మరో షాక్..!
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:49 AM
వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ల్యాంకో లైన్ తమదని, రాధా సంస్థకు సంబంధం లేదని ఓవైపు ల్యాంకో లిక్విడేటర్ స్పష్టంగా చెబుతుండగా, ఆ వివాదం తేలకుండానే ఎన్‌హెచ్ అధికారులు మరో వివాదానికి తెరలేపారు. ఫలితంగా కేంద్రానికి రూ.250 కోట్ల నష్టం ఏర్పడేలా చేశారు.

వెస్ట్ బైపాస్ పనుల్లో మళ్లీ వివాదం
25 రోజులు విద్యుత సరఫరా ఆపాలని రాధా సంస్థకు ఎన్‌హెచ్ లేఖ
అసలు సంబంధం లేని సంస్థకు లేఖ రాయడంపై విమర్శలు
ఒప్పందం జరిగింది ల్యాంకోతో.. చెల్లింపులు మాత్రం రాధాకు..
ఆ సంస్థతో సంబంధం లేదని ల్యాంకో లిక్విడేటర్ లేఖ
అయినా సదరు సంస్థతోనే ఎన్‌హెచ్ అధికారుల మంతనాలు
ఫలితంగా రూ.250 కోట్ల వరకు నష్టం జరిగే అవకాశం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ల్యాంకో లైన్ తమదని, రాధా సంస్థకు సంబంధం లేదని ఓవైపు ల్యాంకో లిక్విడేటర్ స్పష్టంగా చెబుతుండగా, ఆ వివాదం తేలకుండానే ఎన్‌హెచ్ అధికారులు మరో వివాదానికి తెరలేపారు. ఫలితంగా కేంద్రానికి రూ.250 కోట్ల నష్టం ఏర్పడేలా చేశారు.
జరిగింది ఇదీ..
ల్యాంకో పవర్ ప్లాంట్ ఆస్తులను విక్రయానికి పెట్టిన లిక్విడేటర్.. ఎన్‌హెచ్ విజయవాడ డివిజన్ పీడీకి జనవరి 18న ఓ లేఖ రాశారు. రాధా గ్రూప్ సంస్థకు, ల్యాంకో ట్రాన్స్‌మిషన్ 400 కేవీ లైన్‌కు ఎలాంటి సంబంధం లేదని, దానిని తాము ఎంసీఎం పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు విక్రయించామని, తమకూ ఆ సంస్థకు చెల్లింపుల వివాదం నడుస్తోందని లేఖలో పేర్కొన్నారు. రాధా సంస్థతో ఎన్‌హెచ్ జరిపే ఏ విధమైన ఆర్థిక లావాదేవీలకు, తమకు సంబంధం లేదని, లైన్ మార్పులకు తాము ఏ విధమైన అనుమతులు ఇవ్వలేదని లేఖలో తెలిపారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన ఎన్‌హెచ్ అధికారులు ఈనెల 11న రాధా గ్రూప్ సంస్థకు లేఖ రాశారు. 25 రోజుల పాటు విద్యుత నిలుపుదల చేయటానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. ఓపక్క మూలనపడిన పవర్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి అన్నమాటే లేదు. ఆ లైన్‌లోకి విద్యుతే రానప్పుడు 25 రోజులు నిలుపుదల చేయాల్సిందిగా ఎన్‌హెచ్ అధికారులు లేఖ రాయటం విమర్శలకు తావిస్తోంది. ఇదంతా ఓ ఎత్తయితే.. అక్టోబరు వరకు తాము ఎలాంటి అనుమతులు ఇవ్వడం కుదరదని రాధా గ్రూప్ సంస్థ.. ఎన్‌హెచ్‌కు బదులివ్వడం కొసమెరుపు. అసలు విద్యుత ఉత్పత్తే చేయని రాధా గ్రూప్.. తమది కాని లైన్‌కు అక్టోబరు వరకు కుదరదని చెప్పడం విడ్డూరం. కొసమెరుపు ఏమిటంటే.. విద్యుదుత్పత్తి ఆపాలంటూ తమపై రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఒత్తిడి తెస్తున్నారంటూ రాధా గ్రూప్ న్యాయస్థానం మెట్లెక్కడం.
కేంద్ర ప్రభుత్వంపై రూ.250 కోట్ల భారం
ఎన్‌హెచ్ అఽధికారుల లేఖ వల్ల భవిష్యత్తులో రూ.250 కోట్ల ప్రజాధనాన్ని చెల్లించే పరిస్థితి ఏర్పడింది. ఈ భారం కేంద్ర ప్రభుత్వంపై పడే అవకాశం ఉంది. జక్కంపూడి వీయూపీ వద్ద ల్యాంకో లైన్ అలైన్‌మెంట్ మార్పునకు 25 రోజుల పాటు విద్యుత అంతరాయానికి గడువు కోరడమంటే.. అన్ని రోజులకు రూ.250 కోట్లు చెల్లించాలి. ల్యాంకో పవర్ ప్రాజెక్టు పనిచేస్తున్న దశలో 2022, జూలై 9న ఎన్‌హెచ్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 32 గంటలకు జీఎస్టీతో కలిపి రూ.13 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. దీని ప్రకారం గంటకు రూ.43 లక్షలు చెల్లించాలి. 24 గంటలకు రూ.10.50 కోట్లు చెల్లించాలి. అంటే.. 25 రోజులకు రూ.250 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
ఒప్పందం ల్యాంకోతో.. చెల్లింపులు రాధాతో..
ల్యాంకో పవర్ ప్రాజెక్టు పనిచేస్తున్నపుడు ఆ సంస్థతో ఎన్‌హెచ్ అధికారులు విద్యుత అంతరాయ చార్జీలు (డెమరేజెస్ చార్జీలు) చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు ల్యాంకో సంస్థ మూతపడింది. విద్యుదుత్పత్తే జరగట్లేదు. పైగా ఈ లైన్‌ను ఆక్షన్‌కు పెట్టారు. ఇలాంటపుడు ఈ లైన్ అలైన్‌మెంట్ మార్చాల్సిన అవసరం ఏంటో అర్థంకాని పరిస్థితి. పైగా డబ్బు చెల్లిస్తామని ఒప్పందం చేసుకోవడం, ల్యాంకోలోని ఓ యూనిట్‌ను స్ర్కాప్ కింద కొన్న రాధా సంస్థకు చెల్లింపులు చేసేలా లేఖ రాయటంపై అనుమానాలు కలుగుతున్నాయి.