రెవెన్యూ గ్రామంగా మారేనా.?
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:20 PM
తరాలు మా రినా అప్పంపల్లి గ్రామ తలరాత మాత్రం మారడం లేదు.

- ఆరు గ్రామాల శివారులో రైతుల భూములు
- తప్పని ఇబ్బందులు, పట్టించుకోని అధికారులు
మరికల్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): తరాలు మా రినా అప్పంపల్లి గ్రామ తలరాత మాత్రం మారడం లేదు. ఎందరో సర్పంచ్‌లు, ఎందరో అధికారులు, ఎమ్మెల్యేలు మారుతున్నా అప్పంపల్లి గ్రామానికి రెవెన్యూ హోదా మాత్రం దక్కడం లేదు. రెవెన్యూ గ్రామంగా గుర్తించాలని తహసీల్దార్ నుంచి ముఖ్యమంత్రి వరకు ఎన్నో వినతిపత్రాలను ఇచ్చినా గ్రామం తలరాత మాత్రం మారడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.
వివరాలు ఇలా..
1975లో అప్పంపల్లి గ్రామ పంచాయతీగా అవతరించింది. గ్రామంలో 450 కుటుంబాలు ఉండగా 22,500 మంది జనాభా ఉంది. ఇక్కడి ప్రతీ ఇంట్లో రైతులు ఉన్నారు. రైతుల పేరిట 2,511 ఎకరాల భూములు ఉన్నాయి. 150 ఎక రాలు ప్రభుత్వ అసైన్డ్ భూమి ఉంది. మూడు చెరువులు, ఐదు కుంటలు, ఎనిమిది చెక్‌డ్యామ్‌లు గ్రామం పరిధిలో ఉన్నాయి. ఇతర గ్రామాల రెవెన్యూ శివారులో భూములు మరికల్ శివారులో 1,020 ఎకరాలు, పసుపుల గ్రామ శివారులో 715 ఎకరాలు, మందిపల్లి శివారు లో 413 ఎకరాలు, మాద్వార్ శివారులో 212 ఎక రాలు, ధన్వాడ శివారులో 101 ఎకరాలు, రాంకిష్టయ్యపల్లి శివారులో 50 ఎకరాలతో మొత్తం 2,511 ఎకరాలు, 95 శాతం అక్షరాస్యత సాఽధించిన గ్రామంగా రికార్డు ఉంది. భూములన్ని ఆరు రెవెన్యూ గ్రామాల శివారులో ఉండడంతో గ్రామానికి రెవెన్యూ పరంగా వచ్చే ఆదాయానికి గండి పడుతోంది. రెవెన్యూ సదస్సులు, బ్యాంకు రుణాలు, పంట నష్ట పరిహారం, ఏమైనా భూమి సమస్యలు వస్తే చివరకు భూములు కొనుగోలు చేయాలన్నా, విక్రయించాలన్నా తది తర సమస్యల పరిష్కారానికి సంబంధిత అధి కారులను సంప్రదించాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది. నేటివరకు ఏడు మంది సర్పంచ్‌లు, ఎంతోమంది అధికారులు మారినా రెవెన్యూ గ్రామంగా మార్చే నాథుడే కరవయ్యారు.