Share News

ఏఎంసీ మాజీ చైర్మన్‌పై చర్యలు తీసుకోండి.. లేదంటే రాజీనామా

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:49 AM

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. ఇప్పటికే అనేక ఆరోపణలతో వివాదాస్పదమైన ఆయన.. గురువారం అధిష్ఠానానికే అల్టిమేటం ఇచ్చారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ అలవాల రమేశ్‌రెడ్డిపై 48 గంటల్లోపు చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాననడంతో తిరువూరు రాజకీయం మరోసారి రచ్చకెక్కింది.

ఏఎంసీ మాజీ చైర్మన్‌పై చర్యలు తీసుకోండి.. లేదంటే రాజీనామా

టీడీపీ అధిష్ఠానానికి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి అల్టిమేటం

లైంగిక ఆరోపణలున్న వ్యక్తిపై చర్యలెందుకు తీసుకోరని ప్రశ్న

48 గంటల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వెల్లడి

ఎంపీ ఆఫీసులో మూల్పూరి కిషోర్‌కు ట్రాక్టర్‌ ఇచ్చాడని ఆరోపణ

రమేశ్‌రెడ్డి కనిపిస్తే చెప్పు తెగే వరకు కొడతానని ఆగ్రహం

నిరసన వ్యక్తం చేసిన మహిళలతో కలిసి కొలికపూడి వ్యాఖ్యలు

తిరువూరు, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ అలవాల రమేశ్‌రెడ్డిపై 48 గంటల్లోపు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానానికి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అల్టిమేటం జారీ చేశారు. రమేశ్‌రెడ్డి నిర్వాకాలను ఇప్పటికే పార్టీ దృష్టికి తీసుకెళ్లానని, 48 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని గట్టిగా చెప్పారు. తిరువూరులోని ఎమ్మెల్యే కొలికపూడి నివాసానికి గురువారం ఏ.కొండూరు మండలంలోని పలు గిరిజన తండాలకు చెందిన మహిళలు వచ్చి నిరసన తెలిపారు. ఏఎంసీ మాజీ చైర్మన్‌ రమేశ్‌రెడ్డి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, పనుల కోసం వెళ్లేవారిని కామవాంఛ తీర్చమంటున్నాడని వారంతా వాపోయారు. రుణం కావాలని అడిగిన మహిళను లొంగదీసుకునేందుకు తీవ్ర ఒత్తిడి తెచ్చాడని తెలిపారు. మహిళలతో నీచంగా ప్రవర్తిస్తున్న రమేశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఎమ్మెల్యే కొలికపూడి స్పందించారు. రమేశ్‌రెడ్డి లైంగిక వేధింపుల విషయం ఇప్పటికే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లానని, 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ‘ఎమ్మెల్యే అంటే నాకు భయమా, నాపై ఎంపీ ఈగవాలనివ్వడు. ఎంపీ ఆఫీసులో మూల్పూరు కిషోర్‌కు తనను కాపాడమని నాలుగు ట్రాక్టర్లు, రూ.50 లక్షలు డబ్బు ఇచ్చాను.’ అని రమేశ్‌రెడ్డి చెబుతున్నాడని, దీనిపై తాను విచారణ జరపగా, ఒక్క ట్రాక్టర్‌ ఇచ్చాడని తేలిందన్నారు. డబ్బు ఇచ్చిన విషయం మాత్రం తెలియదన్నారు. రమేశ్‌రెడ్డి తన దగ్గరకొచ్చినా, పార్టీ కార్యక్రమాల్లో కనిపించినా చెప్పు తెగేదాకా కొడతానని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను 10 రోజుల నుంచి ఎంపీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, పరిశీలకుడికి చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రమేశ్‌రెడ్డి ఆడియో విన్న తర్వాత నిలువునా పాతర వేయాలని అనిపించిందన్నారు. ఒక పెద్ద నాయకుడిని చెప్పాక.. రెండు మూడు రోజుల్లో చర్యలు ఉంటాయని భావించానని, కానీ అది జరగలేదన్నారు.

బ్యాలెన్స్‌గా, బాధ్యతాయుతంగా ఉంటున్నా..

శాసనసభ్యుడిగా ఉన్నందున చాలా బ్యాలెన్స్‌గా, బాధ్యతాయుతంగా, పార్టీకి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో 12, 13 రోజుల నుంచి కంట్రోల్‌ చేసుకుని ఉంటున్నానని ఎమ్మెల్యే కొలికపూడి అన్నారు. ఒక గిరిజన మహిళ రుణం అడిగితే.. అసభ్యకరంగా మాట్లాడిన ఓ నాయకుడిపై ఇప్పటివరకు వరకు స్పందించలేదంటే ఎలా..? అని ప్రశ్నించారు. అదే ఇతర కులాల నాయకులైతే ఇలాగే స్పందిస్తారా? కులాలకు ఓ న్యాయమా? నాయకుడికి మరో న్యాయమా? అని పార్టీ పెద్దలను అడుగుతున్నానన్నారు. తండాల మహిళలు తమ సమస్యలను చెప్పుకొనేందుకు తిరువూరు వస్తుంటే, వైసీపీకి చెందిన నాయకులు వైకుంఠరావు, చిన్నయ్య దొరలు.. వారిని బెదిరింపు ధోరణితో అడ్డుకుంటున్నారని, తప్పుచేసిన టీడీపీ నాయకుడ్ని కాపాడేందుకు వైసీపీ నాయకులు ఎందుకు తాపత్రయపడుతున్నారని కొలికపూడి ప్రశ్నించారు. చివరకు ఒక పాస్టర్‌ సైతం ఫోన్‌ చేశారని ఆయన ఆరోపించారు. ఎ.కొండూరు గిరిజన తండాల్లో 320 మరుగుదొడ్ల నిర్మాణం పేరుతో రమేశ్‌రెడ్డి నిధులు కైంకర్యం చేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి బలయ్యాడని ఎమ్మెల్యే ఆరోపించారు. నియోజకవర్గంలో వంద టిప్పర్లు మట్టి తోలకాలు చేస్తుంటే, మూడు టిప్పర్లపై కేసు నమోదు చేశారని, 97 టిప్పర్లను పట్టించుకోలేదని, మట్టి తోలకాల వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని ఎమ్మెల్యే కోరారు. కేసులు నమోదు చేసిన టిప్పర్లు ఎవరివని, కేసులు నమోదు చేయని టిప్పర్లు ఎవరివని ప్రశ్నించారు.

తిరువూరులో ఓపెన్‌ డిబేట్‌కు రండి

నియోజకవర్గంలో తానేమీ చేయకపోయినా నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయని చాలామంది చెబుతున్నారని, నాపై మీడియాలో, సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టేవారు తిరువూరు జనాలను తన గురించి అడగాలన్నారు. ఎక్కడో హైదరాబాద్‌, విజయవాడలో కూర్చుని యూట్యూబ్‌లో వీడియోలు పెట్టే వారికి సమాధానం చెప్పడానికి ఒక్క నిమిషం చాలన్నారు. నాపై మూడుసార్లు ఆరోపణలు చేశారని, ఒక్క దానికైనా సాక్ష్యం ఉందా అని ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేసే వారెవరైనా తిరువూరులో ఓపెన్‌ డిబేట్‌కు రావాలని సవాల్‌ విసిరారు.

Updated Date - Mar 28 , 2025 | 12:50 AM