Share News

ఉప సర్పంచ్‌ల ఎన్నికల్లో కూటమి జోష్‌

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:53 AM

గ్రామ పంచాయతీల ఉప సర్పంచ్‌ ఎన్నికల్లో టీడీపీకి చెందిన వారు మెజారిటీ స్థానాలు సాధించారు. పార్టీ రహితమే అయినా రాజకీయ మూలాలు కలిగి ఉండటంతో ఈ ఎన్నికలు కూడా ఉత్కంఠభరితంగానే జరిగాయి.

ఉప సర్పంచ్‌ల ఎన్నికల్లో కూటమి జోష్‌

ఉమ్మడి కృష్ణాలో 21 గ్రామ పంచాయతీలకు ఎన్నిక

కూటమి 12 స్థానాలు, వైసీపీ 9 స్థానాలు కైవసం

కొన్నిచోట్ల ఏకగ్రీవం.. మరికొన్నింట పరస్పర ఒప్పందం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గ్రామ పంచాయతీల ఉప సర్పంచ్‌ ఎన్నికల్లో టీడీపీకి చెందిన వారు మెజారిటీ స్థానాలు సాధించారు. పార్టీ రహితమే అయినా రాజకీయ మూలాలు కలిగి ఉండటంతో ఈ ఎన్నికలు కూడా ఉత్కంఠభరితంగానే జరిగాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొత్తం 21 గ్రామ పంచాయతీలకు గానూ కూటమికి చెందిన అభ్యర్థులు 12 ఉపసర్పంచ్‌ స్థానాలను కైవసం చేసుకున్నారు. వైసీపీకి చెందినవారు 9 పొందారు. ఎన్టీఆర్‌ జిల్లాలో నాలుగు గ్రామ పంచాయతీలకు ఉపసర్పంచ్‌ ఎన్నికలు జరగ్గా, రెండు కూటమి, మరో రెండు వైసీపీకి చెందినవారు కైవసం చేసుకున్నారు.

ఎన్నికలు ఇలా..

  • కృష్ణాజిల్లాలో మొత్తం 17 ఉప సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అన్నీ ఏకగ్రీవమయ్యాయి. పదింట్లో కూటమికి చెందినవారు, ఏడింట్లో వైసీపీకి చెందినవారు ఎన్నికయ్యారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, టీడీపీకి చెందిన ఎవరినీ వార్డు మెంబర్లుగా పోటీ చేయనివ్వకుండా చేసింది. అప్పట్లో ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ అత్యల్ప స్థానాలనే కైవసం చేసుకున్నప్పటికీ ప్రస్తుతం జరిగిన ఉప సర్పంచ్‌ ఎన్నికల్లో కూటమికి చెందినవారే మెజారిటీ స్థానాలు పొందడం విశేషం. సాధారణ ఎన్నికల్లో కూటమి సాధించిన ఘన విజయ ప్రభావం స్థానిక పంచాయతీలపైనా కొనసాగిందనే చెప్పవచ్చు.

  • ఎన్టీఆర్‌ జిల్లాలో రామవరప్పాడు, కృష్ణాజిల్లాలో వణుకూరు పంచాయతీల్లో గతంలో ఓ ఒప్పందం ఉంది. ఉప సర్పంచ్‌ స్థానాలను టీడీపీ, వైసీపీ చెరి రెండున్నరేళ్లు పరిపాలించాలని నిర్ణయించుకున్నాయి. అదే సంప్రదాయాన్ని కొనసాగించాయి. దీంతో రామవరప్పాడు పంచాయతీలో వైసీపీకి చెందిన పాలకవర్గమే మెజారిటీగా ఉన్నప్పటికీ ఉప సర్పంచ్‌ స్థానాన్ని మాత్రం టీడీపీకి చెందిన వార్డు మెంబర్‌కు కేటాయించారు. నాటి ఒప్పందం ప్రకారం వైసీపీ ఉప సర్పంచ్‌ రాజీనామా చేశారు. కృష్ణాజిల్లాలోని కేసరపల్లి పంచాయతీలో పార్టీలకతీతంగా అభ్యర్థిని ఎంపిక చేసుకున్నారు. ఇలా కొన్ని పంచాయతీల్లో అందరికీ తెలిసేలా, మరికొన్నింటిలో ఎవరికీ తెలియకుండా పరస్పర ఒప్పందాల మేరకు ఏకగ్రీవం చేసుకున్నారు.

  • నందిగామ ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. నందిగామ మండల పరిషతలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వైసీపీకి చెందినవారు 13 మంది, టీడీపీకి ఒక ఎంపీటీసీ స్థానం ఉంది. వైసీపీ ఎంపీటీసీ ఒకరు టీడీపీలోకి రావటంతో వైసీపీ 12, టీడీపీ 2 ఉన్నాయి. దీంతో ఎంపీపీగా కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ పెసరమెల్లి రమాదేవి పేరును ఆ పార్టీ ప్రతిపాదించగా, ఎన్నిక ఏకగ్రీవమైంది.

Updated Date - Mar 28 , 2025 | 12:53 AM