Share News

హంద్రీ సరిహద్దులు గుర్తింపు

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:01 AM

కర్నూలు నగరంలో హంద్రీనది అక్రమణలపై జలవనరుల శాఖ ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు.

హంద్రీ సరిహద్దులు గుర్తింపు
కల్లూరు మండలం పందిపాడు వద్ద హంద్రీనది సరిహద్దులు గుర్తించి సరిహద్దు పిల్లర్లు పాతుతున్న అధికారులు, సిబ్బంది

సర్వే చేసి.. పిల్లర్లు పాతిన ఇంజనీర్లు

ఆక్రమణదారులపై వేటుపడేనా..?

కర్నూలు, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలో హంద్రీనది అక్రమణలపై జలవనరుల శాఖ ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. ఎట్టకేలకు సరిహద్దులు గుర్తించి రాళ్లు పాతుతున్నారు. నది అక్రమణదారులపై వేటు పడుతుందా..? అన్న చర్చ జోరుగా సాగుతోంది. పత్తికొండ మండలం పందికోన కొండల్లో ఒక పాయగా, చిన్నహుల్తి ఎగువన మరో పాయ (వంక)గా ప్రవహించే హంద్రీనది దేవనకొండ మండలం అలారుదిన్నె సమీపంలో సంగమమై కర్నూలు నగరం జొహరాపురం బిడ్జి దిగువన తుంగభద్ర నదిలో కలుస్తుంది. తుంగభద్రకు కీలకమైన ఉప నది ఇది. కర్నూలు నగరం మధ్యలో 5.40 కి.మీలు ప్రవహించే ఈ నది వివిధ ప్రాంతాల్లో 200 నుంచి 300 మీటర్ల వెడల్పు ఉండాలి. గరిష్ఠ వరద ప్రవాహ అంచుల (మ్యాగ్జిమమ్‌ ఫ్లడ్‌ లెవల్‌-ఎంఎ్‌ఫఎల్‌) నుంచి 50 మీటర్లు (150 అడుగులు) వరకు నదీగడ్డ వెడల్పు (బఫర్‌ జోన్‌) ఉంటుందని జలవనరుల శాఖ ఎఫ్‌ఆర్‌ఎల్‌ డివిజన్‌ ఇంజనీర్లు తెలిపారు. ఎంఎ్‌ఫఎల్‌ లెవల్‌ దాటి వరద వచ్చినా ఊళ్లు, పొలాలు మునిగిపోకుండా నదీ తీరం వెంబడి 50 మీటర్లు బఫర్‌ జోన్‌ ఉంటుందని ఇంజనీర్లు తెలిపారు. రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. కల్లూరు రెవెన్యూ గ్రామం ఖాతా నంబరు 20000512 కింద సర్వే నం.422-ఎ2, 424-ఏ3, 470-బి, 470-సి, 470-ఇ3, 498-ఏ1బి, 533-ఏ1, 770-ఎఫ్‌1 పరిధిలో 201.7125 ఎకరాలు, సర్వే నంబరు 470-బి పరిధిలో 49.0925 ఎకారాలు ప్రభుత్వ భూమిగా చూపారు. అయితే పందిపాడు నుంచి జొహరాపురం వరకు పలుప్రాంతాల్లో నది ఒడ్డును అక్రమించి నిర్మాణాలు చేపట్టారు. 2007, 2009లో హంద్రీనదికి వరదొచ్చి కాలనీలో ముంపునకు గురై భారీ నష్టం చవిచూడాల్సి వచ్చింది. వరదొస్తే కాలనీలకు కాలనీలు ముంపునకు గురవుతుండడంతో రక్షణ గోడ (ప్రొటెక్షన్‌వాల్‌) నిర్మాణానికి ప్రభుత్వం నిధులు ఇచ్చింది. సర్వేకు వెళ్లిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. 270 పైగా ఆక్రమణలు గుర్తించి నోటీసులు ఇచ్చామని కార్పొరేషన్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు అంటున్నారు. దేవానగర్‌లో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, బిల్డర్‌ ఒకరు హంద్రీ నది బఫర్‌జోన్‌ను అక్రమించి ప్రహరీ నిర్మించారు. అంతటితో ఆగకుండా భవనాలు నిర్మించేసి యథేచ్ఛగా అమ్మకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హంద్రీ అక్రమణలపై ఆంధ్రజ్యోతి పలుమార్లు వెలుగులోకి తెచ్చింది. స్పందించిన జలవనరుల శాఖ ఎఫ్‌ఆర్‌ఎల్‌ డివిజన్‌ ఈఈ నారాయణరెడ్డి, డీఈఈ రామకృష్ణలు సరిహద్దు గుర్తించి.. రాళ్లు పాతేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ప్రభుత్వం నిధులు ఇవ్వడంతో సరిహద్దు రాళ్లు తీసుకొచ్చారు. జాయింట్‌ కలెక్టర్‌ నవ్య ఆదేశాల మేరకు కల్లూరు మండలం సర్వేయర్‌ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. గురువారం పందిపాడు నుంచి ఇరిగేషన్‌ ఎఫ్‌ఆర్‌ఎల్‌ డివిజన్‌ ఈఈ నారాయణరెడ్డి, డీఈఈ రామకృష్ణ, ఏఈఈ పొట్టెప్ప, సర్వేయర్‌ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సర్వే చేసి సరిహద్దు రాళ్లు నాటే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కల్లూరు, కర్నూలు నగరం పరిఽధిలో రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వాస్తవ విస్తీర్ణం గుర్తించి సరిహద్దు రాళ్లు నాటుతారా..? ఆక్రమణలు తరువాత కుచించుపోయిన నది విస్తీర్ణం ఎంత ఉందో.. అక్కడికే కొలతలు వేసి సర్వే రాళ్లు నాటుతారా..? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. అక్రమణలు గుర్తించి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎన్నో దశాబ్దాల తర్వాత నదీసరిహద్దులు గుర్తింపు సర్వేలు చేపట్టడమే కాకుండా పక్కాగా సిమెంట్‌ పిల్లర్లు ఏర్పాటు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Updated Date - Mar 28 , 2025 | 12:01 AM