Share News

ప్రేమ వివాహమే యమపాశమైంది!

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:04 AM

ప్రేమ వివాహమే ఓ కుటుంబాన్ని తీవ్రశోకానికి గురిచేసిన సంఘటన ఆలష్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రేమ వివాహమే యమపాశమైంది!
మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు

ఎనిమిదినెలల క్రితం ఒకే ఊరుకు చెందిన యువతీయువకులు ప్రేమవివాహం

రాజంపేటలో కాపురం

ఇటీవల తరచూ గొడవలు

భర్తపై యాసిడ్‌ దాడి.. ఆ తర్వాత మృతి

స్వగ్రామం బాదినేనిపల్లిలో విషాదం

కొమరోలు, ఎప్రెల్‌4(ఆంధ్రజ్యోతి) : ప్రేమ వివాహమే ఓ కుటుంబాన్ని తీవ్రశోకానికి గురిచేసిన సంఘటన ఆలష్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... కొమరోలు మండలం బాదినేనిపల్లికి చెందిన వర్రా నాగార్జున(26), అదే గ్రామానికి చెందిన ఎర్రిబోయిన ప్రసన్నలు గతఏడాది ఆగస్టులో ప్రేమించుకుని ఇంటి నుంచి వెళ్లిపోయారు. వీరు కడప జిల్లా రాజంపేటలో నివాసం ఉంటూ నాగార్జున ఒక రెస్టారెంటులో వంటమాస్టర్‌గా చేరాడు. ఆరునెలల అనంతరం ఇరువురి మధ్య అనుమానాలు పెరిగాయి. ఒకటి, రెండుసార్లు గొడవలు పడి పోలీసుల వరకు వెళ్లారు. గత నెల 23వ తేదీ రాత్రి నాగార్జున మద్యం సేవించి ఇంటికి వచ్చాక భార్య కూల్‌డ్రింక్‌లో మత్తు మందుకలిపి ఇవ్వగా వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. అనంతరం భార్య తరఫున కొందరు వచ్చి నాగార్జునపై యాసిడ్‌ పోసి వెళ్లారు. ఒళ్లంతా మంటలు వేయడంతో నాగార్జునకు మెలకువ వచ్చి కేకలు వేస్తూ తన స్నేహితులకు ఫోన్‌ చేసి చెప్పాడు. వెంటనే స్నేహితులు అతనిని 108 వాహనం ద్వారా కడప రిమ్స్‌కు, ఆ తర్వాత తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా నాగార్జున తండ్రి నాగిశెట్టి, తల్లి లక్ష్మిదేవిలు సమాచారం తెలుసుకుని తిరుపతి వెళ్లారు. జరిగిన విషయం తెలుసుకుని వారు కన్నీటి పర్యంతమయ్యారు. చికిత్స అనంతరం 10 రోజుల కిందట నాగార్జున స్వగ్రామమైన బాదినేనిపల్లికు వచ్చాడు. రెండురోజుల కిందట ఆరోగ్యం బాగాలేక కర్నూలు వైద్యశాలకు తరలించగా మంగళవారం మృతి చెందాడు. మృతదేహాన్ని బాదినేనిపల్లి గ్రామానికి తీసుకురాగా గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషయమై రాజంపేట సీఐ కులాయప్పను వివరణ కోరగా కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని నిందితులను త్వరలోనే అరెస్టుచేస్తామని చెప్పారు.

Updated Date - Apr 05 , 2025 | 12:04 AM