Payments? చెల్లింపులెప్పుడో?
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:18 PM
When are the Payments? జిల్లాలో ఉపాధి వేతనదారులకు నిరాశే మిగిలింది. ఆర్థిక సంవత్సరం ముగింపు రోజున వారి ఖాతాల్లో వేతనాలు జమ కాలేదు. దీంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

అభివృద్ధి పనులకూ మంజూరు కాని బిల్లులు
పేరుకుపోతున్న బకాయిలు
నిరాశలో ఉపాధి వేతనదారులు.. కాంట్రాక్టర్లు
పార్వతీపురం, ఏప్రిల్1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉపాధి వేతనదారులకు నిరాశే మిగిలింది. ఆర్థిక సంవత్సరం ముగింపు రోజున వారి ఖాతాల్లో వేతనాలు జమ కాలేదు. దీంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కొద్ది నెలలుగా వేతనాలు చెల్లింపులు నిలిచిపోవడంతో వేతనదారులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. నిబంధనల ప్రకారం పనులు చేపట్టిన వారం రోజుల్లో కూలి చెల్లించాల్సి ఉంది. అయితే మూడు నెలలు గడుస్తున్నా.. ఇంతవరకూ కేంద్రం నిధులు విడుదల చేయకపోవడంపై వారు పెదవి విరుస్తున్నారు. ప్రైవేట్ పనులకు వెళ్లినా రోజువారీ వేతనం వచ్చేదని చెబుతున్నారు. ప్రస్తుతం కుటుంబ పోషణ కష్టంగా మారిందని వాపోతున్నారు. ప్రస్తుతం ఎండలను సైతం లెక్కచేయకుండా పనులు చేస్తున్నా వేతనాలు రాకపోకవడంపై ఉపాధి కూలీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లాలో సుమారు రూ.16 కోట్ల వరకు వేతన బకాయిలు ఉన్నట్లు అధికారుల గణాంకాల ద్వారా తెలుస్తోంది.
అభివృద్ధి పనులకూ నిలిచిన చెల్లింపులు
జిల్లాలో మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకూ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. సుమారు 66.60 కోట్ల మేర బకాయిలున్నట్లు తెలిసింది. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధుల ద్వారా సీసీ, బీటీ రోడ్లు, ప్రహరీ, గోశాలలు తదితర నిర్మాణాలు చేపట్టారు. మండల స్థాయి అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకొని వచ్చి ఆగమేఘాల మీద వాటి నిర్మాణాలు పూర్తి చేయించారు. కానీ వాటికి సంబంధించి బిల్లులు మాత్రం మంజూరు కాలేదు. మార్చి 31లోపు చెల్లింపులు జరగకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర నిరాశ చెందారు. అప్పులు చేసి పనులు చేపట్టామని , ప్రస్తుతం వడ్డీలు కట్టలేకపోతున్నామని వారు వాపోతున్నారు. మొత్తంగా ఉపాధి బిల్లుల చెల్లింపుల కోసం అటు వేతనదారులు, ఇటు కాంట్రాక్టర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
వంద రోజులు పూర్తయిన కుటుంబాలు 46,227
గరుగుబిల్లి: జిల్లాలోని 15 మండలాల పరిధిలో 100 రోజుల పనులు పూర్తయిన కుటుంబాలు 46,227గా అధికారులు గుర్తించారు. ఈ మేరకు నివేదికలు అందించారు. ‘మన్యం’లో 52,23,050 కుటుంబాలు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నాయి. కాగా వీరిలో 100 రోజులు పూర్తయిన వారు 46,227 మంది ఉన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఆర్‌వోఎఫ్‌ఆర్ పోడు సాగుకు సంబంధించి 150 పని దినాలు కల్పించారు. మొత్తంగా జిల్లాలో 1.69 లక్షల మేర జాబ్‌కార్డులు ఉండగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.23 కోట్ల పనిదినాల లక్ష్యం నెరవేర్చామని డ్వామా పీడీ కె.రామచంద్రరావు తెలిపారు. కాగా 6,200 శ్రమ శక్తి సంఘాలు పనుల్లో పాల్గొంటున్నాయని వెల్లడించారు.
త్వరలోనే చెల్లిస్తాం
నిధులు మంజూరైన వెంటనే బిల్లులు చెల్లిస్తాం. వేతనదారులకు మరో రెండు రోజుల్లో చెల్లింపులు జరిగే అవకాశం ఉంది. వారి బ్యాంకు ఖాతాలోకి నగదు జమవుతుంది.
- రామచంద్రరావు, పీడీ, డ్వామా, పార్వతీపురం మన్యం