ఉద్యాన పంటలపై దృష్టి
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:41 PM
జిల్లాలో ఉద్యాన పంటల సాగు పెంచాలి. లైవ్‌స్టాక్ అభివృద్ధి పరంగా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. తలసరి ఆదాయాన్ని కూడా పెంచే దిశగా పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్ రాజకుమారికి దిశానిర్దేశం చేశారు.

ప్రతి ఇంటికి బ్రాడ్ బాండ్ నెట్‌వర్క్
వర్క్ ఫ్రం హోం దిశగా అడుగులు
అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో నంద్యాలపై సంతృప్తి
కలెక్టర్ల సదస్సుల్లో సీఎం చంద్రబాబు
జిల్లా స్థూల ఉత్పత్తిని పెంచేలా చర్యలు
పెట్టుబడులకు అనుగుణంగా జిల్లాను తీర్చుదిద్దుతాం
జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజంటేషన
నంద్యాల, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉద్యాన పంటల సాగు పెంచాలి. లైవ్‌స్టాక్ అభివృద్ధి పరంగా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. తలసరి ఆదాయాన్ని కూడా పెంచే దిశగా పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్ రాజకుమారికి దిశానిర్దేశం చేశారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు చివరి రోజు బుధవారం జిల్లా ప్రగతి, చేపట్టాల్సిన పనులు, ఆయా శాఖల పురోగతి వంటి అంశాలను కలెక్టర్ రాజకుమారి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం పనితీరుతో పాటు.. ప్రజలకు అందించే సేవలపై సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఫ విస్తారంగా ఉద్యాన పంటలు
జోన-5 జిల్లాల్లోని అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో ఉద్యాన పంటలను విస్రృతంగా సాగుచేయడం జరుగుతోంది. కావున రైతులకు అనుగుణంగా.. ప్రీ హోర్వెస్టింగ్., హార్వెస్టింగ్, పోస్ట్ హార్వెస్టింగ్ ఉత్తమ విధానాలను అమల్లోకి తెచ్చే విధంగా చూడాలని సూచించారు. వీటితో పాటు రైతులకు పంటలకు తగిన మద్దతు ధరలు వచ్చేంత వరకు నిల్వ చేసుకునే కోల్డ్ చైన లింకేజీ సౌకర్యాలను మరింత పెంచాలని సూచించారు. వీటితో పాటు ప్రతి గృహానికి బ్రాడ్ బ్యాండ్ నెట్‌వర్క్ సదుపాయం కల్పించి సుమారు 20 లక్షల మంది వర్క్ ఫ్రం హోం విధానం ద్వారా పనిచేసుకునే సౌకర్యం కల్పించాలి. జిల్లాలో ప్రముఖ దేవాలయాలు ఉండటంతో టెంపుల్ టూరిజం దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
ఫ ఉపాధిహామీ నిధులతో...
రానున్న రోజుల్లో ఉపాధి నిధులతో.. వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లను విరివిగా నిర్మించి భూగర్భ జల మట్టాలను పెంచాల్సిన అవసరం ఉంది. చెరువులు, రిజర్వాయర్లలోని భూ ఉపరితల జల మట్టాలు ఎక్కడిక్కడ తగిన స్థాయిలో నిల్వ ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. వీటితో పాటు కెనాల్స్ ద్వారా ప్రవహించే జలాలను కూడా పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి.
స్థూల ఉత్పత్తిని పెంచేలా చర్యలు
- జిల్లా కలెక్టర్ రాజకుమారి
జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో 15శాతం ప్లస్ గ్రోత రేట్ సాధించే దిశగా జిల్లా ప్రగతి ప్రణాళికలను రూపొందించడంతో స్థూల ఉత్పత్తిని పెంచే విధంగా చర్యలు చేపట్టామని కలెక్టర్ రాజకుమారి సీఎం చంద్రబాబుకు వివరించారు. అదేవిధంగా దేశీయ ఉత్పత్తుల పెంపకంతో పాటు జిల్లాను పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతంగా తీర్చుదిద్దుతామని తెలియజేశారు. జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు పర్యాటకంతో 43 శాతం.. సర్వీసు విభాగం పరంగా 39 శాతం.. పరిశ్రమల ద్వారా 18 శాతం మొత్తంగా.. వంద శాతం జీవీఆర్ జిల్లా అభివృద్ధికి సహకరిస్తుందని తెలియజేశారు. జిల్లాలో 46,555 కోట్ల జీవిఏకు (గ్రాస్ వాల్యూ యాడెడ్)ను 15.45 శాతంతో పెంచేలా చూడాలని ప్రణాళిక సిద్ధం చేశామని గుర్తు చేశారు.
ఫ వ్యవసాయ అనుబంధ శాఖల పరంగా జిల్లాలో 65 శాతం బీడు భూములు ఉన్నట్లు గుర్తించాం. వీటిలో సుమారు 40 వేల ఎకరాల్లో భూసాంద్రతను బట్టి సోయా, బజ్రా, బ్లాక్ గ్రాం తదితర వాటిని పెంచే దిశగా.. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాల సహాకారంతో పాటు స్పెషల్ సీఎస్‌ఆర్, వ్యవసాయ యూనివర్సీటీల సహాకారం తీసుకుంటామని నివేదించారు. జిల్లాలో దేశీయ రకాల ఉత్పత్తులను పెంచడంతో పాటు ప్రకృతి వ్యవసాయంపై రైతులు మక్కువ చూపే విధంగా చైతన్యం తీసుకువస్తామని తెలియజేశారు.
ఫ రైతులకు అనుగుణంగా డ్రోన టెక్నాలజీపై శిక్షణ ఇచ్చి 40 డ్రోన్స ఇప్పటికే వినియోగంలోకి తెచ్చాం. జిల్లా వ్యాప్తంగా 48వేల హెక్టార్లలో ఉద్యాన పంటలను సాగు చేయడం జరుగుతోంది. భవిష్యతలో మరో 10 వేల ఎకరాల వరకు విస్త రించేలా చూస్తాం. ఏడు వేల హెక్టార్లలో డ్రిప్, మైక్రో ఇరిగేష్ ద్వారా ప్రమోట్ చేస్తే.. పంట ఉత్పత్తులు 25శాతం నుంచి 30శాతం పెరిగే అవకాశం ఉంది. పండ్ల తోటల పెంపకం ద్వారా ఎకరాకు 26 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి రావడంతో పాటు బంచ ప్రొడక్షన చేయడం ద్వారా ఎకరాకు 40 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని గుర్తు చేశారు. మొత్తంగా జిల్లాలో ఉత్పత్తి అయ్యే వాటికి వాల్యూబ్రాండింగ్ చేర్చడంతో ద్వారా రూ.వెయ్యి కోట్ల జీడీపీకి పెంచే దిశగా మండల, జిల్లా స్థాయి ప్రణాళికలను తయారు చేశామని తెలియజేశారు.
ఫ లైవ్‌స్టాక్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి జిల్లాలో మిల్క్, మీట్‌కు వినియోగం అధికంగా ఉంది. ఇదే క్రమంలో జిల్లాలో 5లక్షల మేకలు, పొట్టేలు ఉన్నాయని.. 11 లక్షల లీటర్ల వరకు పాల ఉత్పత్తి జరుగుతోందని గుర్తు చేశారు. భవిష్యతలో అదనంగా మరో ఆరు లక్షల లీటర్లు పాల ఉత్పత్తి పెంచేలా చూస్తాం. అదేవిధంగా రోళ్లపాడు, నల్లమల ఆటవీ ప్రాంతాల్లో రిసార్ట్ నిర్వహించి అధిక శాతం గిరిజనులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు.
ఫ జిల్లాలో ఉన్న ఐదు రిజర్వాయర్లు, 124 ఎంఐ ట్యాంకుల్లో చేపలను ఉత్పత్తి చేసి జిల్లాకు వినియోగించిన తరువాత మిగిలిన ఉత్పత్తులను వివిధ నగరాలకు రవాణా చేసే అవకాశం ఉంది. జిల్లాలో 500 ఎంఎప్‌ఎంఈల యూనిట్లకు, పీఎం కుసుమ్ కింద విద్యుత ఉపకేంద్రాలకు 190 ఎకరాలు, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లకు స్థలాలు కేటాయించేందుకు ఇదివరకే ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.
ఫ జిల్లాలోని శ్రీశైలం, సంగమేశ్వరం తదితర శైవ క్షేత్రాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వచ్చే భక్తుల కోసం బడ్జెట్ హోటళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలోని లైమ్ స్టోన క్వారీల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుందూనది వంతెన, జోలదరాశి ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ నష్టపరిహారం తదితర పనులకు చర్యలు తీసుకోవాల్సి ఉందని సీఎం చంద్రబాబుకు కలెక్టర్ రాజకుమారి నివేదించారు.