Share News

Minister Janardhan Reddy: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో ఏపీ ఫైబర్ నెట్ అధికారుల భేటీ.. ఏం చర్చించారంటే

ABN , Publish Date - Feb 21 , 2025 | 07:28 PM

Minister BC Janardhan Reddy: ఏపీ ఫైబర్ నెట్ సమావేశం ఇవాళ హాట్ హాట్‌గా జరిగింది. ఈ భేటిలో అధికారులపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

Minister Janardhan Reddy: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో ఏపీ ఫైబర్ నెట్ అధికారుల భేటీ.. ఏం చర్చించారంటే
FiberNet issues

అమరావతి: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో ఏపీ ఫైబర్ నెట్ అధికారులు ఇవాళ(శుక్రవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మంత్రి కార్యాలయ అధికారులు లేఖ రాశారు. రెండు రోజుల్లో తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలతో వివరణ ఇస్తామని జీవీ రెడ్డి స్పష్టం చేశారు. ఎండీ దినేష్ కుమార్‌ను సైతం వివరణ ఇవ్వాలని మంత్రి జనార్దన్ రెడ్డి కోరారు. రేపు సాయంత్రానికి వివరణ ఇవ్వాలని దినేష్ కుమార్‌ను ఆదేశించారు. ఇరువైపులా వివరణలు వచ్చాక వాటి ఆధారంగా ఈ వ్యవహారంలో ముందుకు వెళ్లాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.


దినేష్ కుమార్‌పై జీవీ రెడ్డి ఫైర్..

కాగా.. ఏపీ ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ ఐఏఎస్‌‌పై ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో అన్ని శాఖల్లో పురోగతి ఉందని.. ఫైబర్ నెట్‌లో ఎలాంటి పురోగతి లేదని మండిపడ్డారు. గతంతో పోలిస్తే ఈ సంస్థ ద్వారా ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఆదాయం కూడా ఎందుకు రాలేదని నిలదీశారు. ఈ తొమ్మిది నెలల్లో ఒక్క కనెక్షన్ కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 78 వేల కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ ఉందని... ప్రతిరోజూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉందని చెప్పారు. ఫైబర్ నెట్ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని జీవీరెడ్డి ధ్వజమెత్తారు.


నెట్‌వర్క్‌ను పెంచలేదు..

దినేష్ కుమార్ ఐఏఎస్ ఒక్క రోజు కూడా నెట్‌వర్క్‌ను పెంచే ప్రయత్నం చేయలేదని.. అలాంటప్పుడు కనెక్టన్‌లు ఎలా పెరుగుతాయని ప్రశ్నించారు. గత మేనేజ్‌మెంట్‌తో కలిసి ఏమైనా కుట్ర ఉంది అని అనుకోవాలా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. సమస్యలు ఎక్కడైనా వస్తాయని.. అయితే ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. ఏంటిది ఐఏఎస్ దినేశ్ కుమార్ అంటూ మండిపడ్డారు. విధుల్లో అలసత్వం వహించవద్దని, ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతున్నారని.. కానీ ఇక్కడ మాత్రం అసలు మొదలే పెట్టలేదని వ్యాఖ్యలు చేశారు.

వారిని తొలగించాల్సిందే...

ఎండీగా దినేష్ కుమార్ ఉన్నప్పటికీ ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ బిజినెస్‌ను ఒక్క అడుగుకూడా ముందుకు వెళ్లకుండా ముగ్గురు వ్యక్తులు చేస్తున్నారని ఆరోపించారు. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సత్యరామ్ భరద్వాజ్ , బిజినెస్ అడ్వైజర్ సురేష్ , ప్రాక్యూర్మెంట్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్.. వీరి ముగ్గురిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ముగ్గురు ఏం చేసినా తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. గతంలో డిసెంబర్ 24న ప్రెస్‌మీట్‌ పెట్టిన సమయంలో 410 మంది ఇర్రెగ్యులర్ ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించానని తెలిపారు. తాను ఇర్రెగ్యులర్ ఉద్యోగులను మాత్రమే తొలగించాలని చెప్పినట్లు తెలిపారు. అయితే నేటికీ కూడా ఒక్క ఉద్యోగిని కూడా తొలగిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదని అన్నారు. ఇప్పుడు వాళ్లకు కోటిన్నర జీతం పని చేయకుండా ఇవ్వాలన్నారు. ఎండీకి వారిని తొలగించడానికి భయం ఏంటి అంటూ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి ప్రశ్నించారు.


అకౌంట్స్ అడిగితే చూపించరా..

వ్యూహం సినిమా విషయంలో నోటీసు ఇస్తే నేటికీ సమాధానం లేదన్నారు. చైర్మన్‌కు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అడిగితే చూపించరా అని ప్రశ్నించారు. ఏనుగులా ఉండే ఏపీ ఫైబర్ నెట్‌ను పీనుగులా చేశారని మండిపడ్డారు. చివరకు అధికారులు శవాలపై పేలాలు ఏరుకోవాలని చూస్తున్నారన్నారు. 2000 కోట్ల రూపాయల టర్నోవర్ చేయదగ్గ సంస్థ ఇది అని తెలిపారు. అవినీతి వేరు... ద్రోహం వేరన్నారు. పాకిస్థాన్ మాట విని మన అధికారులు ఆయుధాలు కొనకపోతే అది ద్రోహం కిందకు వస్తుందని.. ఏపీ ఫైబర్ నెట్‌లో జరిగేది ఇదే అని అన్నారు. ప్రజలు కట్టే పన్నులు అంటే లెక్కలేనితనం ఇది అని వ్యాఖ్యలు చేశారు.

విజిలెన్స్ విచారణ

‘‘కేబుల్ ఆపరేటర్‌లు కొత్త కనెక్షన్‌లకు పర్మిషన్ ఇవ్వమని అడిగితే ఏం చేశారు. వారిని కనీసం లోపలికి కూడా పిలవడం లేదు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, సీఎం చంద్రబాబు పెట్టిన శ్రద్ధ కూడా మా అధికారులు ఈ సంస్థపై పెట్టడం లేదు. నేను వచ్చాక విజిలెన్స్ ఎంక్వయిరీకి సహకరించాలని సర్క్యూలర్ ఇచ్చాను. మా ఎండీ ఒక్కసారి అయినా విజిలెన్స్ వాళ్లకు కనిపించారా, వారితో మాట్లాడారా. జీవీ రెడ్డి చెప్పిన తరువాత కూడా జీతాలు ఇస్తున్నారు అని ఎవరైనా పత్రికల్లో రాస్తారు అనే నేను ఈ ప్రెస్‌మీట్ పెట్టాను. నేను చేయగలగడమా.. వెళ్ళిపోవడమా చూడాలి. ఈ సంస్థ దివాలా అంచున ఉంది. 600 కోట్లు ప్రజలు డబ్బులు ఈ సంస్థలో వున్నాయి. అధికారులు 10:45 గంటలకు వచ్చి 5 గంటలకు వెళ్ళిపోతే ఎలా... కనీసం ఓనర్ షిప్ తీసుకోరా’’ అంటూ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Minister Kollu Ravindra: జగన్ డ్రామాలను ప్రజలు ఛీకొడుతున్నారు.. మంత్రి కొల్లు రవీంద్ర విసుర్లు

Viveka Case: వివేకా హత్య కేసులో పీఏ కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ

Vamshi Case: మళ్లీ సమయం కోరిన పోలీసులు.. వంశీ న్యాయవాదుల అభ్యంతరం

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 21 , 2025 | 07:45 PM

News Hub