ఆగి ఉన్న లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
ABN , Publish Date - Mar 23 , 2025 | 01:43 AM
ప్రకాశంజిల్లా నాగులుప్పాడు మండలం ఉప్పుగుండూరు వద్ద ఆగి ఉన్న లారీని ట్రావెల్ బస్సు ఢీకొట్టిన ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న కృష్ణాజిల్లాకు చెందిన ఆరుగురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయినులకు గాయాలయ్యాయి.

కృష్ణాజిల్లాకు చెందిన ఆరుగురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయినులకు గాయాలు
వైజ్ఞానిక యాత్రకు వెళ్లి వస్తుండగా ప్రమాదం..ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరు వద్ద ఘటన
వెంటనే ఒంగోలు వెళ్లిన డీఈవో..గాయపడిన వారికి చికిత్స అందించి, స్వస్థలాలకు తరలిస్తున్న అధికారులు
నాగులుప్పలపాడు/మచిలీపట్నం/పామర్రు /నాగాయలంక /గుడివాడ, మార్చి 22(ఆంధ్రజ్యోతి): ప్రకాశంజిల్లా నాగులుప్పాడు మండలం ఉప్పుగుండూరు వద్ద ఆగి ఉన్న లారీని ట్రావెల్ బస్సు ఢీకొట్టిన ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న కృష్ణాజిల్లాకు చెందిన ఆరుగురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయినులకు గాయాలయ్యాయి. ఈనెల 19న జిల్లా నుంచి వైజ్ఞానిక ప్రదర్శనలకు తమిళనాడు, తిరుపతి వెళ్లి తిరిగి వస్తుండగా శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఆరుగొలను, గుడివాడ, నాగాయలంక, పెదపులిపాకకు చెందిన ఆరుగురు విద్యార్థులు, మొవ్వ, పామర్రు కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయినులు గాయపడ్డారని డీఈవో పీవీజే రామారావు తెలిపారు. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే డీఈవో ఒంగోలుకు వెళ్లారు. గాయపడిన వారికి చికిత్స చేయించి, ప్రత్యేక వాహనంలో స్వస్థలాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు గాయాలు కాగా, ఉపాధ్యాయినులకు వెన్నెముకకు గాయాలయ్యాయన్నారు.
పామర్రు హైస్కూల్ ఉపాధ్యాయురాలికి రిమ్స్‌లో చికిత్స
ప్రమాదంలో గాయపడిన కంచర్ల రామారావు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలకు చెందిన సైన్సు ఉపాధ్యాయురాలు రావి లక్ష్మీకుమారి(61) ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పామర్రు నుంచి వెళ్లిన ఇద్దరు విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు. క్షేమంగా ఇంటికి చేరుకుంటున్నారు. ప్రమాదం తనను ఆవేదనకు గురిచేసిందని ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలందించేందుకు మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు.
తలగడదీవి విద్యార్థి కోలా లాస్యకు స్వల్ప గాయం
వెజ్ఞానిక యాత్రకు నాగాయలంక నుంచి నలుగురు విద్యార్థులు, తల గడదీవి నుంచి ఇద్దరు వెళ్లారు. వారిలో తలగడదీవికి చెందిన కోలా లాస్యకు కాలికి స్వల్ప గాయమైంది. ప్రథమ చికిత్స చేశాక, అందరూ నాగాయలంక సురక్షితంగా వస్తున్నారని ఎంఈవో రామదాసు తెలిపారు.
గుడివాడ ఏకేటీపీ విద్యార్థినికి కాలికి స్వల్ప గాయం
ఏకేటీపీ పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని వగురు హైమావతి కుడికాలి యాంకిల్‌కు స్వల్ప గాయమైంది. మరో విద్యార్థిని అబ్దుల్ ఆసియా బేగం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. హైమావతికి ప్రథమ చికిత్స చేశారు. వీరిద్దరిని గుడివాడ డీవైఈవో ఐ.పద్మారాణి తన కారులో గుడివాడకు తీసుకొచ్చారు.