Share News

AP Politics: రాష్ట్ర అప్పులు 9,74,556 కోట్లు

ABN , Publish Date - Mar 21 , 2025 | 06:01 AM

2018-19 నాటికి ప్రభుత్వానికి రూ.2,57,509 కోట్లు, కార్పొరేషన్లకు రూ.49 వేల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారు. 2024 జూన్‌ 12 నాటికి ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల అప్పులు రూ.9,74,556 కోట్లకు చేరాయన్నారు.

AP Politics: రాష్ట్ర అప్పులు 9,74,556 కోట్లు

ఉద్యోగుల నిధి 80,914 కోట్లు వాడేశారు

సివిల్‌ డిపాజిట్లు, ధాన్యం డబ్బులు కూడా..

అమరావతి, మార్చి 20(ఆంధ్రజ్యోతి):ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల రుణాలపై ప్రశ్నోత్తరాల సమయంలో శాసనమండలిలో గురువారం అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. వైసీపీ ఆరోపణలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ధీటుగా బదులిచ్చారు. 2018-19 నాటికి ప్రభుత్వానికి రూ.2,57,509 కోట్లు, కార్పొరేషన్లకు రూ.49 వేల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారు. 2024 జూన్‌ 12 నాటికి ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల అప్పులు రూ.9,74,556 కోట్లకు చేరాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 జూన్‌ 12 నుంచి, 2024 డిసెంబరు 31వరకు పెరిగిన నికర ప్రజారుణం రూ.44,124కోట్లు మాత్రమేనని, వీటిలో 41,599కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పుల కోసమే చెల్లించామన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు. విపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ 2014-19, 2019-24 సంవత్సరాల్లో అప్పులను వేర్వేరుగా చూపిస్తూ శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పయ్యావుల మాట్లాడుతూ ఏజీ నివేదిక ప్రకారం ప్రభుత్వానికి 9,74,556 కోట్ల అప్పులు ఉన్నాయన్నారు. ఉద్యోగులు దాచుకున్న 80,914 కోట్ల నిధిని కూడా గత ప్రభుత్వం వాడుకుందన్నారు. ఉద్యోగుల డబ్బు వాడుకుంటే అది అప్పు కాదా? అని ప్రశ్నించారు. సివిల్‌ డిపాజిట్లు, రైతుల ధాన్యం డబ్బులను వాడేశారని, రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు తామే చెల్లిస్తున్నామని చెప్పారు.


కేంద్ర పథకాలకు 7,230 కోట్లు చెల్లించాం: పయ్యావుల

కేంద్ర ప్రాయోజిత పథకాలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.7,230కోట్లు ఉన్నాయని, పథకాల కోసం కేంద్రం వాటా కింద ఇచ్చిన రూ.4,350 కోట్లనూ గత ప్రభుత్వం దారి మళ్లించిందని మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. గురువారం అసెంబ్లీలో ధూళిపాళ్ల నరేంద్ర, కూన రవికుమార్‌, గోరంట్ల బుచ్చయ్యచౌదరి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర, రాష్ట్ర వాటా కింద ఇవ్వాల్సిన నిధులు మొత్తం రూ.7,230 కోట్ల బకాయిలు విడుదల చేశామన్నారు. నిలిచిన కేంద్ర పథకాలు తిరిగి ప్రారంభించేందుకు 4వేల కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. కేంద్రం వాటా ఇచ్చినా మనం వేయకపోవడంతో పెనాల్టీలు విధించిందని అవి దాదాపు 350కోట్లు ఉన్నాయని, వాటిని రద్దు చేయాలని కేంద్రంతో చర్చలు జరుపుతున్నామన్నారు.


ఇవి కూడా చదవండి..

Shocking Video: నాదే తప్పు అయితే.. ఇక్కడి నుంచి వెళ్లిపోతా.. బస్సు డ్రైవర్ ఏం చేశాడో చూస్తే నివ్వెరపోవడం ఖాయం..

Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..

Updated Date - Mar 21 , 2025 | 06:01 AM