పెద్దిరెడ్డ్డికి హైకోర్టు షాక్
ABN , Publish Date - Mar 13 , 2025 | 03:50 AM
సర్వే నం. 261/2లోని 2.38 ఎకరాల విషయంలో యాజమాన్య హక్కులు నిరూపణకు పెద్దిరెడ్డి వద్ద ఎలాంటి దస్త్రాలు లేనందున నోటీసులు నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది.

బుగ్గ మఠం ఈవో షోకాజ్ నోటీసుపై జోక్యానికి నిరాకరణ
అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. తిరుపతి, ఎం.ఆర్‌పల్లి, మారుతి నగర్ ఎక్స్‌టెన్షన్ పరిధిలోని బుగ్గమఠం భూముల ఆక్రమణపై వివరణ ఇవ్వాలని, ఆక్రమణదారుగా భావించి ఎందుకు ఖాళీ చేయించకూడదో చెప్పాలంటూ ఆ మఠం అసిస్టెంట్ కమిషనర్/ఈవో మార్చి7న ఇచ్చిన షోకాజ్ నోటీసుల విషయంలో జోక్యానికి నిరాకరించింది. సర్వే నం. 261/2లోని 2.38 ఎకరాల విషయంలో యాజమాన్య హక్కులు నిరూపణకు పెద్దిరెడ్డి వద్ద ఎలాంటి దస్త్రాలు లేనందున నోటీసులు నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. సర్వే నం. 261/1లో కేవలం 80 సెంట్ల విషయంలో టైటిల్ ఉందని పిటిషనర్ చెబుతున్న నేపథ్యంలో ఆ భూమి విషయంలో అధికారులు జోక్యం చేసుకోకుండా రెండువారాలపాటు నిలువరించింది. అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చేందుకు గడువును పొడిగించింది. ఈ వ్యవహారంపై సవివరంగా ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జగడం సుమతి బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. తిరుపతి, ఎం.ఆర్‌పల్లి, మారుతినగర్ ఎక్స్‌టెన్షన్ పరిధిలోని సర్వే నం. 261/1లోని 1.50 ఎకరాలు, సర్వేనం. 261/2లోని 2.38 ఎకరాల బుగ్గమఠం భూముల ఆక్రమణపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, విఫలమైతే ఆక్రమణదారుగా భావించి.. ఎందుకు ఖాళీ చేయించకూడదో చెప్పాలంటూ తిరుపతి బుగ్గ మఠం అసిస్టెంట్ కమిషనర్/ఈవో మార్చి7న పెద్దిరెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ పెద్దిరెడ్డి బుధవారం అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి లంచ్‌మోషన్‌గా విచారణకు స్వీకరించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. గత 30 ఏళ్లుగా భూమి పిటిషనర్ ఆధీనంలోనే ఉందన్నారు. రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా భూమిని కొనుగోలు చేశామన్నారు. షోకాజ్ నోటీసును రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, బుగ్గమఠం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. సర్వేనం. 261/2లోని 2.38 ఎకరాల భూమిపై హక్కులు నిరూపణకు పిటిషనర్ ఎలాంటి ప్రాథమిక ఆధారాలు కోర్టు ముందు ఉంచనందున షోకాజ్ నోటీసు విషయంలో జోక్యం చేసుకోవద్దని కోరారు.