నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో మహా మోసం!
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:23 AM
అది ప్రభుత్వ స్థలం.. ఆ స్థలానికి నాలుగు ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించేసి ఏకంగా రూ.3.24 కోట్ల రుణం పొందారు ఆదోనికి చెందిన ఘనులు. అడిగిందే తడువుగా ఆదోనిలోని అవ్వ బ్యాంకు అధికారులు సైతం రుణాన్ని ఇచ్చేశారు. ఎన్నాళ్లకూ రుణం కట్టలేకపోవడంతో తాకట్టు పెట్టిన భూమిని వేలం వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

ఆదోని అవ్వ బ్యాంకులో రూ.3.24 కోట్ల రుణం
తీసుకున్న రుణాన్ని చెల్లించని నిర్వాహకులు
తాకట్టు భూమి వేలం వేసేందుకు సిద్ధమైన అధికారులు
చివరికి ప్రభుత్వ స్థలంగా గుర్తింపు
బ్యాంకు సీఈవోతో పాటు ముగ్గురిపై కేసు నమోదు
ఆదోని, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): అది ప్రభుత్వ స్థలం.. ఆ స్థలానికి నాలుగు ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించేసి ఏకంగా రూ.3.24 కోట్ల రుణం పొందారు ఆదోనికి చెందిన ఘనులు. అడిగిందే తడువుగా ఆదోనిలోని అవ్వ బ్యాంకు అధికారులు సైతం రుణాన్ని ఇచ్చేశారు. ఎన్నాళ్లకూ రుణం కట్టలేకపోవడంతో తాకట్టు పెట్టిన భూమిని వేలం వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తీరా భూమి వద్దకు వెళ్తే అది కాస్తా ప్రభుత్వ భూమి కావడంతో బ్యాంకు అధికా రులు ఖంగుతిన్నారు. బ్యాంకులో తాకట్టుకోసం ఉంచిన పత్రాలన్నీ ఫేక్ డాక్యుమెంట్లుగా సబ్ రిజిస్ట్రార్ తేల్చేయడంతో బ్యాంకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆదోని పట్టణంలో నివాసం ఉంటున్న ఎల్లే మల్లేశప్ప, ఎల్లే చిన్న బసవ, ఎల్లే చైత్రలు వీరు పట్టణంలోని శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో 60 సెంట్ల భూమి ఉన్నట్లు నకిలీ పత్రాలను సృష్టిం చారు. 2021 సంవత్సరంలో బ్యాంకు సీఈవో మురళి కృష్ణ సహకారంతో రూ.3.24 కోట్లు రుణం తీసుకున్నారు. నిజానికి సర్వే నెంబరు 24లో 4.50 ఎకరాల పొలం ఉంది. అందులో 4.50 ఎకరాలు టీచర్స్ సొసైటీ పేరిట 40 ఏళ్ల క్రితం రూ.90 వేలకు విక్రయించారు. అందులో తమకుటుంబ సభ్యులకు 60 సెంట్లు భూమి ఉన్నట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు.
బ్యాంకు సీఈవోనే సూత్రధారి..?
రుణానికి అవసరమైన డాక్యుమెంట్లు, భూమి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి రుణాలు మంజూరు చేయాల్సిన బాధ్యత సంబంధిత సీఈవోపై ఉంటుంది. అయితే 2021లో సర్వేనెంబర్ 24లో 60సెంట్ల భూమికి రూ.3.24 కోట్లు మంజూరు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇంత పెద్దమొత్తం రుణంగా ఇచ్చేటప్పుడు భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయా? లేదా? అని చూడకుండానే ఆగమేఘాలపై రుణాన్ని మంజూరు చేశారు. ఈ వ్యవహారంపై బ్యాంకు సీఈవో మురళి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీఈవో మురళితో పాటు ఎల్ల మల్లేషప్ప, చిన్న బసప్ప, చైత్ర నలుగురు కలిసి బ్యాంకును తప్పుదోవ పట్టించారని, నకిలీ పత్రాలతో రుణం పొందినట్లు బ్యాంకు చైర్మన్ రాచోటి సుబ్బయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.
వెలుగు చూసిందిలా..!
రుణం తీసుకుని మూడేళ్లు కావస్తున్నా తీసుకున్న రుణానికి సకాలంలో రుణ కంతులను చెల్లించలేదు. బ్యాంకు అధికారులు పదే పదే నోటీ సులు పంపించినా సమాధానం రాలేదు.. దీంతో బ్యాంకు అధికారులు రుణగ్రస్తులపై ఆరా తీశారు. మరోవైపు బ్యాంకులో తాకట్టు పెట్టిన భూమి పత్రాలను పరిశీలించారు. వాళ్లు ఒకవేళ రుణం చెల్లించకుంటే తనఖా పెట్టిన భూమినైనా వేలం వేసుకోవడానికి అవకాశం ఉంటుందని భావిం చారు. ఆ మేరకు తనఖా పెట్టిన భూమిని వేలం వేస్తున్నట్టు పత్రిక ప్రకటన కూడా ఇచ్చారు. అయితే అది సొసైటీ భూమి అని.. క్రయవి క్రయాలకు ఆస్కారం లేదని స్థానికుల నుంచి బ్యాంకు అధికారులకు అర్జీలు వెళ్లాయి. దీంతో బ్యాంక్ అధికారులు డాక్యుమెంట్లను సబ్ రిజిస్ట్రార్ అధికారుల సహాయంతో పరిశీలించారు. బ్యాంకుకు సమర్పించిన డాక్యుమెంట్లు నకిలీవి అని, అందు లోని సంతకాలన్నీ ఫోర్జరీ చేసినట్లు సబ్ రిజిస్ట్రార్ తేల్చేశారు. దీంతో బ్యాంకు అధికారులు సంబం ధిత సీఈవో గట్టు మురళికి నోటీసులు ఇచ్చారు. రూ.3.24 కోట్లు సంబంధించిన డాక్యుమెంట్ నకిలీ వని అందుకు బాధ్యత వహించాలంటూ మెమో జారీ చేశారు. 2024 డిసెంబరు 4వ తేదీన సీఈవో గట్టు మురళిని సస్పెండ్ చేసి రూ.3.24 కోట్ల మొత్తానికి బ్యాంక్ అధికారులు వివరణ కోరారు. అందుకు మూడు నెలలు సమయం అడిగినట్లు ఆలోగా నగదును పూర్తిస్థాయిలో చెల్లించేలా చూ స్తామని హామీ ఇచ్చినట్లు బ్యాంక్ అధికారులు అం టున్నారు. మూడు నెలలు గడిచిపోయినా సీఈవో మురళి నుంచి ఎలాంటి స్పందన లేదు. చేసేదిలేక చివరకు అవ్వ బ్యాంకు చైర్మన్ రాచోటి సుబ్బయ్య వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నలుగురిపై కేసు నమోదు చేశాం
మహాయోగి లక్ష్మమ్మ అవ్వ కో-ఆపరేటివ్ బ్యాంకులో 2021లో నకిలీ భూమి డాక్యుమెంట్లను పెట్టి రూ.3.24 కోట్లను రుణంగా తీసుకొని ఆ మొత్తాన్ని చెల్లించలేదని బ్యాంకు చైర్మన్ రాయచోటి సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఇందులో ఎవరి హస్తముంది, దీనివెనుక సూత్రధారులు ఎవరున్నారు. అన్నదానిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి త్వరలో వారిని అరెస్ట్ చేస్తాం. ఫోర్జరీ డాక్యుమెంట్లు, సబ్ రిజిస్ట్రార్ సంతకంతో పాటు అందుకు వాడిన సీళ్లు కూడా నకిలీవే అని గుర్తించాం. త్వరలో కేసును ఛేదిస్తాం. - శ్రీరామ్, సీఐ, వన్ టౌన్, ఆదోని