25 వేల నీటి కుంటలు
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:56 PM
25 వేల నీటి కుంటలు

ఉపాధి పనులతో జిల్లాలో నీటి సమస్య పరిష్కారానికి ప్రణాళిక
రాష్ట్రంలో 2 లక్షల నీటి కుంటలు లక్ష్యం
ప్రతి పంచాయతీలో పది ఫారం పాండ్స్
ఉద్యమంగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం
నేడు పూడిచెర్లలో ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
భూగర్భ జలాలు పెరిగితేనే తాగునీటి సమస్య పరిష్కారమవుతుంది. భూమిలో తేమ శాతం సంరక్షించాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ క్షేత్రాల్లో నీటి కుంటలు (ఫారంపాండ్స్) తవ్వకాలు శ్రీకారం చుట్టింది. అన్నదాతల్లో చైతన్యం కలిగించి ప్రతి పంచాయతీలో పదికి తగ్గకుండా రాష్ట్రంలో రెండు లక్షల నీటికుంటలు తవ్వాలనే లక్ష్యం పెట్టుకున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం ద్వారా ఫారంపాండ్స్ తవ్వకాల కోసం రైతులను ప్రోత్సహించింది. తద్వారా కూలీలకు ఉన్న ఊళ్లోనే వంద రోజులు పని దినాలు కల్పించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నిర్లక్ష్యం చేశారు. మళ్లీ సీఎం చంద్రబాబు సారథ్యంలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఉపాధి హామీ పథకం నిధులతో నీటి కుంటల తవ్వకాలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి జిల్లాలో 25 వేల నీటి కుంటలు తవ్వడం లక్ష్యం.
కర్నూలు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 808 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌జీఎస్) అమలులో భాగంగా 6.25 లక్షలకు పైగా జాబ్ కార్డులు జారీ చేశారు. అందులో పనులకు హాజరయ్యే యాక్ట్టివ్ జాబ్ కార్డులు 5.75 లక్షల వరకు ఉన్నాయని డ్వామా రికార్డులు ద్వారా తెలుస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.68 కోట్ల పని దినాలు కల్పించాలని లక్ష్యం. పంట కాలువలు పూడికతీత, ఊట కుంటలు, సరిహద్దు కందకాలు, గోకులాలు, సోక్ పిట్స్, చెరువులు, కుంటలు నవీకరణ.. వంటి పనులు ద్వారా కర్నూలు జిల్లాలో కూలీల వేతనాలు (లేబర్ బడ్జెట్) రూ.231.55 కోట్లు, మెటీరియల్ కాంపోనెంట్ కోసం రూ.73.08 కోట్లు ఖర్చు చేశారు. నంద్యాల జిల్లాలో కూలీల వేతనాలు కోసం రూ.167,69 కోట్లు, సామగ్రి కోసం రూ.55.01 కోట్లు ఖర్చు చేశారు. రైతు పొలాల్లో నీటి కుంటలు (ఫారంపాండ్స్) తవ్వకాలు చేయడం వల్ల భూగర్భ జలాలు పెంచడంతో పాటు భూమిలో తేమ శాతం, పశువులకు తాగునీరు, పంటలకు పురుగు మందులు పిచికారి నీరు అందుబాటులో ఉంటుంది. దీంతో రైతులను చైతన్యపరిచి రాష్ట్ర వ్యాప్తంగా ఓ ఉద్యమంలా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.
ఉమ్మడి జిల్లాలో 25 వేలు నీటి కుంటలు
రైతులల్లో చైతన్యం కలిగించి రాష్ట్రంలో 2 లక్షల నీటి కుంటలు తవ్వాలని డ్వామా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో నెలకు 10 ఫారంపాండ్స్ చొప్పున మూడు నెలల్లో 30 తవ్వాలని లక్ష్యం. ఉమ్మడి జిల్లాలో 808 పంచాయతీలు, మజరా గ్రామాల్లో దాదాపు 25 వేల నీటి కుంటలు తవ్వకానికి లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వీటి కోసం సుమారుగా రూ.93-95 కోట్లు ఖర్చ చేయనున్నారు. దీంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ జల ప్రయోజనాలు కలిగించేలా రైతు పొలాల్లో 8 మీటర్లు వెడల్పు, 8 మీటర్లు పొడవు, 2 మీటర్లు లోతుతో 128 చదరపు మీటర్లు ఫారంపాండ్స్ తవ్వకానికి రూ.38,400 ఉపాధి హామీ నిధులు ఖర్చు చేయనున్నారు. రైతు ఆసక్తి ఉంటే 25 మీటర్లు పొడవు, 25 మీటర్లు వెడల్పు, 2 మీటర్లు లోతుతో 1,250 చదరపు మీటర్లతో ఫారంపాండ్ తవ్వుకుంటే రూ.3.75 లక్షలు ప్రభుత్వ వెచ్చిస్తుంది. బోరుబావులు తగ్గరలో నీటికుంటలు తవ్వుకుంటే బోర్లలో నీటిఊట పెరిగి సాగునీటి తీరుతాయని డ్వామా అధికారులు పేర్కొంటున్నారు.
పూడిచెర్లలో ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్
రాష్ట్ర వ్యాప్తంగా నీటి కుంటలు తవ్వకాన్ని సీఎం చంద్రబాబు ప్రభుత్వం నీటికుంటలు తవ్వకాన్ని ఉద్యమంలా చేపట్టింది. గ్రామీణాభివృద్ధి శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ శనివారం (నేడు) ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో రైతు సూర రాజన్న పొలంలో గడ్డపార చేపట్టి నీటి కుంట తవ్వకం పనులకు శ్రీకారం చుడతారు. కలెక్టరు పి. రంజిత్‌బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ నేతృత్వంలో పోలీసులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. ఉదయం 9.45 గంటలకు కర్నూలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (ఓర్వకల్లు) విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి రోడ్డు మార్గంలో పూడిచెర్లకు చేరుకుంటారు. 10.10 గంటలకు ఫారంపాండ్ పనులను ప్రారంభిస్తారు. అనంతరం ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకొని 11.45 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్తారు.
పవన్ సార్.. వీటిపై దృష్టి సారించండి:
ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు నెలలుగా వేతనాలు అందలేదు. కూలీలు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవతున్నారు. ఉపాధి పనులకు వెళితే సకాలంలో కూలీ డబ్బులు రావడంతో లేదని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. కర్నూలు జిల్లాలో దాదాపు రూ.25-30 కోట్లు వరకు బకాయి ఉందని తెలుస్తుంది. నంద్యాల జిల్లాలో కూడా రూ.16-18 కోట్లు బకాయి ఉందని అధికారులే అంటున్నారు. తక్షణమే కూలీ డబ్బులు చెల్లించాలి.
పల్లె పండుగ కార్యక్రంలో భాగంగా మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.67.58 కోట్లతో 830 సీసీ రోడ్లు నిర్మాణాలు చేపడితే 792 పూర్తి చేశారు. దాదాపు రూ.40 కోట్లకు పైగా బిల్లులు బకాయి ఉన్నాయి. నంద్యాల జిల్లాలో రూ.85.12 కోట్లలో 1,093 సీసీ రోడ్ల పనులు చేపట్టి 945 పనులు పూర్తి చేశారు. 145 పనులు పురోగతిలో ఉన్నాయి. ఇక్కడ కూడా బిల్లులు అందక పనులు చేసిన కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు.
పశుపోషణ ఆధారంగా జీవనం సాగిస్తున్న రైతులకు ఉపాఽధి హామీ పథకం నిధులతో గోకులం షెడ్లు నిర్మిస్తారంటే.. ఉత్సాహంతో రైతులు ముందుకు వచ్చారు. కర్నూలు జిల్లాలో రూ.21.92 కోట్లతో 959 గోకులం షెడ్లు మంజూరు చేశారు. రూ.9.76 కోట్లు ఖర్చు చేసి 651 షెడ్లు నిర్మాణం పూర్తి చేశారు. నంద్యాల జిల్లాలో రూ.19.61 కోట్లతో 854 గోకులం షెడ్లు మంజూరు చేస్తే.. 529 షెడ్లు పనులు పూర్తయ్యాయి. 325 షెడ్లు పురోగతిలో ఉన్నాయి. వీటికి కూడా బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి నిర్మంచుకున్న రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించి బకాయి నిధులు విడుదల చేసి కూలీలు, రైతులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. నేడు పూడిచర్లలో జరిగే ఫారంపాండ్స్ పనుల ప్రారంభోత్సవం సభలో స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు.