Vijay Kumar Reddy: 2న విచారణకు రావాల్సిందే
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:50 AM
సమాచార శాఖ మాజీ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిని ఏప్రిల్ 2న విచారణకు హాజరుకావాలని అవినీతి నిరోధక శాఖ మరోసారి నోటీసు జారీచేసింది. సాక్షి పత్రిక, ఇతర మీడియాలో నిబంధనలకు విరుద్ధంగా రూ. 859 కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేసినట్లు ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది.

లేదంటే అరెస్టు తప్పదు
ఐఅండ్‌పీఆర్ మాజీ కమిషనర్
విజయ్‌కుమార్‌రెడ్డికి ఏసీబీ నోటీసు
తప్పక వస్తానన్న విజయ్‌కుమార్‌రెడ్డి
అదే విషయం హైకోర్టుకూ వెల్లడి
ముందస్తు బెయిల్‌పై విచారణ
ఏప్రిల్ మూడో వారానికి వాయిదా
అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): సమాచార శాఖలో గతంలో జరిగిన అవకతవకల వ్యవహారంలో ఏప్రిల్ 2న విచారణకు రావాలంటూ ఐ అండ్ పీఆర్ మాజీ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డికి అవినీతి నిరోధక శాఖ మరోసారి నోటీసు జారీచేసింది. ‘‘మీరు కేసు విచారణకు అవసరమైన డాక్యుమెంట్లు ఇచ్చి దర్యాప్తునకు సహకరించాలి.. ఈసారి రాకపోతే బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్ 35(6) కింద అరెస్టు చేస్తాం.’’అని ఆ నోటీసులో స్పష్టం చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ సొంత మీడియాతోపాటు కూలీ మీడియాకూ; వలంటీర్లతో సాక్షి పత్రిక కొనిపించేందుకు రూ.వందల కోట్లను నిబంధనలకు విరుద్ధంగా విజయ్‌కుమార్‌రెడ్డి దోచి పెట్టారంటూ విజిలెన్స్ విచారణలో తేలింది. 2019 నుంచి 2024 వరకూ జరిగిన ఈ బాగోతంలో మొత్తం రూ.859కోట్ల మేర ప్రభుత్వ ధనం విజయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఖర్చు చేశారు. ఇందులో సగానికి పైగా సాక్షి పత్రికకు అందించారన్న అభియోగాలపై గతేడాది నవంబరు 14న విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసింది. దీనిపై విచారణకు రావాలంటూ ఈ నెల 18న విజయ్ కుమార్ రెడ్డికి నోటీసు పంపారు. తక్షణమే తాను రాలేనని, వీలు చూసుకుని వస్తానని ఆయన బదులిచ్చారు. అదే సమయంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2న గుంటూరులోని ఏసీబీ రీజినల్ కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాలంటూ అడిషనల్ ఎస్పీ మహేశ్ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. కేసు ప్రస్తుత దశలో అరెస్టు చేయబోమని, అలాగని ఈసారి రాకపోతే బీఎన్‌ఎ్‌సఎస్ కింద తదుపరి చర్యలు తప్పవని నోటీసులో పేర్కొన్నారు. దీంతో స్పందించిన ఐ అండ్ పీఆర్ మాజీ కమిషనర్.. తాను విచారణకు హాజరవుతానని ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అదే విషయం శుక్రవారం హైకోర్టుకు కూడా ఆయన వెల్లడించారు.
ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో వాదనలు..
ఏప్రిల్ 2న ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని విజయ్‌కుమార్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. అంతకుముందు.. విజయ్‌కుమార్‌రెడ్డి తరఫు న్యాయవాది ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. ‘సాక్షి పత్రిక, చానల్‌కు అనుచిత లబ్ధి చేకూర్చారంటూ విజయకుమార్‌రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసు ఇచ్చింది. దానికి లోబడి ఏప్రిల్ 2న ఏసీబీ విచారణకు ఆయన హాజరు అవుతారు. నోటీసులో పేర్కొన్న షరతులకు కట్టుబడి ఉంటారు’ అని తెలిపారు. పిటిషనర్‌పై మొదట నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అదనంగా సెక్షన్ చేర్చారని, ఈ విషయాన్ని నోటీసులో ప్రస్తావించలేదని తెలిపారు. ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ... ‘పిటిషనర్ గత ఏడాది డిసెంబరు 31న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అప్పటినుండి పిటిషనర్‌కు రక్షణ కల్పిస్తూ కోర్టు ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదు. ఇప్పటికే ఏసీబీ అధికారులు బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు ఇచ్చారు. దానికి కట్టుబడి ఉండేలా పిటిషనర్‌ను ఆదేశించాలి’ అని కోరారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు... విజయ్‌కుమార్‌రెడ్డికి తగిన ఆదేశాలు జారీచేశారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది అభ్యర్థన మేరకు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏప్రిల్ మూడో వారానికి వాయిదా వేసింది.
అరెస్టు చేయరా?
ఏసీబీ నోటీసు తీరుపై ప్రశ్నలు
ప్రస్తుత దశలో తాము విజయ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేయబోమంటూ ఏసీబీ ఇచ్చిన నోటీసుపై సోషల్ మీడియాలో ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై స్పందించిన ఏసీబీ డీజీ అతుల్ సింగ్...గత ఏడాది జూలై 1నుంచి అమల్లోకి వచ్చిన బీఎన్‌ఎ్‌సఎస్ చట్టం ప్రకారం నిందితులను విచారణకు పిలిచే ఫార్మాట్ ప్రకారమే నోటీసు ఇచ్చామని స్పష్టం చేశారు. కేంద్ర సర్వీసులో (ఐఐఎ్‌స)లో ఉండగానే జగన్ పాదయాత్రకు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మద్దతుగా నిలిచారు. జగన్ ప్రభుత్వంలో ఏపీలో సమాచార శాఖ కమిషనర్‌గా విచ్చలవిడి వ్యవహారాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. 2024లో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆయనకు చిక్కులు ఎదురయ్యాయి.
Also Read:
42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..
మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు
కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..
For More Andhra Pradesh News and Telugu News..