Share News

Rural development: ‘ఉపాధి’కి ఐదు పనులు

ABN , Publish Date - Mar 27 , 2025 | 04:12 AM

గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ డ్వామా పీడీలను మూడు నెలల్లో పంచ ప్రాధాన్య పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా, పశువులకు నీటి తొట్టెల నిర్మాణం, పంట కుంటల తవ్వకం, చెరువుల పూడికతీత, పల్లె పుష్కరిణి అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

Rural development: ‘ఉపాధి’కి ఐదు పనులు

మూగ జీవాలకు నీళ్ల తొట్టెలు.. పొలాల్లో పంట కుంటలు

చెరువులు, కాలువల్లో పూడికతీత

కూలీలకు గరిష్ఠ వేతనానికి చర్యలు: కమిషనర్‌ కృష్ణ తేజ

అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో వచ్చే మూడు నెలల్లో పంచ ప్రాధాన్య పనులు చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కృష్ణ తేజ, డ్వామా పీడీలను ఆదేశించారు. బుధవారం ఆయన టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘‘వేసవిలో మూగ జీవాలను కాపాడుకునేందుకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు ప్రతి ఊళ్లో పశువులకు నీటి తొట్టెలను ఉపాధి నిధులతో నిర్మించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పశుసంవర్ధక శాఖ ద్వారా 12 వేలకు పైగా పశువుల తొట్టెలు నిర్మించేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించారు. ఈ వేసవిలోనే పొలాల్లో ‘పంట కుంటలు’ తవ్వేందుకు రైతులను ప్రోత్సహించాలి. 1.55 లక్షల పంట కుంటలను ఈ మూడు నెలల్లో పూర్తి చేసేలా కృషి చేయాలి. చెరువులు, కాలువల్లో పూడికతీత పనులకు మరింత ప్రాధాన్యమివ్వాలి. ఈ పనులన్నీ చేపట్టడంతో పాటు కూలీలకు వేతనాలు గరిష్ఠంగా ఉండేలా డ్వామా పీడీలు కృషి చేయాలి’’ అని కమిషనర్‌ సూచించారు.


ఒత్తిడికి గురి కావొద్దు...

‘పేదలకు మేలుచేసే పనులను ఉపాధి పథకం ద్వారా చేయాలి. డ్వామా పీడీలు ఒత్తిడికి గురి కావొద్దు. మీమీ స్థాయిల్లో టార్గెట్లు నిర్ణయించుకొని వాటిని పూర్తి చేయండి. పల్లె పండుగ కార్యక్రమంలో చేపట్టిన సిమెంట్‌ రోడ్లు, మినీ గోకులాలను ఉగాది రోజు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి’ అని కృష్ణ తేజ చెప్పారు.

పల్లె పుష్కరణి పనులపైనా...

‘‘రాష్ట్రవ్యాప్తంగా 750 పురాతన కోనేర్లను అభివృద్ధి చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు తీసుకుంది. ‘పల్లె పుష్కరిణి’ పేరుతో పురాతన కోనేర్లలో పూడిక తొలగించి నీటితో నింపాలి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పనులనూ ఉపాధి నిధులతో చేపట్టాలి. ఎండిపోయిన మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల పనులు కూడా ప్రారంభించి వర్షాకాలం నాటికి పూడిక తీత పూర్తి చేయాలి’’ అని కమిషనర్‌, అధికారులకు సూచించారు.


ఇవి కూడా చదవండి:

చిత్రం భళారే విచిత్రం

Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..

Updated Date - Mar 27 , 2025 | 04:12 AM