Sunkesula Dam: విషాదాన్ని మిగిల్చిన విహారయాత్ర
ABN , Publish Date - Apr 03 , 2025 | 05:28 AM
కర్నూలు జిల్లాలో విహారయాత్ర విషాదంగా మారింది. సుంకేసుల డ్యాంలో ఈతకు దిగిన సులేమాన్, అతని కుమారులు ఫర్హాన్, ఫైజాన్ మునిగి మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తుంగభద్రలో తండ్రి, ఇద్దరు కుమారులు మృతి.. కర్నూలు జిల్లా సుంకేసుల డ్యామ్ వద్ద ఘటన
గూడూరు, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): ఆనందంగా సాగుతున్న విహారయాత్ర ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కర్నూలు లక్ష్మీనగర్‌కు చెందిన సులేమాన్ రాజ్‌విహార్ సమీపంలో ఓ దుస్తుల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. భార్య నస్రీనా బేగం శకుంతల కల్యాణ మండపం వద్ద మరో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు. వీరికి కుమార్తె సోఫియా, ఇద్దరు కొడుకులు ఫర్హాన్, ఫైజాన్ ఉన్నారు. సోఫియా పదో తరగతి పరీక్షలు రాసింది. పెద్ద కొడుకు ఫర్హాన్ 7వ తరగతి చదవుతుండగా రెండో కుమారుడు ఫైజాన్ 2వ తరగతి చదువుతున్నాడు. రంజాన్ పర్వదినం ముగియడం, కుమార్తె పదో తరగతి పరీక్షలు పూర్తి కావడంతో సులేమాన్ (47), నస్రీన్ బేగం పిల్లలతో కలిసి సుంకేసుల డ్యాం వద్దకు విహార యాత్రకు వెళ్లారు. అప్పటికే డ్యాం వద్ద వీరి బంధువులు కూడా ఉన్నారు. సులేమాన్ తన కుమారులు ఫర్హాన్ (13), ఫైజాన్ (9)తో కలిసి ఈత కొట్టేందుకు నదిలోకి దిగాడు. లోతు గమనించకపోవడంతో ముగ్గురూ మునిగిపోయారు. స్థానికులు అప్రమత్తమై వారిని రక్షించేందుకు ప్రయత్నించినా అప్పటికే గల్లంతయ్యారు. గంటపాటు గాలింపు అనంతరం తండ్రీ కుమారుల మృతదేహాలను బయటకు తీశారు. సమాచారం తెలుసుకున్న వెంటనే తెలంగాణ రాష్ట్రం రాజోలి పోలీసులు, కర్నూలు జిల్లా గూడూరు మండల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రాజోలి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు గూడూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఏలేరులో మునిగి నలుగురి మృతి
ఏలేశ్వరం/జగ్గంపేట/పెద్దాపురం, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఏలేరు కాల్వల్లో మునిగి నలుగురు మృతి చెందారు. జగ్గంపేట గ్రామానికి చెందిన దేవర జీవన్‌కుమార్ (19), మెల్లి వీరవెంకట దుర్గ అలియాస్ తరుణ్(19) మిత్రులతో కలిసి బుధవారం ఏలేశ్వరం మండలంలోని పెద్దనాపల్లి గ్రామంలో ఏలేరు కాల్వలో ఈతకు దిగారు. ఈ క్రమంలో జీవన్‌కుమార్, తరుణ్ కాల్వలో మునిగి మృతి చెందారు. కాగా.. పెద్దాపురం మండలం కాండ్రకోటలో నూకాలమ్మ అమ్మవారి దర్శనానికి ఈ నెల 1న యానాంకు చెందిన కొప్పాడ సత్తిబాబు, తిరమూడి రాజు కుటుంబాలు వచ్చాయి. దర్శనం అనంతరం సమీపంలోని ఓ తోటలో అందరూ భోజనాలు చేశారు. కొప్పాడ బాలు(20), అతని మేనల్లుడు తిరుమాడి నాగవిశాల్ వర్మ (8) అక్కడ ఏలేరు కాల్వలో స్నానానికి వెళ్లారు. సాయంత్రమైనా రాకపోవడంతో కుటుంబీకులు వారి ఆచూకీ కోసం గాలించారు. బుధవారం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..