High Court: పదోన్నతులపై తీర్పును అమలు చేయలేదే?
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:32 AM
పదోన్నతి పొందిన ఉద్యోగుల్లో రిజర్వుడు కేటగిరీకి చెందిన ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో గుర్తించడంలో ఎలాంటి పురోగతి లేదని ఆక్షేపించింది. మరోవైపు రిజర్వుడు కేటగిరీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించడం వల్ల ప్రభావితమైన ఉద్యోగులకు పదోన్నతి ఇచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది.

2018నాటి ఉమ్మడి హైకోర్టు తీర్పు అమలులో తీవ్ర నిర్లక్ష్యం
మూడు నెలల్లో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయండి
లేకుంటే సీఎస్ హాజరుకావాలని హైకోర్టు ఆదేశం
అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు పదోన్నతి కల్పన విషయంలో ఉమ్మడి హైకోర్టు 2018లో ఇచ్చిన తీర్పు అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. పదోన్నతి పొందిన ఉద్యోగుల్లో రిజర్వుడు కేటగిరీకి చెందిన ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో గుర్తించడంలో ఎలాంటి పురోగతి లేదని ఆక్షేపించింది. మరోవైపు రిజర్వుడు కేటగిరీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించడం వల్ల ప్రభావితమైన ఉద్యోగులకు పదోన్నతి ఇచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. ఉమ్మడి హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేసి, నివేదికను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. దీనిలో విఫలమైతే జూన్ 23న కోర్టుకు హాజరుకావాలని రాష్ట్ర సీఎ్‌సను ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది.
పదోన్నతుల్లో అన్యాయం జరిగిందంటూ పలువురు ఉద్యోగులు 2016, 2017లో ఉమ్మడి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన కోర్టు.. పదోన్నతుల్లో అన్ని వర్గాల ఉద్యోగులకు తగిన ప్రాతినిధ్యం ఉందా? లేదా? అనే విషయాన్ని అధ్యయనం చేయకుండా పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించారని తప్పు పట్టింది. బాధిత ఉద్యోగుల వాదన విని రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు అనుగుణంగా ప్రతీ ఉద్యోగి పదోన్నతిని సమీక్షించాలని ఆదేశించింది. రిజర్వ్ కేటగిరీ ఉద్యోగులు పరిమితికి మించి ప్రమోషన్లు పొందినట్లైతే, రిజర్వేషన్ పరిధిలోకి రాని ఇతర ఉద్యోగులకు పదోన్నతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ 2018 డిసెంబరు 11న తీర్పు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు అమలుకాకపోవడంతో ది సెక్రెటేరియట్ బీసీ అండ్ ఓసీ ఎంప్లాయిస్ అసోసియేషన్, మరికొందరు ఉద్యోగులు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ఈ పిటిషన్లు గత ఆరేళ్లలో 32సార్లు విచారణకు వచ్చాయని గుర్తు చేసింది. పదోన్నతి పొందిన ఉద్యోగుల్లో రిజర్వ్ కేటగిరీకి చెందిన ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో గుర్తించడంలో ఎలాంటి పురోగతి లేదని తెలిపింది.
ఇవి కూడా చదవండి:
Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే