Share News

అంచనాలతోనే సరి..

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:41 AM

ఏటా వేసవిలో చేపట్టే పంట కాలువల నిర్వహణ పనులు ఈ ఏడాదైనా జరిగేనా అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేసవి రానే వచ్చింది. పంట కాలువలకు ఫిబ్రవరిలోనే సాగునీటి విడుదల ఆగిపోయింది. ప్రస్తుతం పంట కాలువలు, డ్రెయిన్లలో తూడు, గుర్రపు డెక్క, నాచు, కిక్కిస పెరిగిపోయి పూడిక తీతపనుల కోసం ఎదురు చూస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సాగు నీటి సంఘాల చొరవతో 722పనులకు రూ.36.72 కోట్లతో అంచనాలు తయారు చేసి అధికారులు ప్రభుత్వానికి పంపారు. నేటి వరకు ఆమోదం రాలేదు. గతంలో డ్రెయునేజీల్లో పూడికతీత పనులు సక్రమంగా చేయకపోవడంతో పొలాల్లోని నీరు బయటకు పోక ఏటా లక్ష ఎకరాలకుపైగా పంటను రైతులు కోల్పోతున్నారు. ఈ వేసవిలోనైనా సకాలంలో కాలువలలో పూడికతీత పనులు చేయాలని రైతులు కోరుతున్నారు.

అంచనాలతోనే సరి..

- పంట కాలువల నిర్వహణ పనుల్లో జాప్యం

- ఈ ఏడాది 722పనులకు రూ.36.72 కోట్లతో అంచనాలు

- ఏప్రిల్‌ వచ్చినా ఉన్నతాధికారుల నుంచి రాని ఆమోదం

- మరమ్మతులకు నోచుకోని అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌లు

ఏటా వేసవిలో చేపట్టే పంట కాలువల నిర్వహణ పనులు ఈ ఏడాదైనా జరిగేనా అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేసవి రానే వచ్చింది. పంట కాలువలకు ఫిబ్రవరిలోనే సాగునీటి విడుదల ఆగిపోయింది. ప్రస్తుతం పంట కాలువలు, డ్రెయిన్లలో తూడు, గుర్రపు డెక్క, నాచు, కిక్కిస పెరిగిపోయి పూడిక తీతపనుల కోసం ఎదురు చూస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సాగు నీటి సంఘాల చొరవతో 722పనులకు రూ.36.72 కోట్లతో అంచనాలు తయారు చేసి అధికారులు ప్రభుత్వానికి పంపారు. నేటి వరకు ఆమోదం రాలేదు. గతంలో డ్రెయునేజీల్లో పూడికతీత పనులు సక్రమంగా చేయకపోవడంతో పొలాల్లోని నీరు బయటకు పోక ఏటా లక్ష ఎకరాలకుపైగా పంటను రైతులు కోల్పోతున్నారు. ఈ వేసవిలోనైనా సకాలంలో కాలువలలో పూడికతీత పనులు చేయాలని రైతులు కోరుతున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

జిల్లాలో ఈ ఏడాది పంట కాలువలు, డ్రెయినేజీల్లో 722 ఓఅండ్‌ఎం పనులు చేసేందుకు రూ.36.72 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. ఈ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. ఆమోదం లభించిన తర్వాత టెండర్ల ప్రక్రియ, పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడానికి కనీసంగా నెలరోజులకు పైగా సమయం పడుతుంది. ఏప్రిల్‌లో ఈ పనులకు ఆమోదం తెలిపి టెండర్‌ల ప్రక్రియను పూర్తి చేస్తే మే, జూన్‌ నెలల్లో పనులను ఎలాంటి ఆటంకం లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మేలో సముద్రం నుంచి కత్తెరపోట్లు ఉప్పునీటితో వస్తాయి. దీంతో డ్రెయినేజీలలో పెరిగిన గుర్రపు డెక్క, నాచు, తూడు తదితరాలు ఉప్పునీటి ప్రభావంతో చాలా మటుకు చనిపోతాయు. ఇలా చనిపోయిన తూడు, నాచు, గుర్రపు డెక్కలను యంత్రాల ద్వారా తొలగించి బయట పడవేస్తే కొంతమేర డ్రెయునేజీలలో పూడికతీత పనులు సులభతరమవుతాయి. అలా కాకుండా జూన్‌, జూలై వరకు వేచి ఉంటే పూడికతీత పనులకు ఆటంకం ఏర్పడుతుంది. వర్షాలు కురిసిన తర్వాత డ్రెయినేజీలలోకి పూర్తిస్థాయిలో తీపి నీరు చేరితే మళ్లీ గుర్రపు డెక్క, నాచు తదితరాలు జీవం పోసుకుంటాయి. దీంతో పూడికతీత కథ మళ్లీ మొదటికి వస్తుంది.

సాగు నీటి సంఘాల పర్యవేక్షణలో పనులు

వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి సంఘాలను ఐదేళ్ల పాటు పూర్తిస్థాయిలో పక్కన పెట్టేశారు. దీంతో పంట కాలువలు, డ్రెయినేజీలలో ఎక్కడ పనులు చేయాలి, ఏ తరహా పనులు చేస్తే రైతులు పంటలు నష్టపోకుండా ఉంటారనే అంశంపై పర్యవేక్షణ కొరవడింది. దీంతో గత ఐదు సంవత్సరాలుగా ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి పంట కోత కోసే దశ వరకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి సంఘాలు ఏర్పడ్డాయి. వీటి పర్యవేక్షణలో ఈ ఏడాది కృష్ణాడెల్టాలో సాగు నీటి కాలువలు, డ్రెయినేజీల మరమ్మతు పనులు పూర్తి స్థాయిలో చేయాలనే దృక్పథంతో పనులకు సంబంధించి అంచనాలు రూపొందించారు. సాగునీటి సంఘాల అధ్యక్షులు, రైతులు కాలువల వెంట తిరిగి జిల్లాలో ఏయే ప్రాంతాల్లో ఏ తరహా పనులు చేయాలనే అంశంపై అంచనాలు రూపొందించారు. ఈ పనులన్నింటీకి అనుమతులు రాకున్నా కీలకమైన ప్రాంతాల్లో కాలువల నిర్వహణ పనులు చేసేందుకు నీటి పారుదలశాఖ అధికారులు ముందుకు వచ్చారు. డ్రెయినేజీలలో పూడిక తీయక పోవడంతో ఆగస్టు, సెప్టెంబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో భారీవర్షాలు కురిసిన సమయంలో డ్రెయినేజీలు పొంగిపోవడంతో రైతులు పంటలను కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ బాలాజీ ఈ ఏడాది జనవరిలోనే నీటి పారుదలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి, కాలువల నిర్వహణ పనులకు సంబంధించిన అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు.

జిల్లాలో 6.79 లక్షల ఎకరాల్లో పంటల సాగు

కృష్ణాడెల్టాలో 13.08 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగ్గా, తూర్పు కృష్ణా డెల్టాలో 6.79 లక్షల ఎకరాలకుపైగా వరిసాగు ఉంది. 378 తాగునీటి చెరువులు ఉన్నాయి. కేఈబీ, బందరు, రైవస్‌ కాలువ, రామరాజుపాలెం, బంటుమిల్లి కాలువల ద్వారా సాగునీటి విడుదల జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్ల పాటు కనీసంగా పంట కాలువల నిర్వహణ పనులు చేయలేదు. ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పడిన సాగునీటి సంఘాల ద్వారా పంట కాలువలు, డ్రెయిన్‌లలో మరమ్మతు పనులు చేసేందుకు ఇప్పటికే అంచనాలు రూపొందించారు. గతంలో రూ.5లక్షల వరకు నామినేషన్‌ పద్ధతిన పనులు కేటాయించేవారు. ఈ ఏడాది రూ.10 లక్షలకు ఈ మొత్తాన్ని పెంచి నామినేషన్‌ పద్ధతిన సాగునీటి సంఘాలకు పనులు అప్పగించేందుకు ప్రభుత్వం సూచన ప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. గడచిన ఏడాది కాలువల నిర్వహణ పనులకు జిల్లాకు కేవలం రూ.26కోట్లను కేటాయించారు. సార్వత్రిక ఎన్నికలు జరగడంతో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న కారణంగా కాలువల నిర్వహణ పనులకు ఆమోదం తెలపడానికి ఆగస్టు నెల వరకు వేచిచూడాల్సి వచ్చింది. ఈ నిధులతో కాలువల్లో పెరిగిపోయిన గుర్రపు డెక్క, తూడు, నాచులను తొలగించాలని మాత్రమే అంచనాలు రూపొందించారు. ఇతర మరమ్మతు పనులను చేయలేదు. కాలువలకు సాగునీటిని విడుదల చేసిన తర్వాత సెప్టెంబరు నెలలో వచ్చిన భారీ వర్షాలు, బుడమేరుకు సంభవించిన వరదల కారణంగా 50 వేల హెక్టార్లలో వరిపైరు నీటమునిగి చనిపోయింది.

అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ గేట్ల నిర్మాణం అంచనాలకే పరిమితం

అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు, నాగాయలంక మండలాల్లో ప్రధాన డ్రెయిన్‌లపై అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌గేట్లు ఏడు ఉన్నాయి. పొలాల నుంచి మురుగు నీరు సముద్రంలోకి వెళ్లేందుకు, సముద్రపు పోటు సమయంలో ఉప్పునీరు డ్రెయిన్‌ల ద్వారా పొలాల్లోకిచొచ్చుకు రాకుండా గతంలో వీటిని నిర్మించారు. పాలకాయతిప్ప, హంసలదీవి, నాలి, పాత ఉపకాలి, గుల్లలమోద, తదితర ప్రాంతాల్లోని అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌లు పూర్తిగా పాడైపోయాయి. వీటికి మరమ్మతులు చేయాలని కొన్నేళ్లుగా రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలో కూడా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ ఈ అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌లకు మరమ్మతులు చేయాలని కోరారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌లకు సంబంధించిన అంచనాలు తయారవుతూనే ఉన్నాయని అధికారులు చెప్పడం గమనార్హం.

Updated Date - Apr 01 , 2025 | 12:42 AM