతో పనులు చేపట్టారు. ఇక్కడ రూ.18.53 లక్షల విలువైన పనులు జరిగినట్టుగా చూపారు. బందరు కోటలోని లేఅవుట్‌లో రూ.65 లక్షల అంచనాలతో పనులు ప్రారంభించారు. రూ.53 లక్షల విలువైన పనులు జరిగినట్టుగా ఎంబుక్‌లో రికార్డు చేశారు. ఈ లేఅవుట్లలో వైసీపీ నాయకులు పనులు చేసినా వేరే వ్యక్తుల పేర్లు కాంట్రాక్టర్లుగా చూపడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారడంతో ఈ బిల్లులు కొద్దికాలంగా నిలిచిపోయాయి. ఈ లేఅవుట్‌లకు సమీపంలోని కరగ్రహారం లేఅవుట్‌లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిగింది. కానీ గిలకలదిండి, బందరుకోట, ఉల్లింగిపాలెంలలో లేఅవుట్‌లలో మెరకపనులపై విచారణ చేసి, నిజాలు నిగ్గుతేల్చాలని కూటమి నాయకులు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో అధికారులు ఈ మూడు లేఅవుట్‌లకు సంబంధించి బిల్లులను చేసి ప్రభుత్వానికి పంపారు మెరక పనులు పూర్తిస్థాయిలో చేయకున్నా అప్పటి వైసీపీ నాయకుల ఒత్తిడితో పంచాయతీరాజ్ అధికారులు బిల్లులు చేశారని, ఈ అంశంపై విచారణ జరిపిన తర్వాత బిల్లులు మంజూరు చేయాలని కూటమి నాయకులు కోరుతున్నారు.