Share News

341 చెక్‌ డ్యాంలు..!

ABN , Publish Date - Apr 04 , 2025 | 12:14 AM

వాగుల్లో.. వంకల్లో వృథాగా పోతున్న వర్షపు నీటికి అడ్డుకట్ట వేయాలి. ఆ నీటిని పొలాలకు మళ్లించాలి.

341 చెక్‌ డ్యాంలు..!
వెల్దుర్తి మండలంలో నిర్మించిన చెక్‌డ్యాం

రూ.62.93 కోట్లతో నాబార్డు ఫేజ్‌-1 కింద జలవనరుల శాఖ ప్రతిపాదనలు

అత్యధికంగా పత్తికొండ నియోజకవర్గంలో 179 చెక్‌డ్యాంలు

ఆదోని నుంచి ఒక్క ప్రతిపాదన కూడా లేదు

ఫేజ్‌-2 కింద ప్రతిపాదనలు తయారీలో ఇంజనీర్లు

వాగుల్లో.. వంకల్లో వృథాగా పోతున్న వర్షపు నీటికి అడ్డుకట్ట వేయాలి. ఆ నీటిని పొలాలకు మళ్లించాలి. పంటలను కాపాడి, భూగర్భ జలాలు పెంచాలనే ప్రధాన లక్ష్యంగా సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం చెక్‌ డ్యాంల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. నాబార్డు నిధులతో చేపట్టే నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాలో ఫేజ్‌-1 కింద 341 చెక్‌డ్యాం నిర్మాణాల రూ.62.93 కోట్ల నిధులు ఇవ్వాలని జలవనరుల శాఖ కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈ ద్వారకానాథ్‌రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఫేజ్‌-2 కింద చేపట్టబోయే చెక్‌డ్యాం నిర్మాణాలకు ప్రతిపాదనలు తయారీలో ఇంజనీర్లు నిమగ్నమయ్యారు. నాబార్డు నిధులు చిన్ననీటిపారుదల శాఖ (ఎంఐ) ఇంజనీర్ల పర్యవేక్షణలో ఈ చెక్‌డ్యాంలు నిర్మించేలా ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. నిధులొస్తే తెలుగు తమ్ముళ్లకు పండుగే.

కర్నూలు, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):

అత్యధికంగా పత్తికొండలో 179 చెక్‌డ్యాంలు:

జిల్లాలో 25 మండలాలు ఉంటే ఫేజ్‌-1 కింద 19 మండలాల్లో మాత్రమే చెక్‌ డ్యాం నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపించారు. అత్యధికంగా పత్తికొండ నియోజకవర్గంలో 179 చెక్‌డ్యాంలకు రూ.33.06 కోట్లు అవసరం ఉందని అంచనా వేశారు. అందులోనూ అత్యధికంగా కృష్ణగిరి మండలంలో 97, వెల్దుర్తి మండలంలో 51 చెక్‌డ్యాంలు ఉన్నాయి. నీరు-చెట్టు పథకం కింద చెక్‌డ్యాంలు నిర్మించకుండానే నిర్మించినట్లు బోగస్‌ బిల్లులు సృష్టించి కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లో భారీగా నిధులు స్వాహా చేశారనే ఆరోపణులు ఉన్నాయి. నాబార్డు నిధులతో నిర్మించే చెక్‌డ్యాంల ప్రతిపాదనల్లోనూ ఆ మండలాలకే పెద్దపీట వేయడం కొసమెరుపు. ఆదోని నియోజకవర్గంలో ఒక్క చెక్‌డ్యాంకు కూడా ప్రతిపాదన పంపలేదు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మిగనూరు, నందవరం, కోడుమూరు నియోజకవర్గంలో గూడూరు, సి. బెళగల్‌, పాణ్యం నియోజకవర్గంలో కల్లూరు మండలాల్లో కూడా ఒక్క చెక్‌డ్యాంకు కూడా ఫేజ్‌-1లో స్థానం లభించలేదు. అయితే.. ఆయా మండలాల్లో ఎంఐ విభాగం ఏఈఈ పోస్టులు ఖాళీగా ఉండడం, ఒక ప్రతిపాదన తయారు చేయాలంటే రూ.2-5 వేల వరకు ఖర్చు అవుతుండడంతో ప్రతిపాదనలు తయారు చేసేందుకు పక్క మండలాల ఇంజనీర్లు ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది. ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకొని ఖాళీగా ఉన్న ఎంఐ ఏఈఈ పోస్టులు భర్తీ చేయించాలని పలువురు కోరుతున్నారు. అయితే.. రెండు మూడు నియోజకవర్గాల్లో టీడీపీలోనూ, కూటమిలోనూ వర్గవిభేదాలు తీవ్రంగా ఉండడంతో ఆ నియోజకవర్గాల్లో పని చేసేందుకు ఏఈఈ, డీఈఈలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తున్నది.

నాబార్డు నిధులతో చెక్‌డ్యాంల ప్రతిపాదనలు, అంచనా (సుమారుగా రూ.కోట్లలో)

నియోజకవర్గం చెక్‌డ్యాంలు అంచనా

ఆలూరు 54 9.88

ఎమ్మిగనూరు 12 2.24

కోడుమూరు 23 4.25

మంత్రాలయం 57 10.55

పత్తికొండ 179 33.06

పాణ్యం 12 2.21

డోన్‌ 4 0.74

మొత్తం 341 62.93

నాబార్డు కింద చెక్‌ డ్యాంల నిర్మాణం

ప్రభుత్వం ఆదేశాల మేరకు నాబార్డు నిధులతో చేపట్టే చెక్‌డ్యాంల నిర్మాణాలకు ఫేజ్‌-1 కింద 341 చెక్‌డ్యాంల నిర్మాణాల కోసం రూ.62.93 కోట్లతో ప్రతిపాదన పంపించాం. మిగిలిన మండలాలు ఫేజ్‌-2 కింద పంపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. చెక్‌డ్యాంలు నిర్మాణం వల్ల భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల ద్వారా సాగు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

- ద్వారకనాథ్‌రెడ్డి, ఎస్‌ఈ, జలవనరుల శాఖ కర్నూలు సర్కిల్‌

Updated Date - Apr 04 , 2025 | 12:14 AM