ఏలూరు కాల్వ ఆధునీకరణ చేపట్టాలి
ABN , Publish Date - Mar 28 , 2025 | 01:14 AM
కృష్ణా తూర్పు డెల్టా డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. ఆంజనేయప్రసాద్‌ను ఎన్‌ఎస్పీ ఎల్సీ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల గోపాలకృష్ణ, కాకులపాడు డీసీ చైర్మన్ కొమ్మారెడ్డి రాజేష్ మర్యాదపూర్వకంగా కలిశారు.

హనుమాన్‌జంక్షన్ రూరల్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ఏలూరు కాలువ ఆయుకట్టులోని చివరి భూములకూ సకాలంలో సాగునీరందించేందుకు పూడికతీత పనులతో పాటు గుర్రపుడెక్కను తొలగించేలా ఆధునీకరణ పనులు మొదలు పెట్టాలని కృష్ణా తూర్పు డెల్టా డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. ఆంజనేయప్రసాద్‌ను ఎన్‌ఎస్పీ ఎల్సీ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల గోపాలకృష్ణ, కాకులపాడు డీసీ చైర్మన్ కొమ్మారెడ్డి రాజేష్ కోరారు. విజయవాడలోని జలవనరులశాఖ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆంజనేయప్రసాద్‌ను గురువారం వారు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేసి సత్కరించారు. వేలాది ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించే ఏలూరు కాలువ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గుర్రపుడెక్కతో, పొదలతో పూడిపోయిందని ఈ వేసవిలోనే ఆధునీకరణ పనులు మొదలుపెట్టి రైతులకు సకాలంలో సాగునీరందేలా చూడాలని కోరారు. ఎనికేపాడు వద్ద బుడమేరు అండర్‌టన్నెల్ వెడల్పుచేసి అధిక వర్షాల సమయంలో ఏలూరు కాలువ కట్టలు తెగిపోకుండా బలోపేతం చేయాలని కోరారు. కాలువ చివరి ప్రాంతమైన పెరికీడు-1, 2 డ్రెయిన్ల పూడికతీత, నాన్ నోటిఫైడ్ డ్రెయిన్లలో ఉపాధిహామీ పనుల ద్వారా పూడితతీత పనులు చేసేలా చూడాలని కోరారు. సమస్యలను జలవనరుల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆయకట్టుదారులకు సకాలంలో సాగునీరందేలా చూస్తానని డీఈఈ హామీ ఇచ్చారని ఆళ్ల గోపాలకృష్ణ తెలిపారు.