Pemmasani Chandrashekhar: అందుకే ఆప్‌ను ప్రజలు తిప్పికొట్టారు
ABN , Publish Date - Feb 08 , 2025 | 01:54 PM
Pemmasani Chandrashekhar: సీఎం చంద్రబాబు, తాను ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన చోట బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల్లో స్పష్టమైన మార్పు తాము ప్రచారం చేసినప్పుడే కనిపించిందని అన్నారు.

అమరావతి: ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకోలేదని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఏబీఎన్‌తో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. సంక్షేమం, తాయిలాలతో ప్రజలను మభ్యపెట్టాలని కేజ్రీవాల్ చూశారని విమర్శించారు. ప్రజల్లో స్పష్టమైన మార్పు తాము ప్రచారం చేసినప్పుడే కనిపించిందని అన్నారు. ఢిల్లీలో వెహికల్ పొల్యూషన్‌తో పాటు పొలిటికల్ పొల్యూషన్ ఉందని అన్నారు. బీజేపీ గెలుపుతో పొలిటికల్, వెహికల్ పొల్యూషన్ పోతాయని చెప్పారు. సీఎం చంద్రబాబు, తాను ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన చోట బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు ఏం మాట్లాడాలనేది ముందుగానే నిర్ణయించుకుంటారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు.
ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్‌ను కోరుకున్నారని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ మాటలు ప్రజలు విశ్వసించడం లేదన్నారు. ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకున్నారని అన్నారు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు తాగునీరు, సరైన రోడ్లు కూడా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. కేజ్రీవాల్ మంచి చేస్తారని రెండుసార్లు గెలిపిస్తే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారని చెప్పారు. నీతి నిజాయితీతో రాజకీయం చేస్తానని గెలిచిన కేజ్రీవాల్ ఆ విధంగా చేయలేకపోయారని .. అందుకే ప్రజలు ఆప్‌ను ఘోరంగా ఓడించారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
అవినీతి, అక్రమాల ఆరోపణలతోనే ఆప్ ఓటమి: అడ్డూరి శ్రీరామ్
విజయవాడ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఏపీ కమలం నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. బీజేపీ ఏపీ కార్యాలయంలో ఆనందోత్సవాలు మిన్నంటాయి. ఢిల్లీ గడ్డ బీజేపీ అడ్డా అనే నినాదాలతో బాణసంచా కాల్చి, బీజేపీ నాయకులు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత అడ్డూరి శ్రీరామ్ మీడియాతో మాట్లాడారు. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారం చేపట్టిందని గుర్తుచేశారు. అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొవటంతో ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు తిప్పి కొట్టారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీలో అధికారంలో ఉన్నా అవినీతి పార్టీలను ప్రజలు తరిమి కొట్టారని చెప్పారు. రానున్న రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ప్రజలు అధికారం ఇస్తారని తెలిపారు. ఢిల్లీలో బీజేపీకి అధికారం కట్టబెట్టిన ప్రజలకు అడ్డూరి శ్రీరామ్ ధన్యవాదాలు తెలిపారు.
బీజేపీకి అన్ని వర్గాల ఆదరణ: శివన్నారాయణ
బీజేపీకి అన్నివర్గాల నుంచి ఆదరణ లభించిందని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి శివన్నారాయణ తెలిపారు. అవినీతి అంతం అంటూ అధికారంలోకి ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిందని.. కానీ ఆ అవినీతిలోనే కేజ్రీవాల్ కూరుకుపోయారని విమర్శించారు. యమున నది కాలుష్యం అంటూ బీజేపీపై విమర్శలు చేశారని.. కానీ ప్రజలు మాత్రం బీజేపీ భారతదేశం విలువలు పెంచిన పార్టీ అని తెలుసుకున్నారని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సాధారణ పార్టీ అని చెప్పి... ఇక్కడ జగన్ ఏ విధంగా ప్యాలెస్‌లు కట్టుకున్నారో... ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా అదే విధంగా వ్యవహారించారని ఆరోపించారు. అందుకే ఆప్‌ను ప్రజలు తిప్పి కొట్టారని శివన్నారాయణ పేర్కొన్నారు.