వర్రెగూడెంలో వ్యక్తి హత్య
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:46 AM
మచిలీపట్నంలోని వర్రెగూడేనికి చెందిన వీర్నాల శ్రీను అలియాస్ టోపీ శ్రీను (35) శుక్రవారం రాత్రి హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

వివాహేతర సంబంధమే కారణం
మచిలీపట్నం టౌన్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : మచిలీపట్నంలోని వర్రెగూడేనికి చెందిన వీర్నాల శ్రీను అలియాస్ టోపీ శ్రీను (35) శుక్రవారం రాత్రి హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసుల కథనం ప్రకారం.. వర్రెగూడెంలో నివాసముంటున్న టోపీ శ్రీను వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన రమణ భార్యతో శ్రీను వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో రెండేళ్లుగా ఆమె శ్రీనుతో సహజీవనం చేస్తోంది. శ్రీను కారణంగా తన భార్య తన నుంచి విడిపోయిందని, కాపురం విచ్ఛిన్నమైందని కోపం పెంచుకున్న రమణ తరచూ అతనితో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో రమణ వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు. తిరిగి రెండు రోజుల క్రితం మచిలీపట్నం వచ్చిన రమణ.. శుక్రవారం రాత్రి వర్రెగూడెంలోని మీ సేవాకేంద్రం వద్ద టోపీ శ్రీను ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. తన బంధువులతో కలిసి అక్కడకు వెళ్లి గొడవ పడ్డాడు. తన వద్ద ఉన్న కత్తితో శ్రీనును విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనాస్థలాన్ని ఎస్పీ ఆర్.గంగాధరరావు, డీఎస్పీ సీహెచ్ రాజా, ఇనుగురుపేట పోలీస్ స్టేషన్ సీఐ పరమేశ్వరరావు పరిశీలించారు. ఈ సంఘటనపై వివరాలు సేకరిస్తున్నామని, హత్యలో రమణతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని, పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని ఇనుగురుపేట పోలీసులు తెలిపారు.