లింగగూడెంలో క్షుద్రపూజలు
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:29 AM
పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం గ్రామస్థులు క్షుద్రపూజల భయంతో వణికి పోతున్నారు.

భీమవరం రోడ్డులోని మూడు రోడ్ల కూడలిలో బొమ్మలు గీసి, పసుపు కుంకుమ చల్లి, రాళ్లుపెట్టిన ఆగంతకులు
తరచూ గ్రామంలో క్షుద్రపూజలు చేస్తున్నారంటున్న గ్రామస్థులు
పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్న రైతులు, కూలీలు
పెనుగంచిప్రోలు(జగ్గయ్యపేట), మార్చి 29(ఆంధ్రజ్యోతి): పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం గ్రామస్థులు క్షుద్రపూజల భయంతో వణికి పోతున్నారు. కొద్ది రోజులగా భీమవరం రోడ్డులోని మూడు రోడ్ల కూడలిలో పూజలు చేస్తున్నట్టు గ్రామస్థులు చెబుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి అమావాస్య కావటంతో మంత్రగాళ్లు పూజ లు చేశారని పలువురు చెబుతున్నారు. రెండు బొమ్మలు గీసి, పసుపు కుంకుమలు చల్లి, రాళ్లు పెట్టి ఉన్నాయి. రాత్రి మొక్కజొన్న చేలకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన రైతులను చూసి ఆగంతకులు కారులో భీమవరం రోడ్డులోకి పరారయ్యారని చెబుతున్నారు. అర్ధరాత్రి 2-3 గంటల మధ్య ఇటీవల కాలంలో అమావాస్య తిథుల్లో పూజలు చేస్తున్నారని గ్రామస్థు లు చెబుతున్నారు. ఉపాధి పనులకు వెళ్లే కూలీలు ఆ రోడ్డులోకి వెళ్లాలం టే భయపడిపోతున్నారు. ఇటీవల పెనుగంచిప్రోలు మండలంలో అన్ని గ్రామాల్లో పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ఆ గంతకుల సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా యి. తరచూ గ్రామంలోని పెనుగంచిప్రోలు రోడ్డులో గండెవాగు వద్ద, లింగగూడెం బస్టాప్ వద్ద రోడ్డులో కోళ్లు కోయటం, కోడిగుడ్లు వదలటం, కుంకుమ ముద్దలు వేయటం చేస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. పెనుగంచిప్రోలు ఎస్సై అశ్విన్‌ను వివరణ కోరగా ఈ సంఘటన కొద్దిరోజుల క్రితం జరిగిందని తెలుస్తోందని పూర్తి విచారణ చే స్తామని తెలిపారు.