గడ్డి మేశారు!
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:48 AM
కాలువ గట్లపై మొలకెత్తిన గడ్డి మాయమైపోయింది. గడ్డికి సంబంధించిన ఆదాయం లెక్కలు అయోమయంగా తయారయ్యాయి. ఇప్పటికీ ఆ లెక్కలు తేలలేదు. మాయమైన గడ్డిపై రూపొందించిన నివేదిక ఓ టేబుల్ నుంచి మరో టేబుల్ పైకి షటిల్ సర్వీసు చేస్తోంది. బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు దోబూచులాడుతున్నారు. ఇదీ జలవనరుల శాఖలోని గడ్డి కథ. ఇప్పుడు ఈ అంశం ఆ శాఖలో మంటలు పుట్టిస్తోంది.

జలవనరుల శాఖలో మాయాజాలం
కాలువలపై పెరిగిన గడ్డి ద్వారా ఆదాయం
రూ.30 లక్షల వరకు స్వాహా చేసిన అధికారులు!
2020-24 వరకు కనిపించని లెక్కలు
ఖాతాల్లో జమ కాని నిధులు
ఓ ఇంజనీర్ వ్యవహారంపై విమర్శలు
విచారణ పూర్తయినా నేటికీ చర్యలు శూన్యం
నివేదికతో ఉన్నతాధికారుల దోబూచులాట
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలోని జలవనరుల శాఖ పరిధిలో ఉండే కాలువలు, పంట కాలువలు, మురుగు కాలువలపై మొలకెత్తే గడ్డికి ఏటా వేలం పాటలు నిర్వహిస్తారు. జూలై నుంచి ఆగస్టు మధ్యలో ఈ పాటలు మొదలవుతాయి. ఈ పాట గడువు ఏడాది వరకు ఉంటుంది. ఈ కాల్వ గట్లపై మొలకెత్తే గడ్డిని రైతులు పర్లాంగుల లెక్కన పాడుకుంటారు. ఒక పర్లాంగులో మొలకెత్తే గడ్డికి రూ.100 నుంచి రూ.200 ధరను జలవనరుల శాఖ నిర్ణయిస్తుంది. పాటదారులు ఎక్కువగా వేలంలో పాల్గొన్నప్పుడు ఒక పర్లాంగులో మొలకెత్తే గడ్డి ధర రూ.1000 - రూ.2వేల వరకు పలుకుతుంది. జలవనరుల శాఖలో స్పెషల్, డ్రెయినేజీ, కృష్ణా ఈస్ట్, కృష్ణా సెంటర్ డివిజన్లు ఉన్నాయి. వాటి పరిధిలో ఒక్కో డివిజన్ కింద నాలుగు సబ్ డివిజన్లు ఉన్నాయి. ఈ సబ్ డివిజన్ల పరిధిలో సెక్షన్ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లాలో ప్రవహించే పంట కాలువలు, మురుగు కాలువలు సబ్ డివిజన్ల పరిధిలో ఉన్నాయి. 1997లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నీటి వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేస్తూ చట్టం తీసుకొచ్చింది. పంట కాలువలు, మురుగునీటి కాలువలపై మొలకెత్తే గడ్డికి వేలం నిర్వహించి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని జమ చేయడానికి జలవనరుల శాఖకు ఒక ప్రత్యేక ఖాతా ఉండేలా చర్యలు తీసుకుంది. ఇలా కాలువ గట్లపై మొలకెత్తే గడ్డిని సంబంధిత రైతులు, పాడి రైతుల వేలం ద్వారా దక్కించుకుంటున్నారు. ఈ వేలం పాటల్లో సాగునీటి సంఘాలకు భాగస్వామ్యం ఉంది. ఇలా వచ్చిన ఆదాయంతో గట్లకు గండిపడినప్పుడు మరమ్మతులు చేసుకుంటారు.
ఇంజనీర్లకు అవకాశంగా మారిన ‘రద్దు’
వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో సాగునీటి సంఘాలను రద్దు చేసింది. సాగునీటి సంఘాల పాలకవర్గాలకు ఇంకా ఏడాది గడువు ఉండగానే జగన్ రద్దు నిర్ణయాన్ని అమలు చేశారు. దీంతో అధికారాలు మొత్తం సంబంధిత సబ్‌డివిజన్ ఇంజనీర్ల చేతుల్లోకి వెళ్లాయి. అప్పటి నుంచి గట్లపై గడ్డిని కొంతమంది ఇంజనీర్లు ‘మేశారు’. గడ్డికి వేలం నిర్వహించి దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇంజనీర్లు, సెక్షన్ అధికారులు తమ సొంత ఖాతాల్లో జమ చేసుకున్నారు. బందరు కాలువలకు అనుబంధంగా ప్రవహించే పంట కాలువలు, మురుగు కాలువలపై మొలకెత్తిన గడ్డి ద్వారా వచ్చిన మొత్తం ఆదాయాన్ని అప్పటి ఏఈ, ప్రస్తుత జేఈతోపాటు సెక్షన్ల సిబ్బంది మింగేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ అధికారి విజయవాడలోని నదీ పరిరక్షణ విభాగంలో పనిచేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చల్లపల్లిలో విధులు నిర్వర్తించారు. దీని పరిధిలోని గడ్డి వేలం ద్వారా వచ్చిన రూ.30లక్షలను నీటి వినియోగదారుల సంఘాల ఖాతాల్లో కాకుండా తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నట్టు ఆరోపణలు బలంగా ఉన్నాయి. దీనిపై ఆ సెక్షన్ పరిధిలోని రైతులు పలువురు కృష్ణాజిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు.
నివేదిక సిద్ధమైనా...
కలెక్టర్ ఆదేశాలతో జలవనరుల శాఖ ఉన్నతాధికారులు విచారణ నిర్వహించారు. గడ్డిని వేలం ద్వారా దక్కించుకున్న రైతుల నుంచి డబ్బులు వసూలు చేసి, రశీదులు ఇచ్చిన మాట వాస్తవమేనని గుర్తించారు. గడ్డి నిధులను మేయడంతో ఓ ఇంజనీరింగ్ అధికారితోపాటు లాకుల వద్ద విధులు నిర్వహించిన ఉద్యోగులు ఉన్నట్టు నిర్ధారించారు. దీనికి సంబంధించిన నివేదికను జలవనరుల శాఖ జిల్లా ఉన్నతాధికారులకు అందజేసినట్టు తెలిసింది. ఇద్దరు కీలక అధికారులు ఈ నివేదికను పరిశీలించకుండా తిరిగి పునఃవిచారణ చేయించాలని ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కొద్దినెలల క్రితమే ఈ నివేదిక అధికారుల టేబుల్ మీదకు వెళ్లినప్పటికీ సంబంధిత ఇంజనీర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవడానికి మీన మేషాలు లెక్కిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విచారణ నివేదిక ఒక టేబుల్ నుంచి మరో టేబుల్ పైకి ఇద్దరు ఉన్నతాధికారుల కనుసన్నల్లో తిరుగుతున్నట్టు తెలిసింది. అధికారులు ఈ గడ్డి లెక్కలను ఎప్పటికి తేల్చుతారన్న విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.