‘కర్ర’ంట్ షాక్
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:59 AM
చేపల చెరువులో కర్రల సాయంతో 11 కేవీ విద్యుత లైన్‌ను ఏర్పాటు చేయడాన్ని మీరెక్కడైనా చూశారా? నందివాడ మండలం దండిగానపూడి గ్రామంలో ఈ విడ్డూరం కనిపిస్తుంది. ఈ గ్రామానికి వెళ్లే విద్యుత వైర్లను ఇలా చేపల చెరువులో నుంచి లాగారు. పొరపాటున విద్యుత వైర్లు తెగినా, ఊడిపోయి చెరువులో పడినా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉన్నా గుడివాడలోని విద్యుత శాఖ అధికారులు కనీసం పట్టించుకోవట్లేదు.

దండిగానపూడి గ్రామానికి కర్రల సాయంతో 11 కేవీ విద్యుత లైన్లు
అది కూడా పెద్ద చేపల చెరువులో ఏర్పాటు
ప్రమాదకరమంటున్నా పట్టని అధికారులు
ఈనెల 2, 3 తేదీల్లో విద్యుత సరఫరాకు అంతరాయం
మరమ్మతులకు రెండు రోజుల సమయం
వెంటనే లైన్లు మార్చాలని గ్రామస్తుల వేడుకోలు
ఆంధ్రజ్యోతి-గుడివాడ : చేపల చెరువులో కర్రల సాయంతో 11 కేవీ విద్యుత లైన్‌ను ఏర్పాటు చేయడాన్ని మీరెక్కడైనా చూశారా? నందివాడ మండలం దండిగానపూడి గ్రామంలో ఈ విడ్డూరం కనిపిస్తుంది. ఈ గ్రామానికి వెళ్లే విద్యుత వైర్లను ఇలా చేపల చెరువులో నుంచి లాగారు. పొరపాటున విద్యుత వైర్లు తెగినా, ఊడిపోయి చెరువులో పడినా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉన్నా గుడివాడలోని విద్యుత శాఖ అధికారులు కనీసం పట్టించుకోవట్లేదు.
మరమ్మతులకు ఇబ్బందిగా..
ఈ నెల 2, 3 తేదీల్లో దండిగానపూడి గ్రామంలో విద్యుత సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కరెంట్ లేక వృద్ధులు, చిన్నారులు అల్లాడిపోయారు. చేపలు, రొయ్యల చెరువుల రైతులు ఇబ్బందులు పడ్డారు. గ్రామస్తులు పలుమార్లు విద్యుత శాఖ అధికారులకు సమాచారం అందించినా స్పందన లేదు. ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకుని సరిచేయడానికి అధికారులకు రెండు రోజులు పట్టింది. రుద్రపాక సబ్‌స్టేషన్ నుంచి దండిగానపూడికి విద్యుత సరఫరా చేసే 11 కేవీ విద్యుత లైన్లు పెద్ద చేపల చెరువులో ఉన్నాయి. గుడివాడ-పోలుకొండ రహదారి నుంచి దండిగానపూడి గ్రామంలోకి విద్యుత స్తంభాలు వేయాల్సి ఉన్నా ఆ పని చేయలేదు. దీంతో ప్రస్తుతానికి కర్రల సహాయంలో 11 కేవీ విద్యుత లైన్లను లాగి దండిగానపూడి గ్రామానికి విద్యుత సరఫరా చేస్తున్నారు. దాదాపు అరకిలోమీటర్ మేర 11 కేవీ విద్యుత లైన్ చేపల చెరువులో ఉంది. చేపల చెరువు నిండుగా నీరు ఉండటంతో మరమ్మతులకు రెండు రోజుల సమయం పట్టింది.
పట్టించుకోని గ్రామస్తుల వినతి
పెద్ద చేపల చెరువు మీదుగా వెళ్తున్న విద్యుత లైన్లను తొలగించాలని పలుమార్లు గ్రామస్తులు అధికారులకు విన్నవించారు. కర్రల స్తంభాలను తొలగించి ప్రత్యామ్నాయ మార్గంలో ఏర్పాటు చేయాలని కోరినా పట్టించుకునే వారు కరువయ్యారు.
మరమ్మతులకు సమయం పట్టింది
దండిగానపూడి గ్రామానికి రోజున్నర పాటు విద్యుత అంతరాయం కలిగింది. చేపల చెరువులో కర్రల సహాయంతో 11 కేవీ విద్యుత లైన్ వెళ్తుండటంతో మరమ్మతులు చేయడానికి సమయం పట్టింది. చెరువులోని స్తంభాలను తొలగించి గ్రామ ప్రధాన రహదారి మీదుగా వేసేందుకు అంచనాలను తయారుచేసి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతున్నాం.
- కృష్ణమాణిక్య వర్మ, ఏడీఏ గుడివాడ రూరల్